మానసిక దివ్యాంగురాలికి అల్పాహారం అందజేస్తున్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
సంగారెడ్డి టౌన్: నిస్సహాయులకు మానవతా దృక్పథంతో చేతనైన సాయం చేసి చేయూతనివ్వాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఎంఎన్‌ఆర్ ఆస్పత్రి పరిసరాలు, బైపాస్‌రోడ్డు, పోతిరెడ్డిపల్లి ఎక్స్‌రోడ్, బాలాజీ నర్సింగ్ హోం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లపై ఒంటిమీద సరైన దుస్తులు లేకుండా, పెరిగిన జుట్టు, అపరిశుభ్రంగా, మతిస్థితిమితం లేని, కుటుంబ సభ్యుల నిరాధరణకు గురైన ఎనిమిది మందిని గుర్తించి వారిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి
ఆవరణలోని ఇన్‌సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ (మానసిక దివ్యాంగుల వార్డు)కు తరలించారు. అక్కడ జట్టు కత్తిరించి, శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత కలెక్టర్ వారికి కొత్త దుస్తులు, దుప్పట్లను అందజేశారు. అల్పాహారాన్ని తెప్పించి ఇచ్చారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి వారికి వైద్య చికిత్సలు నిర్వహించారు. మళ్లీ రోడ్ల మీదకు రాకుండా వారిని జాగ్రత్తగా చూసుకోవాలని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మనోహర్‌కు కలెక్టర్ సూచించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో నిరాధరణకు గురైన, మతిస్థిమితం లేని వారు ఎవరైనా తారసపడితే వారిని ఇన్‌సెడ్ స్వచ్ఛంద సేవా సంస్థలో అప్పగించాలని అన్నారు. వారికి చేయూత నివ్వడానికి జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురహరి, సంగారెడ్డి, కంది తహసీల్దారులు విజయ్‌కుమార్, గోవర్థన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment