అమ్మా.. నాన్నా.. ఏడున్నారు?
అమ్మా.. నాన్నా.. ఏడున్నారు?
Published Thu, Jul 21 2016 4:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
– బిడ్డను కని మృతి చెందిన తల్లి
– పారిపోయిన తండ్రి
– తనకు పట్టదన్న తాత
– ఏడుస్తూ పాలకోసం ఎదురు చూస్తున్న అనాథ శిశువు
చీరాల: కేవ్.. కేవ్.. అంటూ పండంటి మగబిడ్డ అమ్మ కడుపులో నుంచి బయట పడ్డాడు. కానీ వాడు దురదృష్టవంతుడు కాబోలు. వెంటనే తల్లిని పోగొట్టుకున్నాడు. అంతకంటే ముందుగానే ఆమె భర్త అని చెప్పుకున్న వ్యక్తి ఎక్కడికో పారిపోయాడు. కనీసం మృతురాలి తండ్రి.. అంటే తాత అయినా వచ్చి ఎత్తుకుంటాడనుకుంటే.. తనకు సంబంధం లేదంటూ వెళ్లిపోయాడు. తల్లి శవానికి మునిసిపాలిటీవాళ్లు అంతిమ సంస్కారాలు చేశారు. మరి లోకం చూసిన ఈ బాబుకు సంస్కారాలు నేర్పించి అక్కున చేర్చుకొనేదెవరు? ఈ హృదయ విదారక సంఘటన చీరాల ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ బిడ్డ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఎవరూలేని అనాథగా మారిపోయాడు. పురిటి నొప్పులతో బాధపడుతున్న భవాని అనే మహిళను ఈపూపాలెం పీహెచ్‌సీ సిబ్బంది 108లో మంగళవారం రాత్రి చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాహన సిబ్బంది వెంట భవానీ భర్తనంటూ ఓ వ్యక్తి కూడా వచ్చాడు.
అయితే ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది ఆమె పరిస్థితి చూసి కంగారు పడ్డారు. అయితే తనకు మూడో కాన్పని, తనను ఇంటికి పంపించాలని ఆ మహిళ బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు మూసుకుంది. చాలాసేపు ఆస్పత్రి సిబ్బంది బతిమలాడగా బయటకు వచ్చింది. ఆమె చాలా బలహీనంగా ఉండటంతో పాటు బీపీ కూడా కనిపించడంతో గుంటూరు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో భర్తనని చెప్పుకున్న వ్యక్తి అక్కడి నుంచి మాయమయ్యాడు. పాలుపోని సిబ్బంది భవానికి కాన్పు చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఎక్కువగా రక్తం పోతుండటంతో గుంటూరు తీసుకెళ్లాని 108 వాహన సిబ్బందికి సూచించడంతో బయలు దేరారు. కారంచేడు రోడ్డులోని రక్షిత మంచినీటి చెరువు సమీపంలోకి వెళ్లగానే మృతి చెందింది.
మృతదేహం మున్సిపాలిటికి అప్పగింత..
వైద్య సిబ్బంది వివరాలు సేకరించగా మృతురాలి తండ్రి స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద అవ్వారు వీధిలో నివాముంటున్నాడని తెలుసుకుని పిలిపించారు. తన కుమారై చాలా కాలం క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. తనకు సంబంధం లేదని.. దహన సంస్కారాలు చేయలేనన్నాడు. దీంతో శవాన్ని మున్సిపాలిటీవారు స్వాధీనం చేసుకున్నారు. ఎవరిదారి వారు చూసుకోవడంతో ఏమీ తెలియని అమాయక జీవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కనీసం చైల్డ్‌లైన్ సిబ్బంది అయినా స్పందిస్తారో లేదో!
అధిక రక్తస్రావంతోనే మృతి చెందింది
భవానికి రక్తం లేకపోవడంతో చాలా బలహీనంగా ఉంది. దానికి తోడు కాన్పు సమయంలో ఆమెకు రక్తం అధిక రక్తస్రావమైంది. ఆమె వద్ద ఎటువంటి మెడికల్ రికార్డు లేదు. డ్యూటీలో ఉన్న వైద్యులు కాన్పు చేశారు. మాయ బటయటకు రాకపోవడంతో అధికంగా రక్తస్రావమైంది. శిశువు బలహీనంగా ఉండడంతో ఎన్‌బీయూసీలో ఉంచాం.– సీహెచ్ ప్రసన్నకుమార్, సూపరింటెండెంట్
Advertisement
Advertisement