సమ్మెకు సన్నద్ధం | Railway staff reday for Strike | Sakshi
Sakshi News home page

సమ్మెకు సన్నద్ధం

Published Thu, Jul 3 2014 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

సమ్మెకు సన్నద్ధం

సమ్మెకు సన్నద్ధం

చెన్నై, సాక్షి ప్రతినిధి:రైల్వే సిబ్బందిని ప్రభుత్వం యంత్రాల్లా వాడుకుంటోందని ఆలిండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎఫ్) ఆరోపించింది. 365 రోజులూ 24 గంటల విధుల్లో వేతనం తక్కువ పనిభారం ఎక్కుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడేలా రైల్వే ఉద్యోగులు, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నుంచి సాధించుకోవడానికి సమ్మెకు సిద్ధమవుతోంది.  ఇందుకోసం నవంబరు వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చి, స్పందించకుంటే దేశవ్యాప్త సమ్మెకు పూనుకోకతప్పదని ఫెడరేషన్ జాతీయ ప్రధాన  కార్యదర్శి శివగోపాల్ మిశ్రా, సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎన్ కన్నయ్య ప్రకటించారు.
 
 రైల్వే ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కారంపై చెన్నైలోని రాజాఅన్నామలై  హాలులో గురువారం ఏఐఆర్‌ఎఫ్ జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. దేశం నలుమూల నుంచి వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యూరు. వారు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రోజుకు 1900 రైళ్లు పరుగెడుతున్నాయని, సగటున రోజుకు 2 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే ఇటువంటి కీలకమైన సేవలందించేవారికి తగిన విశ్రాంతి కరువైందని చెప్పారు. అనాదిగా ఉన్న ఖాళీలను భర్తీచేయకుండా రాజకీయ లబ్ది కోసం ప్రతి ఏటా రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లను ప్రవేశపెట్టడాన్ని వారు తప్పుపట్టారు.
 
 సిబ్బంది పెరగకుండా కొత్త రైళ్లు వేస్తే ఆ పనిభారం తామే మోయాలని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చేందుకు ఆర్థిక స్థోమత లేదని బుకాయిస్తున్న మంత్రిత్వ శాఖ వివిధ ప్రాజెక్టుల రూపంలో రూ.25వేల కోట్లను వృథా చేసిందని వారు ఆరోపించారు. అంతేగాక కిలోమీటరు నిర్మాణానికి రూ.400 కోట్ల ఖర్చుకాగల బుల్లెట్ ట్రైన్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తోందన్నారు. ఖరీదైన టికెట్‌తో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే బుల్లెట్ ట్రైన్‌ల ద్వారా రైల్వే శాఖ సాధారణ ప్రజలకు దూరం కాగలదని వారు విమర్శించారు.
 
  2004 తర్వాత ఉద్యోగంలో చేరిన రైల్వే కార్మికులకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలుచేయరాదని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 7వ  వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉద్యోగులకు కనీసం రూ.26వేలు తగ్గకుండా జీతం, రూ.3,500 టీఏ, 20శాతం హెచ్‌ఆర్‌ఏ, డీఏ చెల్లించాలని వారు కోరారు. రైల్వే ఉద్యోగుల 52 డిమాండ్లను నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని గత ఏడాది డిసెంబరు 21,22 తేదీల్లో నిర్వహించిన సమావేశంలోనే నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో సమ్మె సబబు కాదని తాత్కాలికంగా వాయిదా వేసి అవే డిమాండ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచామని చెప్పారు.
 
 కన్నయ్యకు ప్రమోషన్
 ఏఐఆర్‌ఎఫ్ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా, ఎస్‌ఆర్‌ఎంయూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్ కన్నయ్యకు ఏఐఆర్ ఎఫ్ నిర్వాహక అధ్యక్షుడుగా పదోన్నతి లభించింది. సుమారు 14 లక్షల మంది కార్మికుల సభ్యత్వం కలిగి, గుర్తింపు పొందిన సంఘానికి నిర్వాహక అధ్యక్షుడిగా గురువారం చెన్నైలో జరిగిన సర్వసభ్య సమావేశం ద్వారా కన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement