‌వ్యాక్సిన్‌ పంపిణీకి అంతా సిద్ధం | Hyd And Dubai Airports Are Ready to Dispense The Corona vaccine | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు దుబాయ్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌!

Published Tue, Jan 5 2021 9:00 AM | Last Updated on Tue, Jan 5 2021 9:00 AM

Hyd And Dubai Airports Are Ready to Dispense The Corona  vaccine - Sakshi

జీఎమ్మార్‌ కార్గొ కార్యాలయం

సాక్షి, హైదరాబాద్‌: ఏడాదికి పైగా మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ను అందజేసేందుకు హైదరాబాద్, దుబాయ్‌ ఎయిర్‌పోర్టులు సన్నద్ధమయ్యాయి. వ్యాక్సిన్‌ల ఉత్పత్తికి గ్లోబల్‌ హబ్‌ అయిన హైదరాబాద్‌ నుంచి వాటిని వివిధ దేశాలకు తరలించేందుకు గ్లోబల్‌ ఎయిర్‌కార్గోకు హబ్‌గా నిలిచే దుబాయ్‌ ఎయిర్‌పోర్టు ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ మేరకు రెండు విమానాశ్రయాల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. వివిధ ఫార్మా సంస్థల నుంచి ఎగుమతయ్యే వ్యాక్సిన్‌లను నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచి కార్గో ఫ్లైట్స్‌ ద్వారా దుబాయ్‌ మీదుగా వివిధ దేశాలకు తరలిస్తారు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ సరఫరాకు హైదరాబాద్‌–దుబాయ్‌ ఎయిర్‌ ఫ్రైట్‌ కారిడార్‌ గ్లోబల్‌ గేట్‌ వేగా అవతరించనుందని జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ను సురక్షితంగా, సమర్థంగా చేరవేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ నిర్వహణ సదుపాయాలను మరింత మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు.   

 ఇదీ ఒప్పందం.. 
హైదరాబాద్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్‌లు ఎగుమతి అవుతాయి. దేశీయంగా కూడా వ్యాక్సిన్‌ పంపిణీలో హైదరాబాద్‌ విమానాశ్రయానికి ఉన్న కనెక్టివిటీ దోహదపడగలదని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్, దుబాయ్‌ విమానాశ్రయాలు ‘హైదరాబాద్‌ దుబాయ్‌ గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కారిడార్‌’పైన ప్రత్యేక ఒప్పం దం చేసుకున్నాయి. జీఎమ్మార్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు సీఈఓ ప్రదీప్‌ పణికర్, ఎయిర్‌కార్గో సీఈఓ సౌరభ్‌ కుమార్, దుబాయ్‌ ఎయిర్‌పోర్టు ఈవీపీ కమర్షియల్‌ యూజీన్‌ బారీలు కలసి ఒక వర్చువల్‌ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ మేరకు రెండు విమానాశ్రయాలు వివిధ ఖండాలకు రవాణా అయ్యే టెంపరేచర్‌ సెన్సిటివ్‌ వ్యాక్సిన్లకు ప్రాధాన్యతనిస్తాయి. దీంతో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాల నుంచి విమానాశ్రయానికి, అక్కడి నుంచి హబ్‌ లాజిస్టిక్స్, అటు నుంచి వినియోగదారులకు వ్యాక్సిన్‌ డెలివరీ ప్రక్రియ సాఫీగా సాగుతుంది.

సురక్షిత పంపిణీ.. 
భారత్‌ నుంచి వ్యాక్సిన్‌ ఎగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో మొదటి నుంచీ ఒక ప్రధాన ముఖద్వారంగా ఉందని సీఈవో ప్రదీప్‌ పణికర్‌ అన్నారు. ప్రస్తుత కోవిడ్‌ నేపథ్యంలో వ్యాక్సిన్లను సురక్షితంగా, సమర్థంగా రవాణా చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక, పరస్పర సహకారం అవసరమన్నారు. ఈ క్రమంలోనే కోవిడ్‌ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కోల్డ్‌ నుంచి అల్ట్రాకోల్డ్‌ ఉష్ణోగ్రత పరిధులు అవసరమైన కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌ కార్గో కేంద్రంగా హైదరాబాద్‌ అవతరించిందన్నారు. 

సందేహాలొద్దు
కోవాగ్జిన్‌ టీకాపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని.. అది మంచినీరులా సురక్షితమైనది భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. మూడో దశ మానవ ప్రయోగాలు పూర్తి కాకుండానే అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించడంపై పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ టీకాపై ఈ స్థాయిలో వ్యతిరేకత రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. కోవాగ్జిన్‌ ప్రయోగాలు 200 శాతం నిజాయితీగా నిర్వహించామన్నారు.

భారత్‌ బయోటెక్‌ ఇప్పటివరకు 16 సురక్షితమైన, ప్రభావవంతమైన టీకాలను తయారుచేసిందని, అన్నిరకాల సమాచారాన్నీ పారదర్శకంగా అందించామని వివరించారు. యూకేసహా పలు దేశాల్లో కంపెనీ ప్రయోగాలు నిర్వహించిందని, తమను అనుభవం లేని కొందరు విమర్శించడం సరికాదన్నారు. భారత్‌ బయోటెక్‌ భారతీయ కంపెనీ అనే దానికంటే అంతర్జాతీయ కంపెనీ అనడం సబబు అని చెప్పారు. జికా వైరస్‌ను ముందు గుర్తించింది తామేనని, వ్యాక్సిన్‌ పేటెంట్లూ భారత్‌ బయోటెక్‌ పేరుతోనే ఉన్నాయని అన్నారు.  

‘వ్యాక్సిన్‌కు అనుమతి గర్వకారణం’ 
 దేశీయ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి లభించడం మన దేశానికే గర్వకారణమని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర వైద్య కళాశాలలో సోమవారం  నిర్వహించిన ఓ కార్యక్రమానికి గవర్నర్‌ వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో దేశం చూపిన చొరవకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రశంసలు లభించాయని, మన శాస్త్రవేత్తల నైపుణ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement