మాట్లాడుతున్న డీజీ వినయ్‌కుమార్‌సింగ్
చంచల్‌గూడ: జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తన వస్తోందని, తద్వారా ఖైదీలు లేక జైళ్లు ఖాళీ అవుతున్నాయని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. సోమవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా గ్రాండ్ విజన్ 2025 లక్ష్యాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు. నేరాల తగ్గింపు, సమాజిక సేవ, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక సేవలో జైళ్ల శాఖ ఒక కొత్త ఆధ్యయాన్ని సృష్టించిందన్నారు. యాచకరహిత హైదరాబాద్‌లో భాగంగా జైళ్ల ప్రాంగణంలో ఆనందాశ్రమం ఏర్పాటు చేసి 3749 యాచకులను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు.
కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో 3526 మంది తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారన్నారు. జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణల కారణంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జైళ్ల అద్దెకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో కూడా ఆనందాశ్రమాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అంధులు, మానసిక రోగులకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 9 సబ్ జైళ్లను మూసివేశామని, త్వరలో మరో 5 సబ్ జైళ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తే నేరాలు తగ్గుతాయన్నారు. సమావేశంలో ఐజీ ఆకుల నర్సింహ, డీఐజీ సైదయ్య, అధికారులు సంపత్, శ్రీమాన్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment