ముత్తారం(మంథని): ‘బంగారాలు.. నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండండి. అల్లరి చేయొద్దు. బయట తిరగొద్దు.. ’అంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఆ తల్లి జాగ్రత్తలు చెప్పింది. మారాం చేస్తున్న కొడుకులిద్దరినీ.. ‘వారం రోజుల్లో తిరిగి వస్తాం. అందరం కలిసి మనింటికి వెళ్లిపోదాం..’ అంటూ బుజ్జగించింది. అప్పట్నుంచీ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
వారం గడిచినా రాలేదు. కరోనా కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి తర్వాత మరొకరు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులిద్దరూ విగతజీవులై రావడం చూసిన చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కరోజులోనే దంపతులు మరణించడం, పెద్ద కొడుకైన 11 ఏళ్ల బాలుడు తన ఏడేళ్ల తమ్ముణ్ణి ఓదార్చడం స్థానికుల్ని కంటతడి పెట్టించింది.
తొలుత భర్తకు..
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన కుడికల్ల మల్లేశ్ (36), సృజన (34) దంపతులు.. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మెడికల్ షాపు నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కోవిడ్ లక్షణాలతో చాలామంది మల్లేశ్ వద్దకు వచ్చి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. రెండు రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో భార్య ఒత్తిడితో గోదావరిఖనిలో హెచ్‌ఆర్‌సీటీ స్కాన్ చేయించుకున్నాడు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దంపతులిద్దరూ బేగంపేటకు వెళ్లి పిల్లల్ని నాన్నమ్మ, తాతయ్య దగ్గర విడిచి పెట్టారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన మల్లేశ్ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు.
తర్వాత భార్యకు కూడా..
కరీంనగర్‌లో ఆస్పత్రి బయట ఉంటూ భర్త బాగోగులు చూసుకుంటున్న సృజన కూడా నాలుగురోజుల తర్వాత అస్వస్థతకు గురయ్యింది. అదే ఆస్పత్రిలో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. బుధవారం వరకు చికిత్స కోసం మల్లేశ్‌కు రూ.8 లక్షలు, సృజనకు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షలు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. మెడికల్ షాపుతో ఉపాధి పొందుతున్న వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అయినా వారి చికిత్స కోసం కుటుంబసభ్యులు.. బంధువుల సాయంతో అప్పు చేసి రూ.10 లక్షల వరకు ఆస్పత్రికి చెల్లించారు.
కానీ ఆరోగ్యం విషమించడంతో బుధవారం మధ్యాహ్నం 3.30 సమయంలో మల్లేశ్ మృతి చెందాడు. ఈ విషయం సృజనకు తెలియనివ్వకుండా.. కుటుంబసభ్యులు అదేరోజు మృతదేహాన్ని బేగంపేటకు తీసుకొచ్చి రాత్రికల్లా అంత్యక్రియలు పూర్తిచేశారు. మల్లేశ్ దహన సంస్కారాలు ముగించి 12 గంటలు కూడా గడవకముందే సృజన కూడా ఆరోగ్యం విషమించి మరణించినట్టు ఆస్పత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. బంధువులు మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని కూడా బేగంపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల్ని చూసి నాన్నమ్మ, తాతయ్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఎలాగైనా బతికించుకోవాలనుకుని..
మల్లేశ్ దంపతులు కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో.. మల్లేశ్ తమ్ముడు సది, సృజన సోదరుడు కృష్ణ తమ అన్న, అక్కను ఎలాగైనా బతికించుకోవాలని భావించారు. ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు పని చేస్తోందని విని దాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులోని ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ.. తనతో పాటుగా పనిచేసే పరిచయస్తులైన కృష్ణపట్నం వాసుల సహాయంతో ఆనందయ్య మందు కోసం ప్రయ త్నించాడు.
వారు మందు తెస్తున్నామని చెప్పడంతో బుధవారం ఉదయం సది, కృష్ణ ఇద్దరూ అంబులెన్స్ మాట్లాడుకొని ఆంధ్రా సరిహద్దుకు వెళ్లారు. మందు తీసుకుని తిరిగి కరీంనగర్‌కు బయల్దేరారు. ఆనందయ్య మందు దొరికిందన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైంది. సరిహద్దు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే మల్లేశ్ మృతిచెందిన వార్తను కుటుంబసభ్యులు వారికి ఫోన్ చేసి చెప్పారు. ఆ విషాదంలోనే వారు గురువారం తెల్లవారుజా మున 4.30కి కరీంనగర్ చేరుకున్నారు. అయితే అప్పటికి గంట క్రితమే సృజన కూడా చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment