మంచం పట్టిన భర్త.. దివ్యాంగురాలైన కూతురు.. వయసు పైబడిన అత్త.. అందరి భారం ఆమెపైనే.. తన రెక్కల కష్టంపై అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది. ఆమెను విధి చిన్నచూపు చూసిందేమో.. కరోనా సోకింది. మంచంలోనే మనోవేదనకు గురైన భర్తనూ ఆ మహమ్మారి అంటుకుంది. కరోనాతో మృత్యువాతపడ్డాడు. భర్త లేడన్న విషయం తెలిసిన ఇల్లాలు ఆస్పత్రి నుంచి కాటికి చేరింది. అమ్మానాన్న మరణంతో గూడు చెదిరిన పక్షుల్లా పిల్లలు, వృద్ధురాలు విలవిల్లాడుతున్నారు. అక్కను, నానమ్మను చూసుకోవాల్సిన బరువైన బాధ్యత బడికెళ్లే చిన్నారిపై పడింది.
సారంగపూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన ఎల్లుల రాములు (55), నర్సవ్వ (42) దంపతులకు ఇద్దరు సంతానం. కూతుళ్లు లత (28), సమిత (13) ఉన్నారు. లతకు పుట్టుకతోనే వెన్నెముక లోపంతో నడవలేని స్థితి. పుట్టు మూగ, మానసిక లోపంతో జన్మించింది. తన పనులు తాను చేసుకోలేని లతను తల్లి దగ్గరుండి చూసుకునేది. సమిత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రాములు బీడీ కంపెనీలో ప్యాకింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
నర్సవ్వ బీడీలు చుడుతూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది. ఎనిమిదేళ్ల క్రితం రాములుకు వెన్నెముకలో సమస్య రావడంతో ఆపరేషన్ చేయించారు. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో కుటుంబ భారం నర్సవ్వపై పడింది. మామ చనిపోవడంతో అత్త బాధ్యతలు సైతం నర్సవ్వ భుజాన వేసుకుంది. మంచం పట్టిన భర్తకు, దివ్యాంగురాలైన కూతురికి సపర్యలు చేస్తూ తన రెక్కల కష్టంతో అందరినీ పోషిస్తోంది.
కరోనాతో ఛిన్నాభిన్నం..
ఇటీవల నర్సవ్వ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నర్సవ్వ కరోనా బారినపడడంతో రాములు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తల్లికి, తనకు, ఇద్దరు పిల్లలకు దిక్కెవరు అంటూ రోదించేవాడు. నర్సవ్వ ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఈ నెల 13న రాములు కరోనాతో చనిపోయాడు. ఈ విషయం తెలిసిన నర్సవ్వ ఆస్పత్రిలోనే మరింత కుంగిపోయింది. ఈ నెల 20న ఆమె కూడా చనిపోయింది.
ఆమె వైద్యం కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం నిలబడలేదు. వారం రోజుల్లోనే ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు, వృద్ధురాలు రోడ్డున పడ్డారు. నానమ్మ వయసు పైబడటం, పెద్ద అమ్మాయి సొంతంగా తన పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి భారమంతా చిన్నమ్మాయి సమితపై పడింది. బడికెళ్లే వయసులో బరువైన బాధ్యత మోయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎలా పోషించాలో తెలియదు: సమిత
మా నాన్న కొన్నేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. అక్క వికలాంగురాలు.. తన పనులు కూడా సొంతంగా చేసుకోలేదు. నానమ్మకు చేతకాని పరిస్థితి. అన్ని పనులు మా అమ్మ చూసుకునేది. నాన్న ఏపనిలోనైనా అమ్మకు ధైర్యం చెబుతూ తోడుగా ఉండేవాడు. అమ్మానాన్నను కరోనా పొట్టనపెట్టుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న నేను.. నానమ్మ, వికలాంగురాలైన అక్కను ఎలా పోషించాలో తెలియడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment