Telangana Jail Department
-
తెలంగాణ: జైళ్లలో మగ్గుతున్న యువత.. హత్యలు, లైంగిక దాడులే అధికం..
సాక్షి, హైదరాబాద్: క్షణికావేశంలో చేస్తున్న నేరాలు జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. ఉన్నత చదువుల్లోనో, ఉద్యోగ వాపారాల్లోనో రాణించాల్సిన యువత జైలు గదుల్లో బందీ అవుతోంది. తెలంగాణ జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎక్కువమంది యుక్త వయస్కులేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు(2020) స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 37 జైళ్లలో 6,114 మంది ఉండగా, వీరిలో 1,910 మంది వివిధ నేరాల్లో శిక్ష పడిన వారు కాగా, 3,946 మంది అండర్ ట్రయల్స్ (విచారణ ఖైదీలు), మరో 256 మంది డిటైనీస్ (ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్నవారు) ఉన్నారని ఎన్సీఆర్బీ పేర్కొంటోంది. అయితే వీరిలో ఎక్కువమంది 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కావడం గమనార్హం. హత్యలు, లైంగిక దాడుల కేసులే అధికం అండర్ ట్రయల్స్‌లో ఖైదీలుగా ఉన్న యుక్త వయస్కులు ఎక్కువగా హత్యలు, హత్యాప్రయత్నం, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, మద్యం, మాదకద్రవ్యాల సంబంధిత కేసులు, దొంగతనాల కేసుల్లో జైలు బాట పడుతున్నట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే విధంగా శిక్ష అనుభవిస్తున్న కేటగిరీలోనూ హత్యలు, లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, దొంగతనాలు తదితర కేసుల వారు ఉన్నట్టు వెల్లడవుతోంది. -
ఆదర్శంగా తెలంగాణ జైళ్ల శాఖ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ అనేక సంస్కరణలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం చర్లపల్లి వ్యవసాయక్షేత్రం (ఓపెన్‌ఎయిర్‌జైల్) ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయుర్వేద చికిత్సాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతున్న ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, ఖైదీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చికిత్సాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ధీటుగా అదేస్థాయిలో మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి నిపుణులను రప్పించి ఖైదీలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈ ఆయుర్వేద సెంటర్‌కు వస్తున్న ఆదరణతో చర్లపల్లిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.శాఖ ఆదాయ వనరులను పెంచుకునే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగాయిలాంటి కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ: 3 కోట్ల ఆదాయ లక్ష్యంతో పాటుగా మూడు వేల మంది ఖైదీలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఖైదీల క్షమాభిక్ష ఫైల్‌ను మూడు నెలల క్రితమే ప్రభుత్వానికి అందజేశామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖైదీల క్షమాభిక్ష అమలవుతుందన్నారు. కార్యక్రమంలో జైళ్లశాఖ డీఐజీజీ ఆకుల నర్సింహ్మ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు రాజేశ్, యంఆర్ భాస్కర్, సిఐఎ అధ్యక్షుడు కట్టంగూర్ హరీష్‌రెడ్డి, ఐలా సెక్రటరీ రోషిరెడ్డి, విశ్వేశ్వరరావు, ఉప పర్యవేక్షణాధికారి చింతల దశరథం, సిబ్బంది పాల్గొన్నారు. -
అద్దెకు తెలంగాణ జైళ్లు
చంచల్‌గూడ: జైళ్లశాఖ చేపట్టిన సంస్కరణలతో ఖైదీల్లో పరివర్తన వస్తోందని, తద్వారా ఖైదీలు లేక జైళ్లు ఖాళీ అవుతున్నాయని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. సోమవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా గ్రాండ్ విజన్ 2025 లక్ష్యాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు. నేరాల తగ్గింపు, సమాజిక సేవ, ఉపాధి కల్పన, స్వయం సమృద్ధి సాధన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. సామాజిక సేవలో జైళ్ల శాఖ ఒక కొత్త ఆధ్యయాన్ని సృష్టించిందన్నారు. యాచకరహిత హైదరాబాద్‌లో భాగంగా జైళ్ల ప్రాంగణంలో ఆనందాశ్రమం ఏర్పాటు చేసి 3749 యాచకులను పునరావాస కేంద్రానికి తరలించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించగా అందులో 3526 మంది తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లారన్నారు. జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణల కారణంగా జైళ్లలో ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. త్వరలో ఇతర రాష్ట్రాల జైళ్ల శాఖకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జైళ్ల అద్దెకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో కూడా ఆనందాశ్రమాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, అంధులు, మానసిక రోగులకు, అనాథలకు, వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు 9 సబ్ జైళ్లను మూసివేశామని, త్వరలో మరో 5 సబ్ జైళ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పిస్తే నేరాలు తగ్గుతాయన్నారు. సమావేశంలో ఐజీ ఆకుల నర్సింహ, డీఐజీ సైదయ్య, అధికారులు సంపత్, శ్రీమాన్‌రెడ్డి తదితరులున్నారు. -
జైలు ఖైదీలకు రాచమర్యాదలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారం విచారణ ఖైదీలకు సొంతింటిగా మారింది. జైలు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి 50కి పైగా కేసులున్న ఓ అండర్ ట్రయల్ ఖైదీ రాచమర్యాదలకు వేదిక అయ్యింది. విచారణ ఖైదీలు అందరికీ ఓ నీతి.. సదరు ఖైదీకి మరో నీతి అన్న చందంగా వ్యవహరించడంపై 54 సెకన్ల నిడివి గల వీడియో రికార్డుతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో బండారం బట్టబయలైంది. రూ.కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసుల్లో మాజీ ఏఎస్ఐ బొబ్బల మోహన్‌రెడ్డి కరీంనగర్ జిల్లా జైలులో సుమారు ఏడు నెలలుగా విచారణ ఖైదీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ పరిమితులను మించి మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులకు తన కార్యాలయంలో ములాఖత్‌కు అనుమతించారంటూ వీడియో రికార్డుల ఆధారాలతో జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఘటనపై సమగ్ర విచారణ.. కరీంనగర్ జైలులో మాజీ ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి రాచమర్యాదలు అందుతున్నాయన్న ఫిర్యాదులపై జైళ్ల శాఖ స్పందించింది. ఏఎస్ఐ మోహన్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ శివకుమార్ మధ్య సంబంధాలు, జైల్లో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ డీఐజీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు. ఆరోపణలకు తావు లేదు జైలు నిబంధనల ప్రకారమే ఎవరికైనా ములాఖత్ ఇచ్చాం. ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదు. మూడేళ్లుగా జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా.. ఇంత వరకూ నిబంధనలు కాదని ఎవరికీ ప్రత్యేకంగా ములాఖత్ ఇవ్వలేదు. ఈనెల 13న ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి న్యాయవాది, మా జైలు సిబ్బంది సమక్షంలోనే ములాఖత్ ఇచ్చాం. వీటికి సంబంధించిన అన్ని సీసీ కెమెరా పుటేజీలున్నాయి. – శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్ నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు చంచల్‌గూడ: జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే ఖైదీలకు ములాఖత్‌లు కల్పిస్తున్నామని తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ అన్నారు. కరీంనగర్ జైల్లో పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్ఐ మోహన్‌రెడ్డి జైలు నుంచి సెటిల్మెంట్లు చేస్తున్నారని వచ్చిన వార్తలపై ఐజీ స్పందించారు. శుక్రవారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే ఏఎస్ఐ మోహన్‌రెడ్డికి ములాఖత్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై హైదరాబాద్ రేంజ్ డీఐజీ బచ్చు సైదయ్య విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక అందించారని తెలిపారు. రెండు ములాఖత్‌లకు సంబంధించి రికార్డు బుక్‌లో నమోదు కాలేదని ఆ విషయంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. మోహన్‌రెడ్డిని అతని భార్య, న్యాయవాది ములాఖత్‌లో కలిసిన విషయం వాస్తవమేనని, కానీ.. సూపరింటెండెంట్ గదిలో ములాఖత్ ఇచ్చారని, సెటిల్మెంట్లు చేస్తున్నాడని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే అతనికి జైలర్ రూమ్‌లో ములాఖత్ ఇచ్చినట్లు వివరించారు. చట్ట విరుద్ధంగా జైలు వెలుపల వీడియోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఐజీ బచ్చు సైదయ్య ఉన్నారు. – జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ -
చర్లపల్లి జైలులో వీకే సింగ్ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్: తెలంగాణ జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడున్నర గంటల పాటు ఆయన జైలులోనే గడిపారు. అక్కడి బ్యారక్‌లు, భోజనం, ఆస్పత్రితో పాటు ఖైదీలకు వసతులు ఎలా ఉన్నాయని పరిశీలించారు. అనంతరం ఆయన నేరుగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఖైదీలకు పేరోల్ రాకపోవడం, దోమల బెడద, కోర్టుల్లో జరిమానాలు కట్టలేకపోవడం వంటి పలు సమస్యలను డీజీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం ఆయన చర్లపల్లి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న వ్యవసాయ పనులను పరిశీలించారు. ఓపెన్ ఎయిర్జైల్ను రిసార్ట్‌గా మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా చర్లపల్లి జైలు ఉప పర్యవేక్షణాధికారి దశరధంపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో డీజీ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపినట్లు సమాచారం. డీజీ జైలుకు వచ్చిన సమయంలో ఉప పర్యవేక్షణాధికారి జైలులో లేనట్లు తెలిసింది.