ఆశయం పందిరి..అభిమానం సందడి | Orphan Young Woman Marriage With payakarao Peta Man In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆశయం పందిరి..అభిమానం సందడి

Published Fri, Jun 22 2018 1:10 PM | Last Updated on Fri, Jun 22 2018 1:10 PM

Orphan Young Woman Marriage With payakarao Peta Man In Visakhapatnam - Sakshi

పెద్దల సమక్షంలో వేడుకగా ఆదర్శ వివాహం

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): వేద మంత్రాలు.. పచ్చని తోరణాలు.. బాజా భజంత్రీలు.. మంగళ వాయిద్యాలు.. దాతల దీవెనలు..విందు భోజనాలు..కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడింది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి.. పాయకరావుపేట అబ్బాయికి పెళ్లి జరిగింది. అందుకు ప్రేమసమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియం వేదికైంది. అనాథ బాలలు పెద్దలను ఆహ్వానిస్తూ కల్యాణ వేడుకకు స్వాగతం పలకగా వివాహం ఆనందోత్సాహాలతో కొనసాగింది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రావడంతో, కన్యాదాతలుగా ప్రముఖులు వ్యవహరించడంతో అసలు అమ్మాయికి అమ్మానాన్నా లేరన్న అభిప్రాయానికి తావే లేకుండా పోయింది.

ఇరవై ఏళ్లుగా ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మ, విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ, (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట కుమారుడు  కక్కిరాల వెంకట సత్యనారాయణ (చిన్నా) మధ్య పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. అందరి సమక్షంలో గురువారం ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమ సమాజం ప్రతినిధులు, రాజస్థాన్‌ సాంస్కృతిక మండల్‌ సభ్యులు, పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను దీవించారు. దాతలు ముందుకొచ్చి ఆ నూతన దంపతులకు కట్నకానుకలు అందజేశారు. కనకమహాలక్ష్మి దేవస్థాన ట్రస్ట్‌ బోర్డు చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త ఉప్పల భాస్కరరావు, వరహాలక్ష్మి  దంపతులు కన్యాదానం చేశారు. ప్రేమసమాజంలో ఇది 110వ వివాహం.

కానుకల వెల్లువ : ప్రేమసమాజంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న పద్మ తమ సొంత అమ్మాయి అన్న తీరున ఎక్కడెక్కడి వారూ కానుకలు అందించారు. ప్రేమసమాజం అధ్యక్షు డు కంచర్ల రామబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన కల్యాణ్‌కుమార్‌ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ. 5వేలు, కటిల్, జగన్‌ పటేల్‌ రూ.6,500, సీహెచ్‌ శేఖర్‌ రూ.15వేలు, కిరణ్‌ రూ.6,500, టి.వినీష్‌ రూ.10 వేలు ఇవ్వగా బొంది నాగభూషణరావు బంగారు శతమానం, ఎన్‌ఆర్‌ఐ భారతి జత పుస్తెలు కానుకగా అందించారు. అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. అఖిల భారతీయ అగర్వాల్‌ సమ్మేళన్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ ముందుకొచ్చి పెళ్లి కుమార్తెకు బంగారు పుస్తెల తాడు, చెవి రింగులు, ఉంగరాలు,, సంపతి గొట్టం, కాళ్ల మట్టెలు, సారె సామగ్రి అందజేశారు. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రామబ్రహ్మం,  కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, ఉపాధ్యక్షులు  బుద్దా శివాజీ, డాక్టర్‌ పి.విశ్వేశ్వరరావు, కోశాధికారి డి.వి.బాలాజీకుమార్, సంయుక్త కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, సంస్థ కార్యవర్గ సభ్యులు,  పీఆర్వో ఎం.వి.రాజశేఖర్, అగర్వాల్‌ సమ్మేళన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చాంద్‌మాల్‌ అగర్వాల్, ప్రేమసమాజం సిబ్బందితో పాటు ఎందరో ప్రముఖులు నూతన దంపతులను దీవించారు.  ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు బుద్ధ శివాజి, సంస్థ కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు (మట్టపల్లి చలమయ్య చారిటబుట్‌ ట్రస్ట్‌) సహకారంతో పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement