నాడు తండ్రి.. నేడు తల్లి
నాడు తండ్రి.. నేడు తల్లి
Published Wed, May 17 2017 1:13 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
► రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణం
► అనాథలైన ఇద్దరు చిన్నారులు
ధర్మపురి: విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. రోడ్డు ప్రమాదానికి గురై నాడు తండ్రి నేడు తల్లి మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి శోకం ఎంతోమందిని కదిలించింది. ఈ చిన్నారులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథకం. ధర్మపురికి చెందిన దుబ్బల రాజు–యమున దంపతులకు అఖిల్(11), వినయ్(8) అనే కుమారులున్నారు. ఉండడానికి ఇల్లు లేదు.
రాజు గ్రామంలో కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2011 ఫిబ్రవరి 3న జగిత్యాల పొలాస వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో రాజుతోపాటు ధర్మపురికి చెందిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ భారం యమునపై పడింది. కూలీ పని చేస్తూ వారిని స్థానిక ప్రైవేట్‌లో ఆంగ్ల మీడియంలో చదివిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వారి ఆలనాపాలనా చూస్తోంది.
దైవదర్శనం చేసుకొని వస్తుండగా తల్లి
మూడు రోజుల క్రితం వారి ఇంటి దైవమైన ఏసు ప్రభువు వద్ద ప్రార్థనలు జరిపి ఇంటికి తిరిగి వస్తుండగా.. జగిత్యాల జిల్లాలోని తక్కళ్లపెల్లి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో యమున(32)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తలకొరివి ఈ చిన్నారులే నిర్వహించడం కలచివేసింది.
అనాథలైన అన్నదమ్ములు
గోరుమద్దలు తినాల్సిన అన్నదమ్ములు తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథలయ్యారు. పూరి గుడిసెలో నివాసముంటున్న వీరిని ఆదుకోడానికి సహృదయులు ముందుకు రావాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.
Advertisement
Advertisement