అమ్మను చూడాలి...నాన్నతో ఆడాలి...!
మక్కువ: మండలంలోని గైశీల శోక సంద్రంలా మారింది. ఎటువైపు చూసినా రోదనలు వేదనలతో కన్నీటి లోకంగా మారిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు భవన ప్రమాదంలో చనిపోయాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు ఆపడం ఎవరి తరం కావడం లేదు. కూతురు కూడా అసువులు బాసిందని తెలిసి ఆ అమ్మానాన్నల రోదన ఆగడం లేదు. రెండురోజులుగా వారు భవన ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఎదురుచూస్తున్నారు. కన్నబిడ్డలపై ఆశలు వదులుకోలేక బతికి వస్తారేమోనని ఆశగా నిద్రాహారాలు మాని మరీ ఎదురుచూస్తున్నారు. కొడుకు వెంపడాపు శంకరరావు మృతిచెందాడని తెలుసుకున్న తల్లి నారాయణమ్మ, తండ్రి అప్పలనాయుడులు భోరున విలపిస్తున్నారు. కూతురు సరస్వతి కూడా చనిపోయింది. అలాగే భ ర్త మృతి చెందడంతో అతని భార్య దుర్గ రోదనను ఎవరూ ఆపలేకపోతున్నారు. ఇప్పటికే గ్రామం నుంచి పలువురు ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్నవారిలో తమ వారిని గుర్తిస్తారని ఇక్కడి వారు ఆశగా ఉన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు
గైశీల గ్రామానికి చెందిన వెంపడాపు శంకరరావు మృతి చెందడంతో ఊహ కూడా తెలియని ఇద్దరు కుమారులు మూడేళ్ల నిఖిల్, 8 నెలలు హర్షవర్ధన్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే మజ్జి సరస్వతి భవన శిథిలాల్లో చిక్కుకొని మూడో రోజు గడిచినా ఇంతవరకు ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో ఆమె పిల్లలు కిశోర్, కార్తీక్‌లు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాయిపిల్లి సతీష్ గాయాలపాలై ఆస్పత్రిలో ఉండగా, అతని భార్య ఆచూకీ తెలియకపోవడంతో పిల్లలు చందూ, శ్వేతాలు అమ్మా,నాన్నలు కావాలంటూ రోదిస్తున్నారు.
జియ్యమ్మవలస: మండలంలోని ఇటిక పంచాయతీ నీలమాంబపురం గ్రామానికి చెందిన వారు చెన్నై భవన ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చనిపోయిన వారి మృతదేహాలు ఇప్పటివరకు రాకపోవడంతో సంబంధిత కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. శనివారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ముదిలి రామలక్ష్మి, మర్రాపు దమయంతి మృతదేహాలు లభ్యమవ్వగా మిగిలిన ముగ్గురు మర్రాపు వెంకటనాయుడు, తిరుపతినాయుడు, ముదిలి చిన్నంనాయుడుల ఆచూకీ తెలియక పోవడంతో వారి కుటుంబ సభ్యులు రెండు రోజుల నుండి తిండీతిప్పలు మాని రోదిస్తూ కూర్చుకున్నారు. చెన్నై నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో వీరు తమ వారు మళ్లీ వస్తారేమోనని ఆశగా ఉన్నారు.
తండ్రి కోసం...
శిథిలాల కింద చిక్కుకున్న మర్రాపు తిరుపతి నాయుడు ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో ఆయన కుమారుడు పోలినాయుడు ఆందోళన చెందుతున్నాడు. పోలినాయుడు 10 వ తరగతి చదువు చున్నాడు. తండ్రి భవన ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిసి బాలుడు విలవిలలాడిపోతున్నాడు. అక్క గర్భిణి కావడంతో అమ్మ మంగమ్మ చూడడానికి వచ్చిందని లేకుంటే అమ్మ కూడా ప్రమాదంలో చిక్కుకుని ఉండేదని తెలిపాడు.
పై చదువులు చదివించడానికి...
ప్రమాదంలో చిక్కుకుని ఆచూకీ తెలియకుండా పోయిన మర్రాపు వెంకటనాయుడు కోసం ఆయన కుమారుడు జయంత్ పరితపిస్తున్నాడు. జయంత్‌ను ఉన్నత చదువులు చదివించడానికి వెంకటనాయుడు కొడుకును రావివలస వసతి గృహంలో విడిచిపెట్టి భార్య సరోజనమ్మ, కుమార్తె దమయంతిని తీసుకొని చెన్నై వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో వెంకటనాయుడుతోపాటు దమయంతి కూడా బలయ్యారు. తల్లి సరోజనమ్మ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకుంది. కళ్లెదుటే భర్త, కూతురు విగత జీవులుగా మారడంతో ఆమె వేదన వర్ణానాతీతం. నాన్న, అక్క చనిపోవడంతో జయంత్ బిత్తర చూపులతో కనిపిస్తున్నాడు.
పిల్లలను ఇంటి వద్ద ఉంచి...
పిల్లల భవిష్యత్ కోసం నాలుగు రాళ్లు సంపాదిద్దామని చిన్నారులను నానమ్మ వద్ద ఉంచి ముదిలి వెంకటరమణ, రామలక్ష్మి చెన్నై వెళ్లారు. కానీ ప్రమాదంలో తల్లి శవమై తేలింది. వెంకటరమణ మాత్రం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తల్లి చనిపోవడంతో దివ్య(8), రాణి(10)ల పరిస్థితి అగమ్యంగా మారింది.
మా నాన్న మరి రారా..?
ఇద్దరు ఆడపిల్లలు... మహాలకు్ష్మల్లా కళగా ఉన్నారు. కానీ ఆ కళను చూసే భాగ్యం తండ్రికి లేకుండా పో యిం ది. కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన సిరిపురపు రాము... భార్య లక్ష్మి పిల్లలు ఏడేళ్ల వేదశ్రీ, ఐదేళ్ల ఐశ్వర్యలను అనాథలుగా వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపొయారు. ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు చదువుతున్నారు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని రాము ఎంతో ఆశపడ్డారు. కానీ దేవుడు అంతలోనే ఆయనను పిల్లలకు దూరం చేశాడు.