24 గంటల తేడాలోనే అమ్మ.. నాన్న!
అమ్మ.. నాన్న.. వీళ్లిద్దరినీ చూసుకుంటే పిల్లలకు కొండంత అండ. ఏది కావాలంటే అది నిమిషాల్లో చేసిపెట్టే అమ్మ, ఎక్కడికైనా సరే తన వెంట తీసుకెళ్లే నాన్న.. వీళ్లు ఉన్నంతవరకు ఎలాంటి బెంగ ఉండదు. వాళ్లలో ఒకళ్లు లేకపోతేనే పెద్దదిక్కు కోల్పోయినట్లు అవుతుంది. అలాంటిది 24 గంటల వ్యవధిలో అమ్మ, నాన్న ఇద్దరూ చనిపోతే ఆ పిల్లలకు దిక్కెవరు? అమెరికాలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. జెన్నిఫర్ నార్స్‌వర్దీ అనే మహిళ మెదడులో రక్తం గడ్డకట్టి ఏప్రిల్ 22న మరణించింది. ఆమెకు ఆరుగురు పిల్లలున్నారు. వాళ్లతో పాటు భర్త టోబీ నార్స్‌వర్దీ కూడా ఎంతగానో బాధపడ్డాడు.
ఇన్నాళ్లు ఆమే ప్రపంచం అని భావించడంతో అతడి గుండె పగిలిపోయింది. భార్య మరణించి 24 గంటలు కూడా గడవక ముందే అతడు గుండెపోటుతో మరణించాడు. టాబీ చాలా నిస్వార్థపరుడని అతడి చిన్ననాటి స్నేహితుడు చెప్పారు. భార్య అన్నా.. పిల్లలన్నా అతడికి ఎనలేని ప్రేమ అని అన్నారు. ఈ దంపతులకు ఉన్న ఆరుగురు పిల్లల్లో క్వింటెన్ (20), రిలే (17), బ్రాడ్లీ (13) జెన్నిఫర్‌కు అంతకుముందే ఉన్నారు. టాబీని పెళ్లాడిన తర్వాత వీళ్లిద్దరికీ మరో ముగ్గురు పిల్లలు మికీ (11), అరోరా (9), లైనీ (6) పుట్టారు. వీళ్లను ఆదుకోవాలంటూ 'గోఫండ్‌మీ' అనే పేజి క్రియేట్ చేయగా, అందులో కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ. 16.50 లక్షల వరకు విరాళాలు వచ్చాయి.