
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న 52 మందిలో దుష్ప్రభావాలు బయటపడటం కలకలం రేపుతోంది. కోవాగ్జిన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసుకున్న కొందరిలో వ్యాక్సిన్ వేసుకున్న15-20 నిమిషాల తర్వాత గుండె దడ, అలర్జీ, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు తలెత్తినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు. అయితే సత్వర చికిత్స అందించడంతో వారు వెంటనే కోలుకున్నట్లు తెలిపారు. అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని రెండు రోజులు డాక్టర్ల పర్యవేషణలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో ఎయిమ్స్ ఉద్యోగి సహా 52 మందిలో వ్యాక్సిన్ దుష్ప్రభాలు బయటపడినట్లు గులేరియా తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండగా, మిగిలిన వారు చికిత్స అనంతరం యధాస్థితికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. కోవాగ్జిన్ టీకా వేసుకున్న వీరందిరిలో ఒకే రకమైన దుష్ప్రభావాలను గమనించినట్లు గులేరియా వెల్లడించారు. చర్మ సంబంధిత అలర్జీలు, గుండె దడ, తేలికపాటి జ్వరం లాంటి సమస్యలు బయటపడినట్లు పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని, రోగనిరోధక శక్తి తక్కువగా వారిలో వ్యాక్సిన్ వేసుకున్న తరువాత ఇలాంటి దుష్ప్రభావాలు బయటపడటం సాధారణమేనని ఆయన పేర్కొన్నారు. కాగా, తొలి రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8,117 మంది హెల్త్ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉండగా, కేవలం 4,319 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి కనబర్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment