కోవాగ్జిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. 14 రకాలు | 14 Types Of Side Effects Found With Corona Vaccine Covaxin | Sakshi
Sakshi News home page

కోవాగ్జిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌.. 14 రకాలు

Published Wed, Jan 20 2021 4:08 AM | Last Updated on Wed, Jan 20 2021 3:34 PM

14 Types Of Side Effects Found With Corona Vaccine Covaxin - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవాగ్జిన్‌ కరోనా టీకాతో 14 రకాల సాధారణ సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. ఇవిగాక అరుదుగా మరో ఐదు రకాల సీరి యస్‌ రియాక్షన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. టీకా తీసుకునే ముందు కేంద్రంలో ఉన్న వైద్య సిబ్బందికి లబ్ధిదారులు తమ ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా వివరించాలని, కొన్ని రకాల అల ర్జీలు, రక్తస్రావం సమస్యలు, జ్వరంతో ఉన్నవాళ్లు, బ్లడ్‌ థిన్నర్‌లు (రక్తాన్ని పలుచ బరిచే మందులు) వాడుతున్న వారు, రోగనిరోధక శక్తి తక్కువున్న వారు.. కోవాగ్జిన్‌ టీకాను  తీసుకోకపోవడమే మంచిదని సూచించింది.

కోవాగ్జిన్‌ తీసుకోవా లని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నుంచి సందేశాలు అందినవారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. ఈ మేరకు ఐదు పేజీలతో కోవాగ్జిన్‌ టీకా ఫ్యాక్ట్‌షీట్‌ను భారత్‌ బయోటెక్‌ తాజాగా విడుదల చేసింది. టీకా వేసుకునే ముందు కేంద్రంలో కోవాగ్జిన్‌పై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని లబ్దిదారులకు సూచించింది. అనంతరం వేసుకోవాలా? లేదా? అనేది లబ్దిదారుల ఇష్టమేనని స్పష్టం చేసింది. టీకా వేసుకోవడానికి లేదా తిరస్కరించడానికి కూడా లబ్దిదారుడికి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. 

నెల రోజుల్లో దాని సామర్థ్యంపై స్పష్టత
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు అనుమతి లభించిందని ఫ్యాక్ట్‌షీట్‌లో భారత్‌ బయోటెక్‌ తెలిపింది. అందువల్ల వ్యాక్సిన్‌ వేసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే దీనికి సంబంధించి మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా జరుగుతున్నాయని వివరించింది. ఈ నెల 6వ తేదీన మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 25,800 మందికి కోవాగ్జిన్‌ మొదటి డోస్‌ ఇచ్చారు. వారికి రెండో ఇంజెక్షన్‌ ఫిబ్రవరి 4వ తేదీన వేస్తారు. అప్పటి నుంచి 14 రోజులకు అంటే ఫిబ్రవరి 18వ తేదీ నాటికి వారిలో... ఎందరిలో ఏమేరకు యాంటీబాడీలు తయారయ్యాయో నిర్దారణకు వస్తారు. అంటే దాని సామర్థ్యం మరో నెలకు తెలుస్తుందని తెలిపింది.  

ఈ సమస్యలు రావొచ్చు...
కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న కొందరిలో సాధారణంగా 14 రకాల సైడ్‌ఎఫెక్ట్స్‌ తలెత్తుతాయి. వికారం, వాంతులు, దద్దుర్లు, నీరసం, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఇంజెక్షన్‌ వేసినచోట నొప్పి, వాపు, ఎర్రబారడం, దురద వంటివి ఉంటాయి. అలాగే ఇంజెక్షన్‌ వేసిన చేయి పైభాగం బిగుతుగా (కండరాలు పట్టేసినట్లుగా) తయారవుతుంది. ఇలా కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. ఇక చాలా అరుదుగా కొందరిలో ఐదు రకాల సీరియస్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశముందని తెలిపింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం, ముఖంపైనా, గొంతులో వాపు రావడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం, మైకంతో కూడిన నీరసం ఏర్పడటం జరుగుతుంది. 

వ్యాక్సినేషన్‌ ముందు డాక్టర్‌కు ఇవి చెప్పాలి...
– ఏమైనా రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా? దేనికోసం వాడుతున్నారు? ఆయా వివరాలు.
– ఏమైనా అలర్జీలు ఉన్నాయా?
– జ్వరం ఉందా
– రక్తస్రావం వంటి సమస్యలు
– బ్లడ్‌ థిన్నర్‌ వాడుతున్నారా?
– రోగ నిరోధక శక్తికి సంబంధించి సమస్యలున్నాయా?
– గర్భంతో ఉన్నారా?
– పాలు ఇచ్చే తల్లులా
– ఇంతకుముందు ఏదైనా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారా?

మూడు నెలల పర్యవేక్షణ...
దాదాపు క్లినికల్‌ ట్రయల్స్‌ పద్దతిలోనే ఈ వ్యాక్సిన్‌ను లబ్దిదారులకు వేస్తారు. ఇది అన్నిచోట్ల అందుబాటులో ఉండదు. కాబట్టి నిర్దేశించిన టీకా కేంద్రాల్లోనే వీటిని వేయాలి. రెండు డోసులు వేసుకున్నాక చివరి డోస్‌ నుంచి మూడు నెలల వరకు టీకాదారుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది.  వారికి ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే ప్రభుత్వ నిర్దేశిత ఆసుపత్రుల్లో చికిత్స ఇస్తారు. టీకా వేసుకున్నవారు అవసరమైతే భారత్‌ బయోటెక్‌కు చెందిన టోల్‌ఫ్రీ నెంబర్‌ 18001022245కు ఫోన్‌ చేయవచ్చు. ఒకవేళ ఏదైనా సీరియస్‌ సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే ఐసీఎంఆర్‌ నైతిక విలువల కమిటీ విచారణ అనంతరం వాళ్లకు నష్టపరిహారాన్ని కంపెనీ చెల్లిస్తుంది. వీటన్నింటినీ ఒప్పుకున్నవారు కోవాగ్జిన్‌ టీకా వేసుకునేముందు అంగీకారపత్రం పైనా సంతకం చేసి ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement