వీధిలో నుంచి విధాన సౌధకు..... | from streets to vidhana soudha: story of a rape survivor’s son raghu | Sakshi
Sakshi News home page

వీధిలో నుంచి విధాన సౌధకు.....

Published Fri, Mar 11 2016 4:30 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

వీధిలో నుంచి విధాన సౌధకు.....

వీధిలో నుంచి విధాన సౌధకు.....

బెంగళూరు: అనాథగా పుట్టి అనాథాశ్రయంలో పెరిగి తండ్రెవరో తెలియని తనయుడిగా 14వ ఏట బయట ప్రపంచంలోకి అడుగుపెడితే ఆ బాలుడి బతుకు ఎలా ఉంటుంది? అగమ్య గోచరంగా, అంతులేని ఆవేదనాభరితంగా ఉంటుంది. అందులోనూ పెళ్లి కాకుండానే తల్లైన తల్లికి (అత్యాచారం కారణంగా) జన్మించిన రఘు లాంటి వ్యక్తికి ఇంకెలా ఉంటుంది.

తనకంటూ సొంత గుర్తింపు లేకుండా అనాథాశ్రయం ఇచ్చిన పెట్టుడు పేరుతో బతకాలంటే మరీ మరీ కష్టం. ఎక్కడికెళ్లినా అవమానాలే, ఆటంకాలే ఏర్పడతాయి. సహజంగా ఇలాంటి పిల్లలు తప్పుదోవ పట్టి సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతారు.  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బల్లారి అనాథాశ్రయంలో పెరిగి సమాజంలోకి అడుగుపెట్టిన రఘు మాత్రం ఎన్నో అవమానాలు, కష్టాలకోర్చి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు.

పాస్‌పోర్టు కోసం రఘు ఓ రోజు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా అతనికి అవమానమే ఎదురైంది. తానెవరో నిరూపించుకోవడం, తనకంటూ ఓ గుర్తింపు కార్డును సాధించడం కష్టమైంది. పాస్‌పోర్టు దరఖాస్తులో తప్పనిసరిగా తండ్రి పేరు వెల్లడించాలంటూ పాస్‌పోర్టు సిబ్బంది చెప్పారు. తనకు తండ్రంటూ లేడని, అత్యాచారానికి గురైన యువతికి పుట్టానని ఎలా నిరూపించుకోగలడు. అందుకనే రఘు దరఖాస్తును స్వీకరించేందుకు కూడా పాస్‌పోర్ట్ కార్యాలయం సిబ్బంది నిరాకరించింది.

 

అసలు పాస్‌పోర్టు చట్టంలో తండ్రి పేరు తప్పనిసరా అన్న నిబంధన ఉందా? అన్న విషయాన్ని ఆయన శోధించాడు. దరఖాస్తు దారుడి నుంచి తండ్రి పేరును ఇన్‌సిస్ట్ చేయరాదన్న క్లాజ్‌ను వెతికి పట్టుకొని మళ్లీ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. చట్టం గురించి వివరించాడు. అయినా వారు పట్టించుకోలేదు. ఉన్నతాధికారిని కలిసేందుకు కూడా అంగీకరించలేదు. చివరకు ఓ రోజు కార్యాలయం మూతపడే సమయం వరకూ ఉండి ఉన్నతాధికారిని కలుసుకొని పాస్ పోర్టును సాధించాడు.

ఈ నేపథ్యంలో తానెవరో, తన తల్లి ఎక్కడ ఉంటుందో, తన మూలాలను తెలుసుకోవాలనుకున్నాడు రఘు. తండ్రి గురించి తెలియలేదుగానీ ప్రభుత్వ మహిళా సంక్షేమ ఆశ్రమంలో తన తల్లి ఉంటున్న విషయాన్ని కనుగొన్నాడు. పిచ్చిదానిగా మారిన తన తల్లికి చెవుడు, మూగ అని తెలిసి, కళ్లు కూడా సరిగ్గా కనిపించవని గ్రహించి తల్లడిల్లాడు. తాను బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజులు గుర్తొచ్చాయి. రైలంటే ఎలా ఉంటుందో, రైల్వే స్టేషన్ ఎక్కడుంటుందో కూడా తెలియకుండా 14 ఏళ్ల వరకు పిల్లల అనాధాశ్రయంలోని నాలుగు గోడల మధ్య పెరిగిన రఘుకు బయటకు వచ్చాక తొలి ఆశ్రయం రైల్వే స్టేషనే అయింది. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ బతికాడు. కొంతకాలానికి మైసూరుకు వెళ్లి అక్కడ మార్కెట్‌లో పని చేశాడు. తనలాంటి అనాథలను ఆదుకోవాలని, వారికో ఆశ్రయం కల్పించాలని నిశ్చయానికి వచ్చాడు.

అందుకోసం రేయింబవళ్లు పని చేశాడు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు కూడబెట్టాడు. అతని మిత్రుడు... రఘును మోసం చేసి ఆ మొత్తం సొమ్మును ఎత్తుకు పోయాడు. ఇక అక్కడ పని చేయాలనిపించక బెంగళూరుకు వెళ్లి ఏదో ఒక పని చేయాలనుకున్నాడు. ప్రయాణంలో ఆరోగ్యం క్షీణించింది. దాంతో మళ్లీ మైసూరునే ఆశ్రయించాడు. దొరికిన ఉద్యోగం చేస్తూ ప్రైవేట్‌గా డిగ్రీ చదవుతున్నాడు. ఆరోగ్యం క్షీణించి హృద్రోగ సమస్యలు కూడా వచ్చాయి.

గత జనవరి నెలలో రఘు గురించి స్థానిక మీడియా వార్తా కథనం రాయడంతో దాన్ని చదవిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్పందించారు. రఘును పిలిచి తనవద్ద గుమస్తా ఉద్యోగం ఇచ్చారు.  ఇంతకాలానికి రఘుకు స్థిరమైన ఉద్యోగం వచ్చింది. ఇక చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని, శ్రద్ధగా చదువుకుంటానని చెబుతున్నాడు. ఇప్పటికీ సరైన గుర్తింపు లేని తనకు ఎస్సీ లేదా ఎస్టీగా గుర్తిస్తే సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతానని చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement