ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది.
ప్రత్యేక వెబ్‌సైట్‌లో దరఖాస్తు
ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్‌సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్‌లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.
ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్‌లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment