మిలిటరీ సాంకేతిక నామంతో బి.ఎఫ్ 332 అని చోటు ఉంది. రోజస్తమానం అప్‌దైనా సరే డవున్‌దైనా సరే ఒక్క ట్రెయినైనా అక్కడ ఆగదు. ఒకటి ఆగుతుంది. అయితే అదొక స్పెషల్ ట్రెయిన్. అకస్మాత్తుగా ఒకరోజు తెల్లవారుజామున వచ్చి ఆగుతుంది. అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుంది, ఆ సంగతి ముందుగా బిహారీ వంటవాడు భగవతిలాల్‌తో పాటు మాకు ఒక అయిదు మందికి మటుకు తెలుసును.స్టేషన్ లేదు, ట్రెయిన్ ఆగదు, అయినా రైల్వేసిబ్బంది ప్రతివాడి నోటిలోనూ ఒక కొత్త పేరు అల్లల్లాడుతుంది. దాన్ని మేము ‘అండా హాల్ట్’ అంటుంటాం. ‘అండా’ అంటే గుడ్డు. అండా హాల్ట్ దగ్గరగా ఉన్న కొండల కింద ‘మహాతా’ కులాల గ్రామం ఉంది. అక్కడికి దూరంగా ఉన్న భోర్‌కుండాలోని శనివారం సంతలో వాళ్లు కోళ్లనూ, కోడిగుడ్లను అమ్ముతూ ఉంటారు. చంకలో కోడిపుంజులు పెట్టుకొని కోడిపందాల ఆట ఆడుతుంటారు. మహాతా గ్రామస్థుల కోడిగుడ్లపై మాకేమీ ప్రత్యేకమైన మోజు లేదు. మా కాంట్రాక్టరుతో రైల్వేవాళ్లకు వ్యవహారం జరుగుతూ ఉంటుంది. ఒక ట్రాలీకి ఎర్రజెండా తగిలించి రైలు పట్టాలపై నుంచి గుంపులు గుంపులుగా కోడిగుడ్లు తీసుకువచ్చి అప్పచెపుతూ ఉంటారు. బిహారీ వంటవాడు భగవతీలాల్, వాటిని రాత్రి ఉడకబెట్టి ఉంచుతాడు. అందుమూలాన కూడా కాదు దానికి ‘అండా హాల్ట్’ అని పేరు రావడం. ఈ గుడ్లు పూర్తిగా ఉడకడం అయాక వాటి గుల్లలు బైట పారెయ్యడం వల్ల అవి పోగుపడ్డ చోట కాలక్రమాన ఒక గుల్లలకొండ లేచింది. ఇదీ అసలు కారణం. మిలిటరీ భాషలో ఉన్న బి.ఎఫ్ 332లో ఉన్న మొదటి రెండు అక్షరాలూ మాకు ఏదో సాంకేతికమైనవి కాదు. బ్రేక్‌ఫాస్టు, పదానికి ఎబ్రీవియేషను అని మేము అనుకుంటాం.
రామ్‌గఢ్ ఆ రోజుల్లో యుద్ధకాలపు ఖైదీల మకాం. ఇటలీ దేశపు ఖైదీలను అక్కడ బాయొనెట్సుతోనూ, వైర్‌ఫెన్స్‌తోనూ చుట్టబెట్టి ఉంచారు. దాని మధ్య ఒక ట్రెయిన్ సామాను ఎగుమతి చేసుకొని బయలుదేరుతుంది. ఎందుకో ఎక్కడికో మాకెవరికీ తెలియదు. కంట్రాక్టరు వ్రాసిన ఉత్తరం చదివి క్రితం రోజున వచ్చిన కోడిగుడ్లు పరీక్షించి, వంట మనిషి భగవతిలాల్ అన్నాడు ‘‘330 బ్రేక్‌ఫాస్టులు’’. భగవతిలాల్ లెక్కపెట్టి 660 గుడ్డులూ, ఒక పాతిక రద్దుపోయేందుకు ఇవతలకు తీస్తాడు. చెడ్డవి బయటకు పారేస్తాడు. అటుపైన వాటిని నీటిలో ఉడకపెట్టి, అవి బాగా గట్టిపడ్డాక, కూలీలు, అతనూ కలిసి గుల్లలు విడదీస్తారు. వైర్ ఫెన్సింగ్‌కి బైట పారవేయబడిన ఆ గుల్లలు రోజూ ఒక స్థూపంలా తయారవుతాయి.తెల్లవారుజామున ట్రెయిన్ వచ్చి ఆగుతుంది. కంపార్ట్‌మెంట్‌లో నుంచి దిగి ట్రెయిన్ రెండుపక్కలా మిలిటరీగార్డులు వచ్చి నిలబడుతారు. రైఫిల్స్ తీసుకుని, వాళ్లు యుద్ధఖైదీలను కాపలా కాస్తారు. చారల బట్టలు కట్టుకున్న విదేశీ ఖైదీలు పింగాణి కప్పు, ఎనామెలు ప్లేటు పుచ్చుకొని గదుల్లో నుంచి బయటికి వస్తారు. ఒక్కొక్క ఖైదీకి వరుసగా బ్రేక్‌ఫాస్ట్ వడ్డిస్తారు కూలీలు. ఒకడు మగ్గులో కాఫీ పోస్తాడు. ఒకడు బ్రెడ్డూ, మరొకడు కోడిగుడ్డూ పళ్లెంలో వేస్తారు. అంతే, అంతటితో వాళ్లు వెళ్లి ట్రెయిన్ ఎక్కుతారు.ట్రెయిన్ వెళ్లిపోయాక భగవతీలాల్ ఆజమాయిషీలో అన్ని సరుకులూ గుడారంలో పెట్టి కూరలు కొనేందు కోసం కొన్ని రోజులు మేము మహాతా వాళ్ల గ్రామం వైపు వెళతాము. వైర్ ఫెన్సింగ్ మధ్య ప్రాంతాన్ని ఎత్తు చేసి ప్లాట్‌ఫారంగా తయారుచేశారు. ఖైదీల కాంపు మూసేసారు. మధ్యమధ్య ఒక మిలిటరీ స్పెషల్ ట్రెయిన్ వచ్చి ఆగుతుంది.
సైనికులందరికీ గిన్నెలలో కాఫీ, ప్లేటులలో రొట్టి, కోడిగుడ్లూ యథావిధిగా పంచిపెట్టబడతాయి. దాని తర్వాత ఎవరి పెట్టెలో వాళ్లు ఎక్కుతారు. గార్డు ఈల ఊదుతాడు. నేను వెళ్లి సప్లైలు అందించే చోట మేజర్‌కి ఓకే చెప్పివస్తాను. ట్రెయిన్ వెళుతుంది. ఎక్కడికో, ఏ వైపుకో ఎవరికీ తెలియదు. ఒకరోజు అమెరికన్ సైనికుల ట్రెయిన్ వచ్చి నిలబడింది. సర్వర్లు రోటీ, కాఫీ అందించారు. సరిగ్గా అదే సమయంలో వైర్ ఫెన్సింగు అవతల సరిహద్దుపైన నా దృష్టి పడింది. ముళ్లకంచెకి కొంచెం దూరంలో ఒక చిగురు నిక్కరు కట్టుకున్న ‘మహాతా’ కుర్రవాడు కళ్లు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. నిశ్శబ్దంగా ట్రెయిన్ కేసి చూశాడు. ఈ తెల్ల అమెరికను సైనికులని చూశాడు. ఒక సోల్జరు వాణ్ణి చూసి ‘ఏయ్ ఏయ్’ అని అరుస్తూ పిలిచాడు. ఆ కుర్రవాడు వెంటనే వాళ్ల ఊరువైపు పరుగెత్తుకుంటూ పారిపోయాడు. వాణ్ణి చూసి కొందరు అమెరికన్ సైనికులు నవ్వుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఒకసారి ట్రెయిన్ రావడం చూసి ఆ ఇనుపబెల్టు పెట్టుకున్న కుర్రవాడు ఫెన్సింగ్ బైటికి వచ్చి నిలబడ్డాడు. వాడి కంటె పెద్దవాడు మరొక కుర్రవాడు కూడా ఉన్నాడు. వాడి మెడలో ఎర్రటి తాడు వేలాడదీసిన తగరపు రక్షరేకు ఉంది. భూర్‌కు సంతకు ఒకరోజు వెళ్లాను. అక్కడ కుప్పలు కుప్పలుగా అవి అమ్మకానికి ఉన్నాయి. ఆ బాలకులిద్దరూ మౌనంగా అమెరికన్ సైనికుల వైపు తేరిపార చూస్తున్నారు. నేను చేతిలో ఫారం పుచ్చుకొని అటూ ఇటూ తచ్చాడుతున్నాను. ఒక సైనికుడు తన కంపార్ట్‌మెంట్ తలుపుకి ముందుగా నిలబడి కాఫీ తాగుతూ కుర్రవాళ్లిద్దర్ని చూసి ‘ఫూల్’ అన్నాడు. మామూలుగా వాడిది వ్యవసాయపు పని. బాణం పుచ్చుకొని పిట్టలను కొట్టడం, పాటలు పాడడం, వినడం. విల్లునారిలాగ అప్పుడప్పుడు వంగుతూ సాగుతూ పొగరుబోతులా ఎదిరిస్తున్నట్లు నిలబడడం. చిరిగిన లాగు కట్టుకున్న వాడి శరీరం సన్నగా, నల్లగా ఉంటుంది. అమెరికన్ సిపాయి అన్న ‘ఎ ఫూల్’ అన్నమాట నా గుండెకు ముల్లులా గుచ్చుకుంది.ట్రెయిన్ వెళ్లిపోయింది. మళ్లీ అంతా నిర్మానుష్యం. మళ్లీ కొన్నాళ్లకు ట్రెయిన్ వచ్చింది. ఈసారి యుద్ధఖైదీల బండి. ఇటాలియన్ ఖైదీలు రామ్‌గఢ్ నుంచి మళ్లీ ఎక్కడికో పంపబడ్డారు. వాళ్ల చారల బట్టలలో దైన్యం ఉంది. ఒకడు పంచా, లాల్చి కట్టుకుని పారిపోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడని, బెంగాలీని కాబట్టి నాకింకా భయం వేసింది.
ట్రెయిన్ వెళ్లిపోయాక– ముళ్లకంచె అవతల ఇద్దరు కుర్రవాళ్లు, బిగువు బట్టలు ధరించిన 15 సంవత్సరాల పిల్లా, ఇద్దరు పెద్ద మగవాళ్లూ పొలం పని విడిచి అక్కడకు వచ్చి నిలబడ్డారు. వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని, నవ్వుకుని, ఏదో జలపాతం చప్పుడయినట్లు కిలకిలలాడుతూ వాళ్ల ఊరు వైపు వెళ్లిపోయారు.ఒకరోజు వెళ్లి మహాతా వాళ్ల పెద్దను అడిగాను–వాళ్ల తాలూకు ఎవరినైనా పంపి మా క్యాంపులో కూరలు, చేపలు, రొయ్యలు... మొదలైనవి అమ్మించమని. ఆ పెద్ద నవ్వి అన్నాడు ‘‘పొలం పని విడిచి రాలేము’’ అదే క్షణంలో ట్రెయిన్ వచ్చేసింది. వెంటనే దిగారు అమెరికన్ సైనికులు–వరుసగా నిలబడ్డారు తమ కప్పులు, ప్లేట్లతో. ఆ కాలంలో కొంచెం చలి మొదలైంది. ఒక సైనికుడు యాంకీ గొంతుతో తన ముగ్ధతను వెల్లడి చేశాడు. మరొక సైనికుడు తన కంపార్ట్‌మెంట్ ఎదురుగా నిలబడి ముళ్ల కంచెకు అవతల ఉన్న శూన్యప్రదేశాన్ని తదేక దృష్టితో పరిశీలించాడు. అకస్మాత్తుగా అతను లాగు జేబులో చెయ్యి పెట్టాడు. పర్సులో నుంచి ఒక మెరిసే అర్ధరూపాయి బైటకు తీసి ఆ మహతా వాళ్ల వైపు విసిరాడు. వాళ్లు నిర్ఘాంతపోయి సైనికుల దిక్కుగా చూశారు. మెరిసే అర్ధరూపాయి దిక్కుగా చూశారు. తరువాత నిశ్శబ్దంగా ఉండిపోయారు.ట్రయిన్ వెళ్లిపోయాక వాళ్లు నిశ్శబ్దంగా వెళ్లిపోవడం చూసి నేను అన్నాను, ‘‘దొరగారు బహుమానం ఇచ్చారు. ఎందుకు తీసుకోరూ?’’
నేను అర్ధరూపాయి తీసి వాళ్ల పెద్ద చేతిలో పెట్టాను. అతను వెర్రి మొహం పెట్టి నాకేసి చూస్తూ అలా ఉండిపోయాడు. తర్వాత అందరూ మాట్లాడకుండా వెళ్లిపోయారు.మహతా గ్రామవాసులు నా దగ్గరకు రావడం మానేశారు. అప్పుడప్పుడు నేనే వెళ్లి అక్కడ కూరలు, చేపలు కొనుక్కొని వస్తుంటాను. వాళ్లు అమ్మేందుకు రావడం లేదు మా దగ్గరకు. మూడు క్రోసుల దూరంలో ఉన్న భూర్‌కుండాలోని సంతకు వెళుతున్నారు. కొన్నాళ్లు ఏ ట్రెయిన్ రాక గురించి కబురు రాలేదు. నిశ్శబ్దం నిశ్శబ్దం. అనుకోకుండా ఒకరోజున ఆ లోహపుబెల్టు పెట్టుకున్న కుర్రవాడు వచ్చి అడిగాడు:‘‘టెరియిను రాదాండి, బాబుగోరూ?’’నవ్వుతూ అన్నాను: ‘‘వస్తుంది. వస్తుంది’’తెల్లవారుజామున ఒక పాసెంజర్ తుస్సుమంటూ వెళుతుంది. సాయంత్రం డౌన్ ట్రెయిన్ ఆగదు. అయినా ఏదో సమయాన ట్రెయిన్ కిటికీలోంచి అస్పష్టంగా కనిపించే ముఖాల్ని చూడగలనేమోనని క్యాంప్‌లోంచి బైటకు వచ్చాను. కొత్తముఖాలు చూడక నా బెంగ ఎక్కువైపోతుంది. ఆ అమెరికన్ సైనికుల స్పెషల్ ట్రెయిన్ వస్తుందన్న వార్త విని ఎంత గాభరా పడతానో మళ్లీ అంత తృప్తి కూడా కలుగుతుంది.కొన్నాళ్ల తరువాత మిలిటరీ స్పెషల్ వచ్చింది. హఠాత్తుగా చూసేసరికి ముళ్లకంచెకు అవతల వైపు మహతా గ్రామ ప్రజలు గుంపుగా వచ్చి పడ్డారు. వాళ్లందరినీ చూసేసరికి నాకేదో భయం అనిపించింది. అమెరికన్ సైనికులు కాఫీ తాగుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉండిఉండి ఒకడు తన జేబులోంచి మనీపర్సు తీసి, అందులో నుంచి రెండురూపాయల కాగితంలాగి భగవతిలాల్‌ని అడిగాడు ‘‘దీనికి చిల్లర ఉందా?’’అణాలు,బేడాలు, పావలాలు కలిపి భగవతిలాల్ చిల్లర ఇచ్చాడు. చిల్లరను ఆ అమెరికన్ సైనికుడు మహాతా గ్రామస్థుల గుంపులోకి విసిరేశాడు. నా సఫ్లై ఫారంని ఓకే చేసి, గార్డు ఈల ఊదాడు. ట్రెయిన్ కదలడం మొదలు పెట్టిందనేసరికి, నేను మహతా జనం వైపు చూశాను. వాళ్లు అలా చూస్తూనే నిలబడిపోయారు. బెల్టు కట్టుకున్న వాడూ, వాడి స్నేహితుడు మెళ్లో తావీజు కట్టుకున్నవాడూ ఆ చిల్లర డబ్బులను పోగు చేయడానికి ప్రయత్నించారు. మహతా పెద్ద వాళ్లని తిడుతూ ‘ఖబడ్దార్’ అన్నాడు. కాని ఆ కుర్రవాళ్లు అతని మాటలు వినలేదు. వాళ్లు దొరికినంత మట్టుకు అణాలు బేడలు పోగు చేసి తీసుకున్నారు. మహతా పెద్ద కోపంతో గిజగిజలాడుతూ తను ఒక్కడూ స్వగ్రామం వైపు బయలుదేరాడు. ఆడవాళ్లూ, మగవాళ్లూ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లాక మళ్లీ ‘అండా హాల్ట్’ నిర్మానుష్యం అయిపోయింది.
దూరాన కొండలూ, ‘మహతా’ పళ్లతోట, కూరల తోట దాటాక ఒక చిన్న జలధార, దాని తర్వాత మహతా వాళ్ల ఆకుపచ్చని పొలాలు. కళ్లు చల్లబడి హాయి అనిపిస్తుంది.మధ్యమధ్యన అమెరికను సోల్జర్ల ట్రెయిన్ రావడం, ఆగడం, వాళ్లు గుడ్లు, రొట్టె, కాఫీ సేవించి వెళ్లిపోవడం, మహతా గ్రామజనం గుంపులుగా రావడం, ముళ్ల కంచెకు అవతల నిలబడి తేరిపారచూడడం..‘‘దొరగారూ, బహుమతి! దొరగారూ! బహుమతి!’’ఒక్కసారి అనేకమంది పల్లెజనం అరిచారు. ఒకరోజున కూరగాయలు కొనేందుకు నేను వెళ్లినప్పుడు ఆ పిల్ల అడిగింది: ‘‘టెరియిను ఎప్పుడొస్తుంది?’’ఒక్కొక్క రోజున వీళ్లందరూ చాలాసేపు ఎదురుచూసి, చూసి వెళ్లిపోయేవారు. భుజానికి 3 చారలు గల చొక్కా తొడుక్కున్న అమెరికన్ ఒకడు వాళ్లను చూడగానే జేబులోంచి గుప్పిళ్లతోటి అణాలూ, బేడాలుతీసివాళ్ల వైపు విసిరేవాడు. వాళ్లు ఆ డబ్బుల మీద పడిపోయేవారు పోగు చేసుకుందుకు.ట్రెయిన్ వెళ్లాక వాళ్లని సావధానంగా పరీక్షించి చూశాను. మహతా గ్రామంలోని సగం మంది వచ్చి పడ్డారనిపించింది. అందరికీ ఏదో కొంత డబ్బు దొరికే సరికి వాళ్ల ముఖంలో ఆనందరేఖలు వెలిగేవి.వంటవాడు భగతిలాల్, ముగ్గురు సర్వర్లూ, నేనూ మేము ఐదుగురం ఎలాగోలాగా క్యాంపులో రోజు వెళ్లబుచ్చేవాళ్లం. మధ్య మధ్య ఒక్కొక్క రోజున సైనికుల ట్రెయిన్ వచ్చేది, ఆగేది, వెళ్లేది. మహతా›గ్రామ గుంపు ‘‘సాబ్, బక్షీస్! బక్షీస్’’ అని చేతులు జాపి అరిచేది.ఒకరోజున మహతా వాళ్ల పెద్దను చూడడం తటస్థించింది. ఒకరోజు పొలం పని ఆపు చేసి, చేతుల్లోని దుమ్ము దులుపుకుంటూ కంగారుగా వచ్చి వాళ్లందరిని కోపపడి దూషించాడు. అతని మాట ఎవరూపట్టించుకోక పోవడం వల్ల నిస్సహాయుడై వాళ్ల పనిని అడ్డగిస్తున్నట్లు కంటి చూపును ప్రకటిస్తూ వాళ్లని చూస్తున్నాడు.
కానీ వెనుకకు తిరిగి అతని మాట ఎవరూ వినడం లేదు. సైనికులు నవ్వుకుంటూ పాంటు జేబులోంచి గుప్పిట్లతో చిల్లర తీసి వాళ్ల వైపు విసురుతున్నారు. డబ్బులేరుకోవడంలో ఒకరినొకరు తోసుకుంటూ పోవడంలో వాళ్లలో వాళ్లకు దెబ్బలాటలు బయలుదేరాయి. అది చూసి సైనికులు నవ్వుతున్నారు.తాళ్లజోడు కట్టుకున్న వృద్ధుడు రావడం మానేశాడు. అతను జనంపై కోపగించడం, అతనింక రాకపోవడం– ఇదంతా నాకు ఒక విధంగా గర్వకారణమైంది. ఒక్కొక్కప్పుడు ఈ పల్లెటూరి జనం వ్యవహారం చూస్తే, నాకూ, భగవతిలాల్‌కు చాలా చిరాకు కలిగేది. వాళ్ల నల్లదన దరిద్రవేషం చూసి సైనికులు వాళ్లను ముష్టివాళ్లలా పరిగణిస్తున్నారు. ఆ సంగతి మాకు చాలా ఏవగింపు కలిగించింది.ఒకరోజున ముళ్లకంచె అవతల వైపు నుంచి ఆ జనం ‘బక్షీస్, బక్షీస్’ అని అరవడం విని– ఓ ప్రక్కన గార్డు జానకినాథతో మాట్లాడుతుండగా– మా పక్కన ఉన్న ఒక ఆఫీసరు వాళ్ల కేకల వల్ల విసుగుపుట్టిన వాడై వాళ్లని ఉద్దేశించి అన్నాడు: ‘‘బ్లడీ బెగ్గర్స్!’’. నేనూ, భగవతిలాల్ ఒకరి ముఖంలోకి మరొకరం చూసుకున్నాం. అవమానంతో మా ముఖాలు నల్లబడ్డాయి. భరించలేని కోపం.నా కోపం అంతా మహతా పల్లెజనంపై పడింది. ట్రెయిన్ వెళ్లగానే, భగవతిలాల్‌ని కూడా తీసుకువెళ్లి వాళ్లకి బుద్ధి చెపుదామని వెళ్లేసరికి, వాళ్లందరూ డబ్బులు పోగు చేసుకొని బట్టల్లో మూటకట్టుకుని నవ్వుకుంటూ పారిపోయారు. అయినా వాళ్ల గురించి నాకు కలిగిన అవమానాన్ని నా అహంకారంలో దాచి ఉంచుకున్నాను.
భూర్‌కుండా కాంట్రాక్టర్ల నుంచి క్యాంపు మూసేయమని తీసుకు వచ్చాను, వాళ్లను కలుసుకునేందుకు వెళ్లినప్పుడు. ‘అండాహాల్ట్’ ఫెన్సింగు అవతల డ్రమ్ముల మీద ఒక్కతాపు గట్టిగా తన్ని భగవతిలాల్ అన్నాడు: ‘‘ఆట అయిపోయింది’’ఏదో గందరగోళం, గొడవ వినబడగా వెనక్కి తిరిగి చూసేసరికి మహతా గ్రామవాసులు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకో ఏమో భగవతిలాల్ నవ్వడం మొదలు పెట్టాడు. వాళ్లందరూ ముళ్ల కంచెకి అవతల గుంపుగా నిలబడ్డారు. అదే సమయంలో ట్రెయిన్ వస్తున్న శబ్దం కూడా అయింది. వెనక్కి తిరిగి చూస్తే ట్రెయిన్ వంపు తిరిగి ‘అండాహాల్ట్’ వైపే వస్తోంది. కిటికీలలో ఖాకీ దుస్తులు కనిపిస్తున్నాయి. మేము గాభరా పడిపోయాం. అయితే భూర్‌కుండా వాళ్ల ఆఫీసు నుంచి పొరపాటు వార్త అందిందా? లేదే, నేనే వెళ్లి ఆ కబురు తీసుకువచ్చాను కదా!ట్రెయిను కొంచెం దగ్గరగా వచ్చేసరికి, ట్రెయిన్‌లో సైనికులందరూ గొంతు కలిపి నిండు గొంతుతో పాటలు పాడుతున్నట్లు స్పష్టమయింది. విభ్రాంతుడనై నేను ఒకసారి ట్రెయిన్ వైపు చూశాను. అలాగే ఒకసారి ముళ్లకంప వైపున ఆ గుంపు వైపు చూశాను. అదే సమయంలో నా కంటికి ఆ మహతా గ్రామపు పెద్ద కనిపించాడు. మిగతా గుంపుతో కూడా ఆ వృద్ధుడు కూడా ‘బక్షీస్, బక్షీస్’’ అని అరుస్తున్నాడు. వాళ్లందరూ ముష్టి వాళ్లలా అరుస్తున్నారు. అయితే మిగతా రోజుల్లా ఆ అమెరికన్ సైనికులు ఈసారి ‘అండాహాల్ట్’లో ఆగలేదు. పాసెంజర్ ట్రెయిన్‌లాగే ఈ స్పెషల్ ట్రెయిన్ కూడా ‘అండాహాల్డ్’ను నిర్లక్ష్యం చేసి తుస్సుమంటూ వెళ్లిపోయింది.ట్రెయిన్ ఇంకెప్పుడూ ఇక్కడ ఆగదని మాకు తెలిసింది. ట్రెయిన్ వెళ్లిపోయింది. కాని మహతా గ్రామస్థులందరు మటుకు ముష్టివాళ్లలా తయారై కూర్చున్నారు. పొలాల్లో వ్యవసాయం చేసుకునే మనుషులందరూ ముష్టి వాళ్లైపోయారు.
బెంగాలీ మూలం : రమాపద్ చౌధురీ
తెలుగు: రాధాకృష్ణమూర్తి చల్లా
భారత వర్షం
Published Sun, Apr 14 2019 4:22 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment