
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.