అడ్రస్ పోయింది... | Address Gone ... | Sakshi
Sakshi News home page

అడ్రస్ పోయింది...

Published Mon, May 30 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

అడ్రస్   పోయింది...

అడ్రస్ పోయింది...

ఆ కుటుంబానికి తండ్రే ఒక అడ్రస్. భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా, కుటుంబానికి పెద్ద దిక్కుగా తానే ఒక అడ్రస్‌గా ఉన్నాడు. కాని ఇప్పుడా అడ్రస్ పోయింది. భార్యాపిల్లలు ఆ అడ్రస్ వెతుక్కుంటున్నారు. చెప్పకుండా మాయమైన తండ్రిని ఐదేళ్లుగా వెతుక్కుంటున్నారు. ‘మా నాన్న అడ్రస్ చెప్పరూ’ అని మానవ హక్కుల కమిషన్ గడప తొక్కిన ఆ పిల్లలకు కావలసింది ఓదార్పు మాత్రమే కాదు.  ఆ తండ్రి తోడు. అతని నీడా. ఫలితంగా తమకో అడ్రస్ ఉందనే ధైర్యం.

 

చింతల మల్లయ్యకు యాభై ఏళ్లు. గవర్నమెంట్ టీచర్. ఊరు నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దమాందాపురం గ్రామం. భార్య ఉంది. పేరు యాదమ్మ. ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు కౌశిక్‌కుమార్, కూతురు సృజన, మరో కూతురు శ్రీలేఖ. ఆర్థికంగా పెద్ద కష్టాలేమీ లేవు. మల్లయ్య ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, పిల్లలను చదివిస్తున్నాడు. వారి సంసారం హాయిగా సాగిపోయేది.

 కాని-

 
సరిగ్గా ఐదేళ్ల క్రితం. 2011. మండు వేసవి. ఆ వేసవి ఆ ఇంట్లో వడగాడ్పు కొట్టింది. అంతవరకూ ఎంతో బాధ్యతగా ఉన్న మల్లయ్య హఠాత్తుగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎవరికీ ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంతో వెతికారు. కాని దొరకలేదు.  మూడు నెలలకు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యి పాలివాండ్లతో భూముల గొడవలను పరిష్కరించుకొని ఉన్న డబ్బులను, ఆస్తులను పట్టుకెళ్లిపోయాడు. చాలా పెద్ద దెబ్బ ఇది. ఆ దెబ్బకు కుటుంబం వీధిన పడింది.  భార్య యాదమ్మ కూలీనాలీ చేస్తూ మిగిలిన భూమిని కౌలుకు చేయిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలను చదివిస్తోంది. ఈ పని చేస్తూనే ఇంటి బాధ్యతను వదిలేసి అనాథలను చేసిన మల్లేశంను వెతుకుతూనే ఉంది.

 

ఎక్కడున్నాడు?
మల్లయ్య ఉప్పల్‌లో ఉంటున్నాడని తెలుసుకొని 2014లో అప్పటి జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులును ఆశ్రయించారు యాదమ్మ, పిల్లలు. పోలీసులు మల్లయ్యపై మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతికి పట్టి తెచ్చి కుటుంబానికి అప్పగించారు. ఇకపై తాను ఎక్కడికీ వెళ్లనని, బుద్ధిగా భార్యాపిల్లలను చూసుకుంటానని, లేదంటే చట్టరీత్యా చర్యతీసుకోమని పోలీస్ స్టేషన్‌లో రాసిచ్చాడు మల్లయ్య. కుటుంబ సభ్యుల వెంట ఇంటికెళ్లాడు. కాని రెండు రోజులే ఉన్నాడు. మళ్లీ పరార్. ఇప్పటికి రెండున్నర సంవత్సరాలుగా ఇంటికిగాని, ఉద్యోగానికి గాని రాలేదు. విద్యాశాఖ అధికారులు అతను చేస్తున్న టీచరు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ సంగతి తెలిసి మల్లయ్య మళ్లీ ఊడిపడ్డాడు.  భార్యాపిల్లలతో కలిసి అప్పటి డీఈవోను ఉద్యోగం ఇప్పించాలని మొరపెట్టుకున్నాడు.  8నెలల పాటు తిరిగితే చివరకు పిల్లల మోహం చూసి అధికారులు మళ్లీ ఉద్యోగం ఇస్తూ గుర్రంపోడు మండలం మక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వేశారు. మల్లయ్య రెండు రోజులు ఉద్యోగం చేశాడు. మూడో రోజు తెల్లారి లేచి చూసేసరికి ఇంట్లో లేడు.  కుటుంబ సభ్యులు మళ్లీ మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు, అత ని ఆచూకీ కనుగొనలేదు. దీంతో రెండు రోజుల క్రితం మల్లయ్య పిల్లలు హెచ్చార్సీని ఆశ్రయించి, తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 

ఇంతకీ ఏం చేస్తున్నాడు...
మల్లయ్య వివాహేతర సంబంధంలో ఉన్నాడని బోగట్టా. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో పక్క మండలానికి చెందిన ఓ మహిళతో సంబంధం ఏర్పడిందని చెబుతున్నారు. ఆ మహిళకు వివాహం అయిందని, వీరి సంబంధం చూసి భర్త గొడవ పడి మల్లయ్యను కొట్టాడని ఆ తర్వాత ఆమెను వదిలేశాడని చెబుతున్నారు. తనతో సంబంధం వల్ల ఇదంతా అయ్యింది కనుక మల్లయ్య ఆమెతోనే ఉంటూ ఆమెను పోషిస్తూ ఉన్నాడని కథనం. ఇది తెలిసి యాదమ్మ దేవరకొండ కోర్టులో భరణం కేసు కూడా వేసింది. కాని అడ్రస్ లేని మనిషికి ఎక్కడికని నోటీసులు పంపాలి?

 
ఏమైనా ఇది బాధ్యత మరిచిన ఒక మనిషి కథ. కుటుంబానికి అన్యాయం చేసిన మనిషి తప్పిదం. ఈ తప్పిదానికి శిక్ష అనుభవిస్తున్నది మాత్రం భార్యా పిల్లలు.డడడడ  
- కనకల లింగస్వామి సాక్షి, చౌటుప్పల్, నల్లగొండ జిల్లా

 

మొగుడు సచ్చిండనుకొని  బతుకమండు
నేను మూడో తరగతి వరకే చదివా. కూలీనాలీ చేసి పిల్లలను పోషిస్తున్నా, ఇప్పటికి రూ.3 లక్షల మేర అప్పులు చేసి నా శక్తిమేరకు పిల్లలను సదివిపిస్తున్నా. నా భర్త మల్లయ్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా రావడంలేదు. నా భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న మూడేళ్ల వరకు కనుక్కోలేకపోయా. నిలదీస్తే మొగుడు సచ్చిండనుకొని బతుకమండు. కుటుంబం పరువుపోతుందని ఇంతవరకు రోడ్డెక్కలే. ఇక ఈ కుటుంబాన్ని పోషించేందుకు నాకు దమ్ము చాలడంలేదు. పిల్లలు పెళ్లీలకు ఎదిగిండ్రు. నా భర్తను నాకు వెతికిపించాలె   - యాదమ్మ, భార్య

 

డాడే గుర్తుకొస్తుండు
ఏడాదిన్నర క్రితం కిట్స్‌లో ఎంటెక్ పూర్తి చేశా. బ్యాక్‌లాగ్ ఉండడంతో ఖాళీగా ఉన్న. నాన్న ఉన్నప్పుడు ప్రతిపనికి భుజం తట్టి ప్రోత్సహించేవాడు.  నాన్న వెళ్లిపోయాక ఏం చేయాలో తెలియడం లేదు. కష్టమొచ్చినా, సంతోషమనిపిచ్చినా ఆయనే గుర్తుకొస్తుండు. ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నాన్నకు ఇంకా 9 ఏళ్ల సర్వీసు ఉంది. ఇప్పటికైనా వస్తే వారి పెళ్లిళ్లు చేసి, కుటుంబాన్ని సర్దుకోవచ్చు.

 - కౌశిక్‌కుమార్  కుమారుడు

 

ఫీజు రూ.3 లక్షలు చెల్లిస్తే బీటె క్ సర్టిఫికేట్లు
నాన్నే 2008లో బాసర ట్రిపుల్ ఐటీలో చేర్పించిండు. నాన్న నా ఇంటర్‌కు బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుండు. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయిండు. బ్యాంకు లోన్ కట్టలే. ఇంటర్ పూర్తయ్యాక బీటెక్ చదివా. ఏడాదికి ఫీజు రూ.40 వేలు. ఇప్పుడు బ్యాంకు లోను, ఫీజు అన్నీ కలిసి, రూ.3 లక్షలకు చేరాయి. ఈ పైసలు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెబుతుండ్రు. బీటెక్ కిందటి ఏడాదే పూర్తయింది. ఉస్మానియా పీజీసెట్ రాశా. 300 ర్యాంకు వచ్చింది. సర్టిఫికేట్లు ఉంటే ఎంటెక్ మొదటి ఏడాది పూర్తయ్యేది. నాన్న వస్తడేమో, ఫీజు కట్టి సర్టిఫికేట్లు ఇప్పిస్తడేమోననే ఆశతో మళ్లీ, ఈ ఏడాది పీజీ సెట్‌కు ప్రిపేర్ అవుతున్నా. ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ ఇప్పించినా చదువుకుంటా.  - సృజన, పెద్ద కుమార్తె

 

బువ్వపెడ్త కానీ, చదివించలేనంది
నాన్న ఉన్నప్పుడు నల్లగొండలోని ఆల్ఫా స్కూల్‌లో చదివించిండు. 9వ తరగతిలో ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయిండు. ఎస్సెస్సీలో 9.8పాయింట్లు సాధించా. నల్లగొండలోని గౌతమ్ కళాశాల వారు ఉచితంగా కళాశాలలో సీటు ఇచ్చారు. ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. ఇంటర్‌లో 959మార్కులు సాధించా. బీటెక్ చదవాలనేది నా కోరిక. కానీ, ఫీజు రియింబర్స్‌మెంట్ రానందున అమ్మ బువ్వ పెడతా కానీ, అంత ఫీజు కట్టలేనంది. దీంతో డిగ్రీలో చేరా. నాన్న ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. పెద్ద చదువులు చదివించే వారు.  - శ్రీలేఖ, చిన్నకుమార్తె

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement