సూపరింటెండెంట్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి (వృత్తంలో)
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర కారాగారం విచారణ ఖైదీలకు సొంతింటిగా మారింది. జైలు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి 50కి పైగా కేసులున్న ఓ అండర్ ట్రయల్ ఖైదీ రాచమర్యాదలకు వేదిక అయ్యింది. విచారణ ఖైదీలు అందరికీ ఓ నీతి.. సదరు ఖైదీకి మరో నీతి అన్న చందంగా వ్యవహరించడంపై 54 సెకన్ల నిడివి గల వీడియో రికార్డుతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో బండారం బట్టబయలైంది. రూ.కోట్ల అక్రమాస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నమోదు చేసిన కేసుల్లో మాజీ ఏఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డి కరీంనగర్ జిల్లా జైలులో సుమారు ఏడు నెలలుగా విచారణ ఖైదీగా ఉంటున్నారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ పరిమితులను మించి మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులకు తన కార్యాలయంలో ములాఖత్‌కు అనుమతించారంటూ వీడియో రికార్డుల ఆధారాలతో జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది.
ఘటనపై సమగ్ర విచారణ..
కరీంనగర్ జైలులో మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి రాచమర్యాదలు అందుతున్నాయన్న ఫిర్యాదులపై జైళ్ల శాఖ స్పందించింది. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి, జైలు సూపరింటెండెంట్ శివకుమార్ మధ్య సంబంధాలు, జైల్లో జరిగిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ డీఐజీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు.
ఆరోపణలకు తావు లేదు
జైలు నిబంధనల ప్రకారమే ఎవరికైనా ములాఖత్ ఇచ్చాం. ఇందులో ఎలాంటి ఆరోపణలకు తావు లేదు. మూడేళ్లుగా జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా.. ఇంత వరకూ నిబంధనలు కాదని ఎవరికీ ప్రత్యేకంగా ములాఖత్ ఇవ్వలేదు. ఈనెల 13న ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి న్యాయవాది, మా జైలు సిబ్బంది సమక్షంలోనే ములాఖత్ ఇచ్చాం. వీటికి సంబంధించిన అన్ని సీసీ కెమెరా పుటేజీలున్నాయి.
– శివకుమార్, జైలు సూపరింటెండెంట్, కరీంనగర్
నిబంధనల ప్రకారమే ములాఖత్‌లు
చంచల్‌గూడ: జైళ్ల శాఖ నియమ నిబంధనల ప్రకారమే ఖైదీలకు ములాఖత్‌లు కల్పిస్తున్నామని తెలంగాణ జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ అన్నారు. కరీంనగర్ జైల్లో పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి జైలు నుంచి సెటిల్‌మెంట్లు చేస్తున్నారని వచ్చిన వార్తలపై ఐజీ స్పందించారు. శుక్రవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డికి ములాఖత్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయమై హైదరాబాద్ రేంజ్ డీఐజీ బచ్చు సైదయ్య విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక అందించారని తెలిపారు. రెండు ములాఖత్‌లకు సంబంధించి రికార్డు బుక్‌లో నమోదు కాలేదని ఆ విషయంపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. మోహన్‌రెడ్డిని అతని భార్య, న్యాయవాది ములాఖత్‌లో కలిసిన విషయం వాస్తవమేనని, కానీ.. సూపరింటెండెంట్ గదిలో ములాఖత్ ఇచ్చారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే అతనికి జైలర్ రూమ్‌లో ములాఖత్ ఇచ్చినట్లు వివరించారు. చట్ట విరుద్ధంగా జైలు వెలుపల వీడియోలు తీసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఐజీ బచ్చు సైదయ్య ఉన్నారు.
– జైళ్ల శాఖ ఐజీ ఆకుల నర్సింహ
Comments
Please login to add a commentAdd a comment