సాక్షి, జగిత్యాల: లేవగానే గుడ్‌మార్నింగ్ చెప్పే డాడీ గొంతు కొద్దిరోజులుగా వినిపించట్లేదు. అల్లరి చేస్తే.. వారించే మమ్మీ కనిపించట్లేదు. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళ్లిన అమ్మానాన్న తిరిగి రాలేదు. గేటు చప్పుడు అయినప్పుడల్లా అమ్మానాన్న వచ్చారన్న సంబరంతో పరిగెత్తుకెళ్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రుల మరణవార్త తెలియకపోవడంతో ‘అమ్మా, నాన్న ఎక్కడ’అంటూ ప్రశ్నిస్తున్నారు.
రేపు వస్తారంటూ బంధువులు చెప్పే మాటలు నమ్మి ఎదురుచూస్తున్నారు. జగిత్యాల జిల్లా పురాణిపేటకు చెందిన వనమాల నాగరాజు(38) బెంగళూరు లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి భార్య లహరిక (32) గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలు దివిజ (10), హైందవి (6). బెంగళూరులో ఉండగా, నెల కింద వారందరికీ కరోనా సోకింది.
మొదట భార్య.. తర్వాత భర్త..
తొలుత అందరూ హోం ఐసోలేషన్ లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కొద్దిరోజులకే దంపతులిద్దరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు వచ్చింది. భార్యభర్తలిద్దరూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే వచ్చేస్తామంటూ చిన్నారులిద్దరినీ బంధువుల ఇంటికి పంపారు. నాగరాజుకు అమ్మానాన్న లేకపోవడంతో బంధువులే వారిని చూసుకున్నారు.
మే 12న లహరిక ఆరోగ్యం విషమించి చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం నాగరాజుకు చెబితే అతడి ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని బంధువులు చెప్పలేదు. హైదరాబాద్‌లోనే లహరిక అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే 4 రోజుల తర్వాత భార్య చనిపోయిన విషయం నాగరాజుకు తెలిసింది. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమించి చికిత్స పొందుతూ మే 17న చనిపోయాడు. నాగరాజు మృతదేహానికీ మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, ఇద్దరి చికిత్సకు రూ.25 లక్షలకు పైగా ఖర్చయినా ప్రాణాలు దక్కలేదు.
చదవండి: Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment