నిన్నమొన్నటి వరకూ ఆయనో స్వామీజీ.. ఒంటి నిండా కాషాయ వస్త్రాలు ధరించి గ్రామగ్రామాలు తిరుగుతూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు తన జీవితాన్ని ధారపోశారు. విధి వక్రీకరించి పక్షవాతం సోకి ఒక కాలు, ఒక చేయి పనిచేయకుండా పోయాయి. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరిగి మంచాన పడ్డారు. ఆలనా.. పాలనా చూసేవారు లేక అనాథగా మారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
సాక్షి, నల్లమాడ (ప్రకాశం): చీరాలకు చెందిన ఓ స్వామీజీ 15 ఏళ్ల క్రితం అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చేరుకున్నారు. ఎన్.ఎనుమలవారిపల్లి సమీపంలోని దేవరగుళ్ల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తూ జ్యోతిస్వరూపానంద స్వామీజీ అలియాస్ చీరాల స్వామీజీగా మండలంలో గుర్తింపు పొందారు. చాలా ఏళ్లపాటు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనే ఉంటూ ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఆలయంలో తరచూ యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజల్లో భక్తిభావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు కృషి చేశారు. పాతబత్తలపల్లి పంచాయతీలోని గ్రామాల్లోనే గాక నల్లమాడ మండల వ్యాప్తంగా ఎక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినా స్వామీజీ పాల్గొని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవారు.
కుటుంబ బంధాలు తెగి..
ఆరు దశాబ్దాలు పైబడిన వయసున్న స్వామీజీకి చీరాలలో భార్యాపిల్లలు ఉన్నట్లు సమాచారం. అయితే 15 సంవత్సరాల క్రితమే వారితో సంబంధాలు తెగిపోయి.. ఒంటరిగా ఇక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1న స్వామీజీకి పక్షవాతం సోకింది. ఎడమ చేయి, కాలు చచ్చుబడ్డాయి. చికిత్స అనంతరం ఊతకర్ర సాయంతో నడిచేవాడు. నెల రోజుల క్రితం ఊతకర్ర సాయంతో నడుస్తున్న స్వామీజీ అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో అతని ఎడమకాలు విరిగింది.
సహాయకులు లేక అనాథలా..
ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచాన పడ్డారు. నా అనే వారు లేకపోవడంతో ఆలనాపాలనా కరువైంది. గ్రామస్తులెవరైనా ఇంత తెచ్చిపెడితే తినాలి. లేదంటే పస్తులే. అన్నపానీయాలతో పాటు వైద్యం అందక రోజురోజుకూ స్వామీజీ ఆరోగ్యం క్షీణిస్తోంది. చెండ్రాయునిపల్లి క్వార్టర్స్‌లోని ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లబుచ్చుతున్నాడు స్వామీజీ. ఆస్పత్రికి వెళ్లి చూపించుకుందామంటే సహాయకుడు లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తూ రోజులు లెక్కిస్తున్నారు. దాతలు, స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి తనకు చికిత్స అందించాలని ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన వారిని స్వామీజీ వేడుకుంటున్నారు. లేని పక్షంలో కారుణ్య మరణానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాతలు ఎం.జ్యోతిస్వరూపానంద స్వామి, కదిరి ఎస్‌బీఐ అకౌంట్ నం.3559 549 9432 (ఐఎఫ్‌సీ కోడ్: ఎస్‌బీఐఎన్0000849)కు విరాళం పంపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment