parents died
-
మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు.. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రులు కూడా
సాక్షి, నల్గొండ: స్నేహితుల సరదా పందెం ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతిచెందగా ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారుడు కూడా కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన బుధవారం కోదాడలో వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కొండపల్లి శ్రీనాథ్, గౌతమి దంపతులకు కృష్ణకాంత్, శివ(29) సంతానం. శ్రీనాథ్ న్యాయవాదిగా, గౌతమి ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటున్నారు. కృష్ణకాంత్ ఉన్నత విద్య అభ్యసించి న్యాయవాద వృత్తిలో కొనసాగుతుండగా శివ డిగ్రీ అభ్యసిస్తున్నాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఎనిమిదేళ్ల క్రితం శివ స్నేహితులతో కలిసి కోదాడ పెద్ద చెరువు గుట్టపై పార్టీ చేసుకున్నారు. మద్యం అలవాటు లేని శివతో స్నేహితులు బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం చీకటి పడడంతో బైక్‌లపై అందరూ ఇళ్లకు బయలుదేరారు. సరదా పందెంతో ప్రమాదం బారిన పడి.. కాగా, స్నేహితులందరూ బైక్‌కు లైట్లు వేసుకోకుండా ఇళ్లకు ఎవరు ముందు వెళ్తే వారు పార్టీ ఇవ్వాలని పందెం పెట్టుకున్నారు. దీంతో మార్గమధ్యలో శివ బైక్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి కిందపడిపోయాడు. ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో పాటు నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. ఏడాది వ్యవధిలో తల్లిదండ్రి మృతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కోదాడతో పాటు హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. కుమారుడి దీనస్థితి చూడలేక ఏడాది క్రితం తండ్రి శ్రీనాథ్ కన్నుమూయగా ఆరు నెలల క్రితం తల్లి కూడా మృతిచెందింది. సోదరుడి సంరక్షణలో చికిత్స పొందుతున్న శివ కూడా మృత్యువును జయించలేక మంగళవారం రాత్రి మృతిచెందాడు. తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు సోదరుడు కూడా మృతిచెందడంతో ఆ ఇంట పెను విషాదం అలుముకుంది. -
కన్నీటి గాథ: అనాథలుగా ఆడబిడ్డలు
సాక్షి, మోటకొండూర్(నల్గొండ): మండలంలోని కొండాపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి డిగ్రీ చదువుతున్న ఆడబిడ్డలు అనాథలుగా మారారు. దీంతో ఆ అమ్మాయిల భవిష్యత్ ప్రశ్నాకార్థంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే ఆత్మకూరు(ఎం) మండలంలోని శీలంబాయి గ్రామానికి చెందిన కందడి సబిత– శ్రీనివాస్‌రెడ్డి దంపతుల్లో శ్రీనివాస్‌రెడ్డి 12ఏళ్ల కిందట మృతిచెందాడు. దీంతో సబిత(39) 2006 నుంచి తన పుట్టిన ఇల్లు అయిన మోటకొండూరు మండలం కొండాపురంలోనే ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు డిగ్రీ చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మొదటి కూతరు రేఖ డిగ్రీ తృతియ సంవత్సరం, హారిక ప్రథమ సంవత్సరం చుదువుతున్నారు. కరోనా సమయంలో గ్రామంలోని ప్రజలకు సబిత విశేష సేవలందించి అందరి మన్ననలు పొందింది. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) నాలుగు నెలల కిందట ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో చికిత్స చేయించుకునేందుకు అప్పటినుంచి ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఉన్న డబ్బు అంతా ఖర్చు చేశారు. అప్పులు కూడా తీసుకుని వైద్యం చేయించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈనెల 17న మృతిచెందింది. దీంతో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మారారు. వీరకి కనీసం గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఏమీ లేదు. ఆ ఆడబిడ్డలను చూసుకునేందుకు కేవలం 70 ఏళ్ల పైబడ్డ అమ్మమ్మ మాత్రమే ఉంది. ఆ పిల్లల చదువు, పోషణ ఎలారా భగవంతుడా అంటూ అమ్మమ్మ ఎడుస్తూ ఉంటే ఆ గ్రామస్తుల హృదయాలు బరువెక్కాయి. ఆ అమ్మమ్మకు కూడా ఇద్దరు కూతుళ్లే, మగ బిడ్డలు ఎవరూ లేరు. రోడ్డున పడ్డ ఆ ఆడబిడ్డల భవిషత్య దృష్టిలో ఉంచుకుని దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') -
‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు'
‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్ముల్ని ఎవరు చూస్తారు అంటూ చిన్నారులు శ్యామల, బిందు విలపించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. కరెంట్ రూపంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కుండ చేత పట్టి అంతిమయాత్ర ముగిసే వరకు అమ్మనాన్నలను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగారు. అన్నీ తామై తల్లిదండ్రులకు తలకొరివి పెట్టారు. తమకు దిక్కెవరు అని గుండెలు బాదుకుంటుండగా బంధువులు, గ్రామస్తులు వారిని ఓదార్చుతూనే కన్నీటి పర్యంతమయ్యారు’. సాక్షి, బయ్యారం: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు వచ్చిన కొడుకుతో పాటు కోడలును కరెంట్ కబలించింది. మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధి సింగారం కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్ తన భార్య తిరుపతమ్మతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్యామల, బిందు ఉన్నారు. ఇటీవల ఉపేందర్ తండ్రి వెంకులు కాలు విరిగింది. అతడిని చూసేందుకు వచ్చిన ఉపేందర్ దంపతులను కరెంట్ ప్రవహిస్తున్న దండెం బలి తీసుకుంది. కాగా వారి అంతిమ యాత్రలో కుమార్తెలు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!) నాడు ప్రేమలో.. నేడు చావులో.. కాలనీకి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ ప్రేమతో పెళ్లికి సిద్ధపడగా ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నాడు ప్రేమలో ఒకటైన వారు నేడు ఒకటిగా మృతి చెందారని అంటూ స్థానికులు కంటతడి పెట్టారు. తల కొరివిపెట్టిన చిన్నారులు.. విద్యుదాఘాతంతో మృతి చెందిన తల్లికి చిన్నకుమార్తె బిందు, తండ్రికి పెద్దకుమార్తె శ్యామల తలకొరివి పెట్టారు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులు పెద్ద బాధ్యతను మోయడం చూసిన పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..) ప్రభుత్వపరంగా ఆదుకుంటాం.. విద్యుదాఘాతంతో మృతి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ పిల్లలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎంపీ కవిత, అదనపు కలెక్టర్ కొమరయ్య అన్నారు. అదనపు కలెక్టర్ సింగారం కాలనీకి వెళ్లి పిల్లలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో తహసీల్దార్ నాగభవాని పాల్గొన్నారు. -
Coronavirus: మమ్మీ, డాడీ.. ఎప్పుడొస్తారు?
సాక్షి, జగిత్యాల: లేవగానే గుడ్‌మార్నింగ్ చెప్పే డాడీ గొంతు కొద్దిరోజులుగా వినిపించట్లేదు. అల్లరి చేస్తే.. వారించే మమ్మీ కనిపించట్లేదు. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన అమ్మానాన్న తిరిగి రాలేదు. గేటు చప్పుడు అయినప్పుడల్లా అమ్మానాన్న వచ్చారన్న సంబరంతో పరిగెత్తుకెళ్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రుల మరణవార్త తెలియకపోవడంతో ‘అమ్మా, నాన్న ఎక్కడ’అంటూ ప్రశ్నిస్తున్నారు. రేపు వస్తారంటూ బంధువులు చెప్పే మాటలు నమ్మి ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా పురాణిపేటకు చెందిన వనమాల నాగరాజు(38) బెంగళూరు లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య లహరిక (32) గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు దివిజ (10), హైందవి (6). బెంగళూరులో ఉండగా, నెల కింద వారందరికీ కరోనా సోకింది. మొదట భార్య.. తర్వాత భర్త.. తొలుత అందరూ హోం ఐసోలేషన్ లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొద్దిరోజులకే దంపతులిద్దరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు వచ్చింది. భార్యభర్తలిద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే వచ్చేస్తామంటూ చిన్నారులిద్దరినీ బంధువుల ఇంటికి పంపారు. నాగరాజుకు అమ్మానాన్న లేకపోవడంతో బంధువులే వారిని చూసుకున్నారు. మే 12న లహరిక ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం నాగరాజుకు చెబితే అతడి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని బంధువులు చెప్పలేదు. హైదరాబాద్‌లోనే లహరిక అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే 4 రోజుల తర్వాత భార్య చనిపోయిన విషయం నాగరాజుకు తెలిసింది. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించి చికిత్స పొందుతూ మే 17న చనిపోయాడు. నాగరాజు మృతదేహానికీ మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఇద్దరి చికిత్సకు రూ.25 లక్షలకు పైగా ఖర్చయినా ప్రాణాలు దక్కలేదు. చదవండి: Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి! -
కోవిడ్‌తో తల్లిదండ్రులు మృతి: అయ్యో ఎంత కష్టం వచ్చింది తల్లీ!
మంచం పట్టిన భర్త.. దివ్యాంగురాలైన కూతురు.. వయసు పైబడిన అత్త.. అందరి భారం ఆమెపైనే.. తన రెక్కల కష్టంపై అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది. ఆమెను విధి చిన్నచూపు చూసిందేమో.. కరోనా సోకింది. మంచంలోనే మనోవేదనకు గురైన భర్తనూ ఆ మహమ్మారి అంటుకుంది. కరోనాతో మృత్యువాతపడ్డాడు. భర్త లేడన్న విషయం తెలిసిన ఇల్లాలు ఆస్పత్రి నుంచి కాటికి చేరింది. అమ్మానాన్న మరణంతో గూడు చెదిరిన పక్షుల్లా పిల్లలు, వృద్ధురాలు విలవిల్లాడుతున్నారు. అక్కను, నానమ్మను చూసుకోవాల్సిన బరువైన బాధ్యత బడికెళ్లే చిన్నారిపై పడింది. సారంగపూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన ఎల్లుల రాములు (55), నర్సవ్వ (42) దంపతులకు ఇద్దరు సంతానం. కూతుళ్లు లత (28), సమిత (13) ఉన్నారు. లతకు పుట్టుకతోనే వెన్నెముక లోపంతో నడవలేని స్థితి. పుట్టు మూగ, మానసిక లోపంతో జన్మించింది. తన పనులు తాను చేసుకోలేని లతను తల్లి దగ్గరుండి చూసుకునేది. సమిత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రాములు బీడీ కంపెనీలో ప్యాకింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నర్సవ్వ బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది. ఎనిమిదేళ్ల క్రితం రాములుకు వెన్నెముకలో సమస్య రావడంతో ఆపరేషన్ చేయించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ భారం నర్సవ్వపై పడింది. మామ చనిపోవడంతో అత్త బాధ్యతలు సైతం నర్సవ్వ భుజాన వేసుకుంది. మంచం పట్టిన భర్తకు, దివ్యాంగురాలైన కూతురికి సపర్యలు చేస్తూ తన రెక్కల కష్టంతో అందరినీ పోషిస్తోంది. కరోనాతో ఛిన్నాభిన్నం.. ఇటీవల నర్సవ్వ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నర్సవ్వ కరోనా బారినపడడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తల్లికి, తనకు, ఇద్దరు పిల్లలకు దిక్కెవరు అంటూ రోదించేవాడు. నర్సవ్వ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఈ నెల 13న రాములు కరోనాతో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన నర్సవ్వ ఆస్పత్రిలోనే మరింత కుంగిపోయింది. ఈ నెల 20న ఆమె కూడా చనిపోయింది. ఆమె వైద్యం కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం నిలబడలేదు. వారం రోజుల్లోనే ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు, వృద్ధురాలు రోడ్డున పడ్డారు. నానమ్మ వయసు పైబడటం, పెద్ద అమ్మాయి సొంతంగా తన పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి భారమంతా చిన్నమ్మాయి సమితపై పడింది. బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత మోయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎలా పోషించాలో తెలియదు: సమిత మా నాన్న కొన్నేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అక్క వికలాంగురాలు.. తన పనులు కూడా సొంతంగా చేసుకోలేదు. నానమ్మకు చేతకాని పరిస్థితి. అన్ని పనులు మా అమ్మ చూసుకునేది. నాన్న ఏపనిలోనైనా అమ్మకు ధైర్యం చెబుతూ తోడుగా ఉండేవాడు. అమ్మానాన్నను కరోనా పొట్టనపెట్టుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న నేను.. నానమ్మ, వికలాంగురాలైన అక్కను ఎలా పోషించాలో తెలియడం లేదు. -
కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది
సాక్షి, కామారెడ్డి: ‘నా పాణం బాగుండది బిడ్డా. బీపీ, సుగర్ ఉన్నది. నా కొడుకు ఎంతన్న మంచిగా చూస్తుండే. కోడలు గూడ ఎంతన్న మంచిగా ఉండేది. ఇద్దరు మనుమరాల్లను ఆడించుకుంటూ ఉండేదాన్ని. దేవుడునాకు ఆన్నాయం జేసిండు. నా కొడుకు, కోడల్ని కరోనా బలి తీసుకుంది. నాకేమో చాత గాదు. ఇప్పుడీ ఇద్దర్నీ ఎట్లా సాదాలయ్యా’అంటూ చిన్నారులను దగ్గర పెట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కామారెడ్డికి చెందిన సిద్దవ్వ. కరోనా సెకండ్ వేవ్ కుటుంబాలకు కుటుంబాలనే బలి తీసుకుంటోంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తాతా మనవళ్లు.. ఇలా ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే తరహాలో సిద్దవ్వ తన కొడుకును, కోడల్నీ కోల్పోయింది. తననే ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఆమె.. ఇద్దరు మనవరాళ్లను ఎలా సాకాలో తెలియక తల్లడిల్లిపోతోంది. అంతులేని విషాదం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన బీమరి రాజేష్ (35), ఆయన భార్య స్రవంతి (31)ని వారం రోజుల వ్యవధిలోనే కరోనా కాటేసింది. రాజేష్‌కు తల్లి సిద్దవ్వ, కుమార్తెలు పదేళ్ల వైష్ణవి, ఏడేళ్ల వర్షిత ఉన్నారు. చిరు వ్యాపారం చేసే రాజేష్ కొన్నాళ్ల క్రితం కరోనా లక్షణాలతో ఓ స్థానిక వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. మలేరియా జ్వరం అని చెప్పిన ఆ వైద్యుడు మందులు రాసిచ్చాడు. నాలుగు రోజులు గడిచేసరికి పరిస్థితి విషమించి ఇంట్లోనే కన్ను మూశాడు. ‘నా కండ్ల ముందరనే కొడుకు సచ్చిపోయిండు. కొడుకు సావు జేసినమో లేదో కోడలు స్రవంతికి, నాకు, నా బిడ్డకు కూడా కరోనా వచ్చింది. మేమందరం మందులు ఏసుకున్నం. కోడలికి ఇబ్బంది అయ్యింది. దవాఖానకు తీసుకుపోతే హైదరాబాద్‌కు పొమ్మని డాక్టర్లు చెప్పిండ్రు. దీంతో పట్నంల కింగ్ కోఠి ఆస్పత్రిల చేరిస్తే, అక్కడ ఇబ్బంది ఉందని యశోదకు తీసుకుపోయినారు. ఆడ కూడా సుదరాయించలేదు. గాంధీ ఆస్పత్రికి తీసుకుపోయినాక చనిపోయింది. ఇప్పుడు నా మనుమరాండ్లను నేనెట్టా సాదాలి. నాకు తల కొరివి పెడతాడని అనుకుంటే నా కండ్ల ముందే కొడుకు, కొడుకు తర్వాత కోడలు సచ్చి పోయిండ్రు. నాకు, నా మనుమరాండ్రకు ఎవరు దిక్కు..’అంటూ సిద్దవ్వ రోదిస్తోంది. కొడుకు, కోడలు పోయిన దుఃఖం.. పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యతతో ఏం చేయాలో తెలియక ఆమె అల్లాడిపోతోంది. మరోవైపు రాజేష్ ఇంటి కోసం తీసుకున్న బ్యాంకు లోను భారంగా మారింది. బ్యాంకు వాళ్లు లోన్ కట్టాలని అంటున్నారని, దానికి ఇన్సూరెన్స్ కూడా లేదని చెబుతున్నారని రాజేష్ బంధువులు తెలిపారు. పిల్లల పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో ఇంటి రుణం మాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు. పిల్లలను చూస్తే గుండె అవసిపోతోంది ‘నా తమ్ముడు మంచిగా బతుకుతున్నాడు అని ఎంతన్న మురిసిపోయిన. కానీ కరోనాతో చనిపోయిండు. నా మరదలన్నా బాగై ఇంటికొస్తదని అనుకున్నా. చనిపోయిందని ఫోన్ రాగానే గుండెలు బాదు కున్నం. పిల్లలను చూస్తుంటే దుఖం వస్తోంది..’అని పిల్లల మేనత్త అంజమ్మ రోదిస్తోంది. -
అనాథ పిల్లలకు ఉచిత విద్య
న్యూఢిల్లీ: కోవిడ్‌తో తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోవడంతో అనాథలైన చిన్నారుల సంక్షేమంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. అనాథలైన చిన్నారులకు ఉచిత విద్యతోపాటు 23ఏళ్లు నిండేనాటికి వారికి రూ.10లక్షలు అందేలా చూస్తామని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ‘చిన్నారులే భారత భవిష్యత్తు. వారికి పూర్తి తోడ్పాటునందించడంతోపాటు వారి సంరక్షణ, సంక్షేమ బాధ్యత మొత్తం మా ప్రభుత్వానిదే. కోవిడ్‌తో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులను, జీవించి ఉన్న ఏకైక పేరెంట్ను కోల్పోయిన చిన్నారులను, చట్టబద్ధంగా తమ ఆలనాపాలనా చూసే సంరక్షకుడు(గార్డియన్)/పెంపుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ‘పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ఆదుకుంటాం. కోవిడ్‌లాంటి కష్టకాలంలో వారిలో మంచి భవిష్యత్‌పై నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వారిని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దుతాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో సర్కార్ రెండోసారి కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలు సంక్షేమ చర్యలకు శ్రీకారం చుట్టింది. అనాథలైన చిన్నారులను ‘పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం కింద ఆదుకోవాలని మోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఒక ప్రకటన విడుదలచేసింది. ఈ సంక్షేమ చర్యలను చిన్నారులకు పూర్తి సమర్థవంతంగా అమలుచేయాలంటే పీఎం–కేర్స్ ఫండ్‌కు విరాళాలను మరింతగా అందివ్వాలని భారత పౌరులను మోదీ కోరారు. ఏప్రిల్1 నుంచి మే 25 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 577 మంది చిన్నారులు అనాథలయ్యారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల చెప్పారు. చిన్నారుల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ►అనాథలైన చిన్నారుల పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ తెరుస్తారు. ►అనాథ అయిన ఆ అమ్మాయి/అబ్బాయికి 23 ఏళ్లు వచ్చేనాటికి డిపాజిట్ మొత్తం రూ.10 లక్షలకు చేరేలా పీఎం–కేర్ ఫండ్ నుంచి నిధులను బ్యాంకుల్లో జమచేస్తారు. ►వారికి 18 ఏళ్లు పూర్తయి 23 ఏళ్లు వచ్చే దాకా.. ఐదేళ్లపాటు ప్రతీ నెలా వారికి సొంత అవసరాల కోసం స్టైపెండ్ ఇస్తారు. ►కార్పస్ ఫండ్ నుంచి వచ్చే వడ్డీని వారికి 23 ఏళ్లు వచ్చే వరకు వ్యక్తిగత/ వృత్తిపరమైన అవసరాల కోసం అందివ్వనున్నారు. ►23 ఏళ్లు నిండాక మొత్తంగా ఒకేసారి డిపాజిట్ మొత్తాన్ని అందిస్తారు. చిన్నారుల విద్య కోసం.. ►10 ఏళ్లలోపు వయసు చిన్నారులకు దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయ/ ప్రైవేట్ పాఠశాలలో డే స్కాలర్‌గా అడ్మిట్ చేస్తారు. ►11–18 ఏళ్ల వయసు పిల్లలను సైనిక్ స్కూల్/ నవోదయ విద్యాలయ ఇలా ఏదైనా కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తారు. ►గార్డియన్/సమీప బంధువుల దగ్గర ఉండదలచుకున్న చిన్నారులను దగ్గర్లోని కేంద్రీయ విద్యాలయ/ప్రైవేట్ స్కూల్లో చేరుస్తారు. ►ప్రైవేట్ స్కూల్లో చేరితే విద్యాహక్కు చట్ట ప్రకారం నిర్ణయించిన ఫీజులను పీఎం–కేర్స్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. యూనిఫాం, టెక్ట్స్/నోట్ పుస్తకాల ఖర్చులూ ఇస్తారు. ఉన్నత విద్య కోసం.. ►ఉన్నత విద్య అవసరాల కోసం స్టైపెండ్ అందివ్వనున్నారు. ►వృత్తి విద్య, ఉన్నత విద్య కోర్సుల్లో చేరాలనుకునే వారు విద్యా రుణం పొందేలా కేంద్రం సాయపడనుంది. ఈ రుణంపై చెల్లించాల్సిన వడ్డీని పీఎం–కేర్స్ ఫండ్ చెల్లించనుంది. ►రుణాలు తీసుకోని వారికి.. అండర్గ్రాడ్యుయేట్/ఒకేషనల్ కోర్సుల్లో చేరితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద వారి ట్యూషన్/కోర్సు ఫీజుకు సరిసమానమైన స్కాలర్‌షిప్‌నూ అందిస్తారు. ►ప్రస్తుత స్కాలర్షిప్ పథకాలకు అనర్హులైన చిన్నారులకూ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. ఆరోగ్య బీమా ►చిన్నారులందరికీ ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని వర్తింపచేస్తారు. ►దీంతో వీరందరికీ రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది. ►ఈ చిన్నారులకు 18ఏళ్లు నిండేవరకూ ఈ పథకాలకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలను పీఎం– కేర్స్ ఫండ్ నుంచి అందిస్తారు. -
బిడ్డా.. తమ్ముడు పైలం..!
సాక్షి, జగిత్యాల: వారిది పేద కుటుంబం. పనిచేస్తేనే పూటగడిచేది. కూలీపని చేసుకుంటూనే భీమయ్య చేపలు కూడా పడుతూ ఇంటికోసం కష్టపడేవాడు. భార్య రాజకళ కూడా కూలీ పనులు చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. ఇలా ఆ దంపతులు కష్టపడుతూ తమ ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నారు. గర్భిణి అయిన తన భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్న భీమయ్యకు ఐదు నెలల క్రితం కరోనా సోకింది. కనికరం చూపని ఆ మహమ్మారి అతడ్ని బలితీసుకోగా.. వారం క్రితం రాజకళ సైతం ప్రసవ సమయంలో పరలోకానికి చేరింది. దీంతో వారి ఇద్దరు కొడుకులు గణేశ్(13), మనోజ్ (7) తల్లిదండ్రులు లేని వారయ్యారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన సాతాపురం భీమయ్య(40), ఆయన భార్య రాజకళ (32) దీనగాథ ఇది. బిడ్డా.. మళ్లొస్తానని చెప్పి.. ఐదు నెలల క్రితం కరోనాతో భీమయ్య చనిపోయిన సమయంలో అతని భార్య రాజకళ గర్భిణీ. భర్త చనిపోయిన బాధను దిగమింగుకుని రాజకళ కూలీ పనిచేస్తూ పిల్లలను పోషించుకుంది. అదే అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించింది. ఈ నెల 19న పురిటినొప్పులు వచ్చాయి. చుట్టుపక్కల వారే ప్రసవం కోసం జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెళ్లేప్పుడు పిల్లలకు జాగ్రత్తలు చెప్పింది. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలని గణేశ్‌కు చెప్పింది. మళ్లీ వస్తానంటూ వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లేసరికి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. తీవ్ర రక్తస్రావమైంది. రక్తం ఎక్కిస్తేనే బతుకుతుందని వైద్యులు చెప్పారు. ఎంత ప్రయత్నించినా రక్తం దొరకలేదు. దీంతో ఆమె పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామానికి చెందిన బీజేపీ, ఆరెస్సెస్ నాయకులు మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకొచ్చారు. పీపీఈ కిట్లు వేసుకుని వారే అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు దూరం నుంచి తల్లి మృతదేహాన్ని చూపించారు. చేరదీసిన దూరపు బంధువు అభంశుభం తెలియని వయసులో చిన్నారు లిద్దరూ.. ఐదునెలల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్నారు. చిన్నారులకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు సైతం లేరు. మెట్పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన వరుసకు అమ్మమ్మ అయ్యే సాయమ్మ వీరిని చేరదీసింది. చిన్నారులు ఉంటున్న అద్దె ఇంట్లోనే ఆ వృద్ధురాలు ఉంటూ వారి ఆలనా పాలనా చూస్తోంది. మండలానికి చెందిన కొందరు దాతలు చిన్నారులకు అండగా నిలిచి కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు. నా జీవునం ఉన్నంత వరకు సూసుకుంట.. పిల్లల తండ్రి కరోనా వచ్చి సచ్చిపోయిండు. తల్లి కాన్పుకు పోయి తిరిగి రాలేదు. పిల్లలు ఆగమయ్యిర్రు. నా జీవునం ఉన్నంత కాలం వీళ్లను సూసుకుంట. ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలె. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే రుణపడి ఉంటాం. – సాయమ్మ, చిన్నారుల బంధువు చదవండి: బాలిక గర్భంపై ‘సోషల్’ వార్.. ఎమ్మెల్యేకు తలనొప్పి -
పదహారు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి
ఎస్ఎస్ తాడ్వాయి: వారు అభం, శుభం తెలియని చిన్నారులు.. ఒకరి వయసు ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. పదహారు రోజుల వ్యవధిలోనే వారి తల్లి, తండ్రి ఇద్దరినీ కరోనా బలితీసుకుంది. ఈ విషయం చిన్నారులకు ఎలా చెప్పాలో తెలియక, వారి ఆలనా పాలనా ఏమిటని ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్ ఇంట్లో జరిగిన విషాదం ఇది. ఒకరి వెంట ఒకరు.. మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్ పెద్ద కుమారుడు సమ్మారావు (28). ఆయన కూడా జాతరలో సమ్మక్క తల్లిని తీసుకొచ్చే క్రతువులో పాల్గొంటారు. సమ్మారావుకు భార్య సృజన (25), ఐదేళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్, మూడేళ్ల కుమార్తె తేజస్విని ఉన్నారు. గత నెల 30న సమ్మారావు, సృజన ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం పాటు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో చిన్నారులిద్దరిని తాత మునీందర్, ఇతర బంధువులు చూసుకున్నారు. వారం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి రావడంతో పిల్లల ముఖాల్లో వెలుగు వచ్చింది. అంతా బాగుందని అనుకునేలోపే మరో ఘోరం జరిగింది. ఇంటికొచ్చిన నాలుగైదు రోజులకే సృజనకు శ్వాస సమస్యలు తలెత్తాయి. ఆక్సిజన్ శాతం పడిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈ నెల 11న కన్నుమూసింది. మృతదేహాన్ని మేడారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ ఏదని పిల్లలు అడుగుతుంటే.. రేపు, ఎల్లుండి వస్తుందని చెబుతూ సమ్మారావు బాధను దిగమింగుకుంటూ వచ్చాడు. భార్య చనిపోయిన బాధలో ఉన్న సమ్మారావుకు కూడా మళ్లీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశాడు. నాన్న నిద్రపోతున్నాడు.. అమ్మ ఏది? సృజన చనిపోయి అంత్యక్రియలు చేసిన విషయం, సమ్మారావు చనిపోయిన విషయం వారి ఇద్దరు చిన్నారులకు తెలియదు. గురువారం సమ్మారావు మృతదేహాన్ని మేడారం తీసుకొచ్చి భార్య సమాధి పక్కనే ఖననం చేశారు. ఈ క్రమంలో తండ్రి మృతదేహాన్ని దూరం నుంచే పిల్లలకు చూపించగా.. ఆయన నిద్రపోతున్నాడని అనుకున్నారు. ‘‘నాన్న ఇంటికి వచ్చాడు.. మరి అమ్మ ఎప్పుడు వస్తుంది’’ అని వచ్చీరాని మాటలతో చుట్టూ ఉన్న పెద్దలను అడిగారు. ఇది చూసి అంతా కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రులు ఇద్దరూ లేరని పిల్లలకు ఎలా చెప్పాలంటూ బంధువులు గుండెలు బాదుకున్నారు. కాగా.. సమ్మారావు మృతిపై మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్త మృతి చెందడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. పిల్లల బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించి ఆ కుటుంబానికి నిలుస్తుందని తెలిపారు. -
‘బంగారాలూ.. వారంలో వచ్చేస్తాం’ అంతలోనే...
ముత్తారం(మంథని): ‘బంగారాలు.. నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండండి. అల్లరి చేయొద్దు. బయట తిరగొద్దు.. ’అంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఆ తల్లి జాగ్రత్తలు చెప్పింది. మారాం చేస్తున్న కొడుకులిద్దరినీ.. ‘వారం రోజుల్లో తిరిగి వస్తాం. అందరం కలిసి మనింటికి వెళ్లిపోదాం..’ అంటూ బుజ్జగించింది. అప్పట్నుంచీ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వారం గడిచినా రాలేదు. కరోనా కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి తర్వాత మరొకరు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులిద్దరూ విగతజీవులై రావడం చూసిన చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కరోజులోనే దంపతులు మరణించడం, పెద్ద కొడుకైన 11 ఏళ్ల బాలుడు తన ఏడేళ్ల తమ్ముణ్ణి ఓదార్చడం స్థానికుల్ని కంటతడి పెట్టించింది. తొలుత భర్తకు.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన కుడికల్ల మల్లేశ్ (36), సృజన (34) దంపతులు.. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మెడికల్ షాపు నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కోవిడ్ లక్షణాలతో చాలామంది మల్లేశ్ వద్దకు వచ్చి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. రెండు రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో భార్య ఒత్తిడితో గోదావరిఖనిలో హెచ్ఆర్సీటీ స్కాన్ చేయించుకున్నాడు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దంపతులిద్దరూ బేగంపేటకు వెళ్లి పిల్లల్ని నాన్నమ్మ, తాతయ్య దగ్గర విడిచి పెట్టారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన మల్లేశ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత భార్యకు కూడా.. కరీంనగర్లో ఆస్పత్రి బయట ఉంటూ భర్త బాగోగులు చూసుకుంటున్న సృజన కూడా నాలుగురోజుల తర్వాత అస్వస్థతకు గురయ్యింది. అదే ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. బుధవారం వరకు చికిత్స కోసం మల్లేశ్‌కు రూ.8 లక్షలు, సృజనకు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షలు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. మెడికల్ షాపుతో ఉపాధి పొందుతున్న వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అయినా వారి చికిత్స కోసం కుటుంబసభ్యులు.. బంధువుల సాయంతో అప్పు చేసి రూ.10 లక్షల వరకు ఆస్పత్రికి చెల్లించారు. కానీ ఆరోగ్యం విషమించడంతో బుధవారం మధ్యాహ్నం 3.30 సమయంలో మల్లేశ్ మృతి చెందాడు. ఈ విషయం సృజనకు తెలియనివ్వకుండా.. కుటుంబసభ్యులు అదేరోజు మృతదేహాన్ని బేగంపేటకు తీసుకొచ్చి రాత్రికల్లా అంత్యక్రియలు పూర్తిచేశారు. మల్లేశ్ దహన సంస్కారాలు ముగించి 12 గంటలు కూడా గడవకముందే సృజన కూడా ఆరోగ్యం విషమించి మరణించినట్టు ఆస్పత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. బంధువులు మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని కూడా బేగంపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల్ని చూసి నాన్నమ్మ, తాతయ్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఎలాగైనా బతికించుకోవాలనుకుని.. మల్లేశ్ దంపతులు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో.. మల్లేశ్ తమ్ముడు సది, సృజన సోదరుడు కృష్ణ తమ అన్న, అక్కను ఎలాగైనా బతికించుకోవాలని భావించారు. ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు పని చేస్తోందని విని దాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ.. తనతో పాటుగా పనిచేసే పరిచయస్తులైన కృష్ణపట్నం వాసుల సహాయంతో ఆనందయ్య మందు కోసం ప్రయ త్నించాడు. వారు మందు తెస్తున్నామని చెప్పడంతో బుధవారం ఉదయం సది, కృష్ణ ఇద్దరూ అంబులెన్స్ మాట్లాడుకొని ఆంధ్రా సరిహద్దుకు వెళ్లారు. మందు తీసుకుని తిరిగి కరీంనగర్‌కు బయల్దేరారు. ఆనందయ్య మందు దొరికిందన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైంది. సరిహద్దు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే మల్లేశ్ మృతిచెందిన వార్తను కుటుంబసభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఆ విషాదంలోనే వారు గురువారం తెల్లవారుజా మున 4.30కి కరీంనగర్ చేరుకున్నారు. అయితే అప్పటికి గంట క్రితమే సృజన కూడా చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. -
మొన్న తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయిన సంజన..
సాక్షి, హిమాయత్‌నగర్: ‘కాళ్లు పట్టుకుంటా.. మా నాన్నను బతి కించండి’ అంటూ కనిపించిన వైద్యుల కాళ్లా వేళ్లాపడినా.. చివరకు నిస్సహాయస్థితిలో మొన్న తండ్రిని పోగొట్టుకున్న సంజన.. ఇప్పుడు తల్లినీ కోల్పోయింది. ‘మా అమ్మను బతికించండి సార్’ అంటూ టిమ్స్ వైద్యులను వేడుకుంటే, ‘మేం చూసుకుంటాం’ అని చెప్పి పంపిన వైద్యులు కాసేపటికే ‘మీ అమ్మ చనిపోయిందం’టూ చావు కబురు చెప్పారు. వారం వ్యవధిలో తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని ఇప్పు డు తమ్ముడితో కలిసి దైన్య పరిస్థితుల్లో కరోనాతో పోరాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన జగదీశ్, గీత దంపతులు. వీరికి సంజన, హనుమ సంతానం. జ్వరంతో బాధపడుతున్న తల్లికి సంజన ఈ నెల 5న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కోవిడ్ పరీక్ష చేయించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆమెను కింగ్‌కోఠిలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. వైద్యులు ఆక్సిజన్ బెడ్‌పై చికిత్స అందించారు. రెండ్రోజుల తర్వాత తండ్రికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అదే ఆస్పత్రిలో చేర్పించింది. కొద్దిరోజులకు తండ్రి పరిస్థితి విషమించింది. ఆయనకు ఐసీయూ బెడ్ సమకూర్చేందుకు సంజన ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అక్కడ కనిపించిన తెల్లకోటు వేసుకున్న ప్రతి ఒక్కరి కాళ్లావేళ్లాపడింది. చివరకు బెడ్ దొరకని దయనీయ పరిస్థితుల్లో ఆయన ఈ నెల 13న మరణించారు. నాడు సంజన కన్నీరుమున్నీరైన తీరును, ఆమె వేదనను కళ్లకుకడుతూ ‘కాళ్లు పట్టుకుంటా.. మా నాన్నను బతికించండి’ శీర్షికతో ఈ నెల 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఎవరూ కనికరించలేదు.. వారం వ్యవధిలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన దురదృష్టవంతురాలిని. తండ్రిని రక్షించుకునేందుకు కింగ్‌కోఠి ఆçస్పత్రిలో అందరి కాళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. తల్లినైనా కాపాడుకోవాలని తండ్రి శవా న్ని వదిలేసి ప్రైవేట్ ఆస్పత్రికి పరిగెత్తా. వాళ్లు నా బాధ పట్టించుకోలేదు. అమ్మ ను రక్షించండి.. అని మంత్రి కేటీఆర్‌ను వాట్సాప్‌లో రిక్వెస్ట్ చేశా. ఆయన స్పందించి ఆస్పత్రికి ఫోన్ చేయిస్తే, ఫోన్ చేయిస్తావా అంటూ వైద్యులు కసురుకున్నారు. అక్కడ అమ్మకు సరిగా వైద్యం అందదనే భయంతో గచ్చిబౌలిలో ‘టిమ్స్’కు తీసుకెళ్లా. పడకల్లేవంటూ సమయం వృథాచే యడంతో అమ్మ చనిపోయింది. ఇప్పుడు నాకు, తమ్ముడికి పాజిటివ్. – సంజన ఫిర్యాదు చేసిందని ప్రైవేట్ ఆస్పత్రి వీరంగం తండ్రి చనిపోయిన అరగంటకే తల్లి గీత పరిస్థితి విషమించింది. ఒకపక్క తండ్రి మృతదేహం.. ఆ బాధను దిగమింగుకుంటూనే సంజన.. తల్లిని కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి కర్మన్‌ఘాట్ బైరామల్‌గూడలోని ఓ ప్రెవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యులు గీతను సరిగా పట్టించుకోకపోగా, ఒక్కరోజుకే రూ.2 లక్షలు బిల్లు వేశారు. అసలే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంజన తల్లినైనా కాపాడుకోవాలనుకుంది. మంత్రి కేటీఆర్ వాట్సాప్ నంబర్‌ను సంపాదించి ‘నా తల్లిని రక్షించండి’ అంటూ ఈ నెల 15న మెసేజ్ చేసింది. దీనికి ‘ఓకే’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చిన అరగంటకే సదరు ఆస్పత్రికి ఫోన్ వెళ్లింది. అంతే.. కొద్దిసేపటికే ఆమెపై ఆస్పత్రి యాజమాన్యం మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ విరుచుకుపడింది. వీల్‌చైర్‌లోనే తుదిశ్వాస.. సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు సరిగా చూడటం లేదని భావించిన సంజన.. తల్లిని సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించింది. అక్కడా బెడ్స్ ఖాళీలేని పరిస్థితి.. దీంతో వైద్యులు సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం రాత్రి 2 గంటల వరకు వీల్‌చైర్‌లోనే ఉంచి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌పైనే గీతకు చికిత్స అందించారు. ‘ఏదైనా బెడ్ ఖాళీ కాగానే చేరుస్తాం. మీరు వెళ్లిపోండి. మేం చూసుకుంటాం’ అని వైద్యులు సంజనకు చెప్పారు. ఆ కొద్దిసేపటికే తల్లి చనిపోయిందంటూ వైద్యుల నుంచి ఫోన్ వచ్చింది. కథనం చూసి చలించా తండ్రిని బతికించుకోడానికి సంజన పడిన తపన గురించి ‘సాక్షి‘లో చదివాను. మనసు చివుక్కుమంది. వెంటనే సంజనకు, హనుమకు కోవిడ్ టెస్టులు చేయించాను. అంబులెన్స్‌ను, కొంత డబ్బును సమకూర్చాను. వాళ్ల తల్లిని బతికించాలని, డబ్బు ఎంత ఖర్చయినా భరిస్తానని ప్రైవేటు ఆసుపత్రి వాళ్లతో మాట్లాడాను. కానీ, పేషెంట్ పరిస్థితిని నాకుగానీ, సంజనకుగానీ వారు చెప్పలేదు. – శ్రావ్య మందాడి, ‘వీ అండ్ షీ’ వ్యవస్థాపకురాలు -
జాలి లేని దేవుడు!
సాక్షి, కంబదూరు: కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లికి చెందిన ప్రేమనాథ్‌కు పదేళ్ల క్రితం కామాక్షితో వివాహమైంది. అన్యోన్య దాంపత్యానికి చిరునామాగా మారిన వీరు తమకున్న కొద్దిపాటి సంపాదనతోనే సంతోషంగా జీవిస్తూ వచ్చారు. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పల్లవికి తొమ్మిదేళ్లు, సృజనకు ఏడేళ్లు, కుమారుడు చరణ్‌కు నాలుగేళ్లు. 30 రోజుల క్రితం ఇల్లాలి మృతి సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో కామాక్షి (30) అనారోగ్యం బారిన పడింది. అంతుచిక్కని వ్యాధి బారి నుంచి భార్యను కాపాడుకునేందుకు ప్రేమనాథ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పేదరికం కారణంగా ఖరీదైన వైద్యాన్ని చేయించలేకపోయాడు. చివరకు పరిస్థితి విషమించి నెల రోజుల క్రితం కామాక్షి మృత్యువాతపడింది. మనోవేదనతో కుమిలిపోయి.. భార్య మృతి ప్రేమనాథ్ను మరింత కుంగదీసింది. కేవలం పేదరికం కారణంగానే తన భార్యకు ఖరీదైన వైద్యం అందించలేక పోయానంటూ లోలోన కుమిలిపోతూ వచ్చేవాడు. ఒంటరిగా ముగ్గురు పిల్లలను ఎలా పెంచి పెద్దచేయాలని కలత చెందేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తన ఇంటిలోనే ప్రేమనాథ్ (36) కళ్లు తిరిగి కిందపడ్డాడు. విషయాన్ని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేశారు. ‘నాన్న లే నాన్నా’ అంటూ రోదించారు. ‘నాన్నకేమైంది అక్కా’ అంటూ సృజన, చరణ్ అడుగుతుంటే పల్లవి నోట మాటరాలేదు. చిన్నారుల రోదనలు విన్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరకున్నారు. పరిస్థితి గమనించి వెంటనే ప్రేమనాథ్ను కంబదూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే కనిపించకుండా పోయిన తల్లి రూపాన్ని తలుచుకుంటున్న ఆ చిన్నారులు... తాజాగా నిర్జీవంగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి ఎందుకో నాన్న నిద్రనుంచి ఇంకా లేవడం లేదంటూ అమాయకంగా అడుగుతుంటే గ్రామస్తులు కంటతడి పెట్టడం మినహా మరేమీ చేయలేకపోయారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి
► రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణం ► అనాథలైన ఇద్దరు చిన్నారులు ధర్మపురి: విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. రోడ్డు ప్రమాదానికి గురై నాడు తండ్రి నేడు తల్లి మృతిచెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి శోకం ఎంతోమందిని కదిలించింది. ఈ చిన్నారులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథకం. ధర్మపురికి చెందిన దుబ్బల రాజు–యమున దంపతులకు అఖిల్(11), వినయ్(8) అనే కుమారులున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. రాజు గ్రామంలో కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 2011 ఫిబ్రవరి 3న జగిత్యాల పొలాస వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో రాజుతోపాటు ధర్మపురికి చెందిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ భారం యమునపై పడింది. కూలీ పని చేస్తూ వారిని స్థానిక ప్రైవేట్‌లో ఆంగ్ల మీడియంలో చదివిస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ వారి ఆలనాపాలనా చూస్తోంది. దైవదర్శనం చేసుకొని వస్తుండగా తల్లి మూడు రోజుల క్రితం వారి ఇంటి దైవమైన ఏసు ప్రభువు వద్ద ప్రార్థనలు జరిపి ఇంటికి తిరిగి వస్తుండగా.. జగిత్యాల జిల్లాలోని తక్కళ్లపెల్లి మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో యమున(32)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. తలకొరివి ఈ చిన్నారులే నిర్వహించడం కలచివేసింది. అనాథలైన అన్నదమ్ములు గోరుమద్దలు తినాల్సిన అన్నదమ్ములు తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథలయ్యారు. పూరి గుడిసెలో నివాసముంటున్న వీరిని ఆదుకోడానికి సహృదయులు ముందుకు రావాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు. -
24 గంటల తేడాలోనే అమ్మ.. నాన్న!
అమ్మ.. నాన్న.. వీళ్లిద్దరినీ చూసుకుంటే పిల్లలకు కొండంత అండ. ఏది కావాలంటే అది నిమిషాల్లో చేసిపెట్టే అమ్మ, ఎక్కడికైనా సరే తన వెంట తీసుకెళ్లే నాన్న.. వీళ్లు ఉన్నంతవరకు ఎలాంటి బెంగ ఉండదు. వాళ్లలో ఒకళ్లు లేకపోతేనే పెద్దదిక్కు కోల్పోయినట్లు అవుతుంది. అలాంటిది 24 గంటల వ్యవధిలో అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోతే ఆ పిల్లలకు దిక్కెవరు? అమెరికాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. జెన్నిఫర్ నార్స్వర్దీ అనే మహిళ మెదడులో రక్తం గడ్డకట్టి ఏప్రిల్ 22న మరణించింది. ఆమెకు ఆరుగురు పిల్లలున్నారు. వాళ్లతో పాటు భర్త టోబీ నార్స్వర్దీ కూడా ఎంతగానో బాధపడ్డాడు. ఇన్నాళ్లు ఆమే ప్రపంచం అని భావించడంతో అతడి గుండె పగిలిపోయింది. భార్య మరణించి 24 గంటలు కూడా గడవక ముందే అతడు గుండెపోటుతో మరణించాడు. టాబీ చాలా నిస్వార్థపరుడని అతడి చిన్ననాటి స్నేహితుడు చెప్పారు. భార్య అన్నా.. పిల్లలన్నా అతడికి ఎనలేని ప్రేమ అని అన్నారు. ఈ దంపతులకు ఉన్న ఆరుగురు పిల్లల్లో క్వింటెన్ (20), రిలే (17), బ్రాడ్లీ (13) జెన్నిఫర్‌కు అంతకుముందే ఉన్నారు. టాబీని పెళ్లాడిన తర్వాత వీళ్లిద్దరికీ మరో ముగ్గురు పిల్లలు మికీ (11), అరోరా (9), లైనీ (6) పుట్టారు. వీళ్లను ఆదుకోవాలంటూ 'గోఫండ్‌మీ' అనే పేజి క్రియేట్ చేయగా, అందులో కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ. 16.50 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. -
అమ్మను చూడాలి...నాన్నతో ఆడాలి...!
మక్కువ: మండలంలోని గైశీల శోక సంద్రంలా మారింది. ఎటువైపు చూసినా రోదనలు వేదనలతో కన్నీటి లోకంగా మారిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు భవన ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కావడం లేదు. కూతురు కూడా అసువులు బాసిందని తెలిసి ఆ అమ్మానాన్నల రోదన ఆగడం లేదు. రెండురోజులుగా వారు భవన ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఎదురుచూస్తున్నారు. కన్నబిడ్డలపై ఆశలు వదులుకోలేక బతికి వస్తారేమోనని ఆశగా నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తున్నారు. కొడుకు వెంపడాపు శంకరరావు మృతిచెందాడని తెలుసుకున్న తల్లి నారాయణమ్మ, తండ్రి అప్పలనాయుడులు భోరున విలపిస్తున్నారు. కూతురు సరస్వతి కూడా చనిపోయింది. అలాగే భ ర్త మృతి చెందడంతో అతని భార్య దుర్గ రోదనను ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామం నుంచి పలువురు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో తమ వారిని గుర్తిస్తారని ఇక్కడి వారు ఆశగా ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు గైశీల గ్రామానికి చెందిన వెంపడాపు శంకరరావు మృతి చెందడంతో ఊహ కూడా తెలియని ఇద్దరు కుమారులు మూడేళ్ల నిఖిల్, 8 నెలలు హర్షవర్ధన్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే మజ్జి సరస్వతి భవన శిథిలాల్లో చిక్కుకొని మూడో రోజు గడిచినా ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె పిల్లలు కిశోర్, కార్తీక్‌లు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాయిపిల్లి సతీష్ గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా, అతని భార్య ఆచూకీ తెలియకపోవడంతో పిల్లలు చందూ, శ్వేతాలు అమ్మా,నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు. జియ్యమ్మవలస: మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన వారు చెన్నై భవన ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన వారి మృతదేహాలు ఇప్పటివరకు రాకపోవడంతో సంబంధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. శనివారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ముదిలి రామలక్ష్మి, మర్రాపు దమయంతి మృతదేహాలు లభ్యమవ్వగా మిగిలిన ముగ్గురు మర్రాపు వెంకటనాయుడు, తిరుపతినాయుడు, ముదిలి చిన్నంనాయుడుల ఆచూకీ తెలియక పోవడంతో వారి కుటుంబ సభ్యులు రెండు రోజుల నుండి తిండీతిప్పలు మాని రోదిస్తూ కూర్చుకున్నారు. చెన్నై నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో వీరు తమ వారు మళ్లీ వస్తారేమోనని ఆశగా ఉన్నారు. తండ్రి కోసం... శిథిలాల కింద చిక్కుకున్న మర్రాపు తిరుపతి నాయుడు ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో ఆయన కుమారుడు పోలినాయుడు ఆందోళన చెందుతున్నాడు. పోలినాయుడు 10 వ తరగతి చదువు చున్నాడు. తండ్రి భవన ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిసి బాలుడు విలవిలలాడిపోతున్నాడు. అక్క గర్భిణి కావడంతో అమ్మ మంగమ్మ చూడడానికి వచ్చిందని లేకుంటే అమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుని ఉండేదని తెలిపాడు. పై చదువులు చదివించడానికి... ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన మర్రాపు వెంకటనాయుడు కోసం ఆయన కుమారుడు జయంత్ పరితపిస్తున్నాడు. జయంత్‌ను ఉన్నత చదువులు చదివించడానికి వెంకటనాయుడు కొడుకును రావివలస వసతి గృహంలో విడిచిపెట్టి భార్య సరోజనమ్మ, కుమార్తె దమయంతిని తీసుకొని చెన్నై వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో వెంకటనాయుడుతోపాటు దమయంతి కూడా బలయ్యారు. తల్లి సరోజనమ్మ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకుంది. కళ్లెదుటే భర్త, కూతురు విగత జీవులుగా మారడంతో ఆమె వేదన వర్ణానాతీతం. నాన్న, అక్క చనిపోవడంతో జయంత్ బిత్తర చూపులతో కనిపిస్తున్నాడు. పిల్లలను ఇంటి వద్ద ఉంచి... పిల్లల భవిష్యత్ కోసం నాలుగు రాళ్లు సంపాదిద్దామని చిన్నారులను నానమ్మ వద్ద ఉంచి ముదిలి వెంకటరమణ, రామలక్ష్మి చెన్నై వెళ్లారు. కానీ ప్రమాదంలో తల్లి శవమై తేలింది. వెంకటరమణ మాత్రం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తల్లి చనిపోవడంతో దివ్య(8), రాణి(10)ల పరిస్థితి అగమ్యంగా మారింది. మా నాన్న మరి రారా..? ఇద్దరు ఆడపిల్లలు... మహాలకు్ష్మల్లా కళగా ఉన్నారు. కానీ ఆ కళను చూసే భాగ్యం తండ్రికి లేకుండా పో యిం ది. కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన సిరిపురపు రాము... భార్య లక్ష్మి పిల్లలు ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలను అనాథలుగా వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపొయారు. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని రాము ఎంతో ఆశపడ్డారు. కానీ దేవుడు అంతలోనే ఆయనను పిల్లలకు దూరం చేశాడు.