అతనికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని నలుగురు కుమారులకు సమానంగా పంచాడు. మరికొంత భూమిని తనపేరుపై ఉంచుకున్నాడు. అందరికీ పెళ్లిళ్లు చేసి సాగనంపాడు. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం అతన్ని అవిటివాడ్ని చేసింది. కూలిపనులు చేసుకోలేక.. కన్నకొడుకులు ఆదరించక ఓ తండ్రి అనాథగా జీవిస్తున్న ఘటన మండలంలోని వడ్డివానికొత్తూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.
శాంతిపురం, న్యూస్‌లైన్ :
మండల పరిధిలోని వడ్డివానికొత్తూరుకు చెందిన తెల్లప్ప(74)కు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. తన కొడుకులు జయప్ప, నారాయణప్ప, శంకరప్ప వడ్డివానికొత్తూరులో నివాసముంటున్నారు. రామకృష్ణ బెంగళూరులో స్థిరపడ్డాడు. తెల్లప్ప భార్య మునివెంకటమ్మ 18 సంవత్సరాల క్రితం మృతిచెందింది. తనకున్న 5 ఎకరాల 40 సెంట్ల భూమిని నలుగురు కుమారులకు నాలుగు ఎకరాలు చొప్పున రాసిచ్చాడు. మిగిలిన 1.4 ఎకరాలను తన పేరుమీదనే ఉంచుకున్నాడు. కాలూచేయి ఆడేవరకు ఒకరిపై ఆధారపడకూడదని నిశ్చయించుకున్నాడు. సమీపంలోని సోగడబళ్ల, చెంగుబళ్ల గ్రామాల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలప్పుడు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో రెండు కాళ్లూ దెబ్బతిన్నాయి. స్థానికుల సహాయంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. కన్నకొడుకులు ఆదరించలేదు. దీంతో స్థానికంగా ఉన్న బస్ షెల్టర్‌లో కాలం వెళ్లదీస్తున్నాడు. తన కొడుకులు, గ్రామస్తులు అప్పుడప్పుడూ తెచ్చిపెట్టే తిండి కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు ఆస్తి పంచుకుని అనాథను చేశారని కన్నీటిపర్యంతమవుతున్నాడు. కొడుకులు ఆదరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.