రైల్వే గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు సమస్యలు | the problems of railway group D category employees | Sakshi

రైల్వే గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు సమస్యలు

Aug 5 2014 12:30 AM | Updated on Mar 28 2018 11:05 AM

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని గ్రూప్ డీ కేటగిరీకి చెందిన రైల్వే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వికారాబాద్: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని గ్రూప్ డీ కేటగిరీకి చెందిన రైల్వే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీ విభాగంలో పని చేస్తున్న తమ జీవితాలకు మాత్రం సేఫ్టీ లేకుండాపోయిందని గేట్‌మెన్, గ్యాంగ్, కీమెన్‌లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వికారాబాద్ నుంచి మొదలుకొని మెదక్ జిల్లా జహీరాబాద్ వరకు ఉన్న సుమారు 33 లెవల్ క్రాసింగ్ గేట్లు ఉన్నాయి. అయితే వీటిలో 4, 6, 7, 8, 9, 13, 27, 28 గేట్ల పరిధిలో సమస్యలు నెలకొన్నాయి.

 రైల్వే ఉన్నతాధికారులు మాత్రం ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గేట్ల సమీపంలో వేసిన బోర్లు పనిచేయడం లేదు. పని చేసిన బోర్లలో సైతం మురుగునీరు వస్తోంది. కొన్ని గేట్లలో రాత్రి పూట కరెంట్ లేక  విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ లేకపోవడంతో రాత్రి పూట గేట్ల సమీపంలోని గదుల్లోకి పాములు, తేళ్లు తదితర విష కీటకాలు వస్తున్నాయి. వికారాబాద్ నుంచి మొదలుకొని జహీరాబాద్ సమీపంలోని మెటల్‌కుంట వరకు ఎస్‌ఎస్‌ఈ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పరిధి ఉంటుంది.

 అతని పర్యవేక్షణలోనే గేట్ల నిర్వహణ ఉంటుంది. అయితే గేట్‌మెన్‌ల కోసం ఏర్పాటు చేసిన గదులు కాలం చెల్లినవి కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ట్రాక్‌కు అతి సమీపంలో ఉండటంతో రైళ్లు వెళుతున్నప్పుడు ఈ గదులు ప్రకంపనలకు గురవుతున్నాయి. గోడల పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గేట్ ఆపరేటర్లు ఎక్కువ శాతం గది బయటే గడుపుతున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం గేట్ల వద్ద గేట్‌మెన్‌లకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వాటిని రైల్వే ఉన్నతాధికారులు మాత్రం అమలుచేయడం లేదని గేట్‌మెన్‌లు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు  తమ సమస్యలు పరిష్కరిస్తే మరింత మెరుగైన సేవలను అందిస్తామని గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement