మునుగోడు : ‘‘నేనేం పాపం చేశాను.. నాకే ఎందుకీ శిక్ష.. నా అనే వారు లేకుండా చేశావు.. నాకు దిక్కెవరు దేవుడా..?’’ అంటూ పన్నెండేళ్ల ప్రాయంలోనే విధి వంచితగా మారిన ఓ బాలిక తల్లి మృతదేహం వద్ద రోదించిన తీరు అందరి హృదయాలను ద్రవింపజేసింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన బొడ్డు అంజయ్య, పద్మ (32) దంపతులకు కిరణ్, వందన సంతానం. అంజయ్య వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తనకున్న రెండు ఎకరాల భూమితో పాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక 2018లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కుటుంబ భారం మోస్తూ..
అప్పుల బాధను తట్టుకోలేక భర్త అఘాయిత్యానికి ఒడిగట్టడంతో పద్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే చేతికి అందివచ్చిన కొడుకు ఆసరాగా ఉంటాడనుకుంటే అనుకోని ఆపద ఆ తల్లి ఆశలను అడియాశలు చేసింది. ఏడాది క్రితం పద్మ కుమారుడు ఓ ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.
అనారోగ్యం బారిన పడి..
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్తను, చేతికి అందివచి్చన కుమారుడిని వెంటవెంటనే కోల్పోయిన ఆ ఇల్లాలు బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలోనే పద్మ అనారోగ్యం బారిన పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నీట మునగడంతో కుంగిపోయింది. ఎదుగుతున్న కుమార్తె బాగోగులు చూసుకోలేక ఆ తల్లి తీవ్ర మనస్తాపం చెందింది. నా అనే వారు లేక.. ఆస్పత్రిలో చూపించుకునే స్థోమత లేక ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. దీంతో ఆమె కుమార్తె వందన అనాథగా మారింది. తల్లి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న ఆ బాలికను ఆపడం ఎవరి తరం కాలేదు. దయ గల దాతలు ముందుకొచ్చి ఆ బాలికను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కుటుంబ సభ్యులను అంతా కోల్పోయి అనాధ అయిన బాలికను పరామర్శించి రూ పది వేల ఆర్థిక సహాయం అందించిన స్థానిక జడ్పీటీసీ స్వరూప రాణి. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు సోమవారం ఆ గ్రామానికి వెళ్లి బాలికను పరామర్శించి ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏం పాపం చేశాను.. నాకు దిక్కెవరు దేవుడా?
Published Mon, Oct 19 2020 8:39 PM | Last Updated on Mon, Oct 19 2020 8:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment