స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు.
విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి.
వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు.
కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో!
బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్‌పీ) వెల్లడించింది.
అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది.
మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!
ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది.
రద్దయిన సీఆర్‌పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్‌ఎస్‌ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.
నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్‌ఎస్‌ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment