
‘ఆమె’కు ఆశ్రయం
ధర్మవరం అర్బన్ : అనాథలా.. జీవచ్ఛవంలా ఉన్న పాతికేళ్ల యువతికి అనంతపురం మండలం కాట్నేకాలువలోని ‘ఆశ్రయ’ అనాథాశ్రమ వ్యవస్థాపకుడు వై.క్రిష్ణారెడ్డి, అతని భార్య వై.దేవి ఆదరించి, ఆశ్రయం కల్పించారు. ఈనెల 17న ‘ఈమె ఎవరు?’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. కథనానికి ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు స్పందించారు. ఆదివారం ధర్మవరం పట్టణం వచ్చిన ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు క్రిష్ణారెడ్డి, దేవిలు పట్టణంలోని ఎల్‌పీ సర్కిల్ అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న యువతికి భోజనం తినిపించారు.
అనంతరం ఆమెకు స్నానం చేయించి, కొత్త దుస్తులు తొడిగించారు. ఆటోలో ఆమెను అనంతపురం సమీపంలోని కాట్నేకాలువలోని ఆశ్రమానికి తీసుకెళ్లారు. అంగన్‌వాడీ ఆయా అంజినమ్మ వారికి సాయం చేసింది. ధర్మవరం పట్టణానికి చెందిన పట్టుచీరల వ్యాపారి బాలం కోదండపాణి ఆటో బాడుగను చెల్లించి, తన దాతృత్వాన్ని చాటుకున్నారు.