అందరూ ఉన్నా అనాథలా..!
అందరూ ఉన్నా అనాథలా..!
Published Mon, Jan 23 2017 11:30 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
- షెల్టర్ హోంలో తలదాచుకుంటున్న బాలుడు
నంద్యాలవిద్య: గోరుముద్దలు తినిపిస్తూ, ఆత్మీయతను పంచాల్సిన అమ్మ పిచ్చిదైంది. అనురాగాన్ని పంచుతూ, బాధ్యతగా అక్షరాలు నేర్పించాల్సిన తండ్రి పోషించలేక చేతులెత్తేశారు. నమ్మిన చిన్నాన్న రూ.20వేలకు తెగనమ్మడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ పోలీసులు, ఐసీడీఎస్ అధికారుల చొరవతో ఆరేళ్ల లోకేష్ అనాథలా షెల్టర్ హోంలో తలదాచుకుంటున్నాడు.
లోకేష్ స్వగ్రామం ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల. చిన్నతనంలోనే తల్లి లక్ష్మికి మతిచలించింది. పిచ్చిచేష్టలు చేస్తూ, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేది. తండ్రి బుజ్జి ..ఆర్థిక స్థోమత లేకపోవడంతో పోషించలేక కుమారుడిని వదిలేశాడు. నిస్సహాయస్థితిలో ఉన్న లోకేష్‌ను.. చిన్నాన్న శీను అన్నీ తానై చూసుకుంటానని, విద్యాబుద్ధులు చెప్పిస్తానని మభ్యపెట్టి బేతంచెర్లకు తీసుకొని వచ్చాడు. బస్టాండ్ వద్ద లోకేష్‌ను రూ.20వేలకు అమ్మడానికి ప్రయత్నించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని లోకేష్‌కు విముక్తి కల్పించారు. కాని మళ్లీ అమ్మానాన్నల దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఐసీడీఎస్ అధికారులు కొద్ది రోజులు కర్నూలు సీక్యాంపులోని శిశు గృహానికి అతన్ని తరలించారు. తర్వాత జిల్లా బాలల సంరక్షణ అధికారులు అతన్ని నంద్యాల పట్టణం నందమూరినగర్‌లో స్టార్ సొసైటీ నిర్వహిస్తున్న షెల్టర్ హోంలో చేర్పించారు. లోకేష్ పదినెలల నుంచి ఈ షెల్టర్ హోంలోనేఉంటూ తల దాచుకుంటున్నాడు. ఇతని కోసం ఎవరూ ముందుకు రావడం లేదని షెల్టర్ హోం నిర్వాహకురాలు రాజేశ్వరమ్మ తెలిపారు. బాలుని ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ముందుకు వస్తే కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. అయితే తాను షెల్టర్ హోంలోనే ఉంటూ బాగా చదువుకొని పోలీస్ అవుతానని లోకేష్ చెబుతున్నాడు.
Advertisement