
అందరం రైలుకు వెళుతున్నామన్నావే!
► అందుకే ఒప్పుకున్నా..!
► దుఃఖంతో రోదించిన మృతురాలి తండ్రి
సిరుగుప్ప : నాయనా.. అందరూ ఫెండ్స్ కలిసి రైలుకు వెళుతున్నారు అన్నందుకే వెళ్లమని ఒప్పుకొన్నానని క్రూసర్ వాహనంలో వెళ్తామంటే ఒప్పుకొనేవాణ్ణి కాదని కన్నీరు కారుతుండగా గద్గద స్వరంతో మృతురాలి తండ్రి విరుపాక్షగౌడ తెలిపారు. తాలూకాలోని ఇబ్రాంపురం గ్రామంలో ఆదివారం ‘సాక్షి’తో మృతురాలి తండ్రి విరుపాక్షగౌడ తన ఆవేదన వెలి బుచ్చారు. తనకు పెద్ద కూతురు డీ.సుధా(19), ఇద్దరు కుమారులు ఒకరు దొడ్డబసవ(16), ఇంకొకరు నవీన్ కుమార్(13) వున్నారని తెలిపారు. కూ తురు సుధా బళ్లారిలోని శ్రీగురు తిప్పేరుద్ర కాలేజ్‌లో మొదటి సంవత్సరం బీ.కాం చదివిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగమేళాలో సెలెక్ట్ అయి బెంగళూరులో ఓరల్ ఇంటర్వ్యూ కోసం వెళ్లి కానరాని లోకానికి వెళ్లిందని పట్టరాని దుఃఖంతో తెలుపుతూ వుంటే పక్కన వున్న జనం కూడా దుఃఖం ఆపుకోలేక పోయారు. దిననిత్యం హోటల్ జీవనం సాగిస్తూ పిల్లలను చదివిస్తున్నానని తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబం ఇంకా దుఃఖం నుంచి తేరుకోలేదు. గృహము, కుటుంబ జీవనానికి తోడ్పడుతున్న హోటల్ నిర్మానుష్యంగా మారాయి.
గ్రామంలోని ప్రతి ఒక్కరు మృతురాలు సుధా తల్లి దండ్రులను ఓదార్చుతూ వున్నారు.
ఎంత ఓదార్చిన వారి శోకం చూసే వారి హృదయాలను కలిచి వేస్తోంది. ఏదిఏమైనా ఇబ్రాంపురం గ్రామంలో హోటల్ జీవనం సాగించుకుంటున్న విరుపాక్షగౌడ తన పిల్లలను గారాబంగా పెంచి ఉన్నత చదువులు చదివించాలనుకొన్న ఆశలు పూర్తికాకముందే భగవంతుడు డీ.సుధాను పరలోకానికి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చింతిస్తున్నారు.