సాక్షి, కరీంనగర్: జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. నాలుగు నెలల్లో ఎప్పుడూ లేని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా జిల్లా కేంద్రంపై మహమ్మారి తన ప్రతాపాన్ని చూపుతోంది. శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో జిల్లాలో 168 కేసులు తాజాగా నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 6,168 మంది కరోనా బారిన పడగా, 3650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో కరోనా మహమ్మారి ధాటికి 78 మంది మృత్యువాత పడ్డారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు కోవిడ్ కారణంగా సేవలను నిలిపివేస్తున్నాయి. అయినా ప్రజల్లో కరోనా పట్ల భయం లేకుండా పోతోంది. దగ్గు, జ్వరం ఇతరత్రా లక్షణాలతో బాధపడుతున్నా నిర్ధారణ పరీక్షలకు వెళ్లకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన అనేక మంది ఆ తర్వాత భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోంది.
వెంటిలేటర్ అవసరమయ్యే పరిస్థితిలో ఆసుపత్రిలో చేరినా ఫలితం లేకుండా పోతోంది. 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ఇన్నాళ్లు భావించినా.. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా యువత కూడా కోవిడ్‌కు బలవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నపాటి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాతో మందులు వాడిన వందలాది మంది సులభంగానే వైరస్ బారి నుంచి బయటపడుతున్నారు. ప్రభుత్వం కట్టడి చర్యల పట్ల చేతులెత్తేయడంతో రోగుల సంఖ్యలో విపరీతంగా పెరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో రోగాన్ని ఎలాగైనా జయించవచ్చనే విశ్వాసం కలుగుతోంది.
వేగంగా పెరుగుతున్న కేసులు..
కమ్యూనిటీ విస్తరణతో కరోనా పాజిటివ్‌ల సంఖ్య వేగంగా విస్తరిస్తోంది. ఎవరి నుంచి ఏ విధంగా కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం తదితర ఏ లక్షణాలు కనిపించినా పరీక్ష చేయించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment