స్థానిక మహిళతో వివాహం.. రాత్రి పూట బయటి కాలనీల్లో తిరుగుతూ.. | Car Stealing Gang In Rangareddy | Sakshi
Sakshi News home page

కన్ను పడిందో కారు మాయమే 

Published Sun, Dec 12 2021 9:50 AM | Last Updated on Sun, Dec 12 2021 9:50 AM

Car Stealing Gang In Rangareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాత్రి పూట రెక్కీ నిర్వహిస్తారు. పార్కింగ్‌ చేసిన  కార్లను అపహరిస్తారు. రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఈ అంతర్రాష్ట్ర ఆటోమొబైల్‌ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు.

వారి నుంచి రూ.50 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితకే మూర్తి, డీసీపీ క్రైమ్స్‌ యాదగిరిలతో కలిసి రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌  అడిషనల్‌ సీపీ సుధీర్‌ బాబు వెల్లడించారు.  

 మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఉదయ్‌ మారుతీ పాటిల్, ఫర్మాల్‌ అలీఖాన్, ఇమ్రాన్‌ ఖాన్‌ పఠాన్, సోహ్రబ్‌ అలీ, యెవరుల్లా ఖాన్, సంతోష్‌ జగన్నాథ పవార్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పఠాన్‌ (36) కుషాయిగూడ హెచ్‌బీ కాలనీలో స్థానికంగా ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు.  

 రాత్రిపూట కాలనీల్లో తిరుగుతూ బయట కార్లు ఎక్కడ పార్క్‌ చేశారు? కెమెరాలు ఉన్నాయా? రాత్రి వేళల్లో జన సంచారం ఉంటుందా? వంటి వాటిపై రెక్కీ నిర్వహించి..  సమాచారాన్ని మహారాష్ట్రల్లోని తన గ్యాంగ్‌కు చేరవేస్తాడు.  

 సమాచారం అందుకున్న ఉదయ్‌ మారుతీ పాటిల్‌ ప్లాన్‌ చేసి.. అనుచరులను రంగంలోకి దింపుతాడు. ఇమ్రాన్‌ఖాన్‌ సూచించిన ప్రాంతంలో రాత్రికి వెళ్లి కార్‌ను చోరీ చేస్తారు. 

► మారుతీ స్విఫ్ట్, హోండా ఐ 10, అమేజ్‌ కార్లను మాత్రమే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. రిపేరు లేదా స్క్రాప్‌లో వచ్చిన కార్ల నంబర్‌ ప్లేట్లను తీసుకొని అలాంటి రంగు ఉండే కార్లనే చోరీ చేస్తారు. వాటికి అసలు కార్‌ నంబర్‌ ప్లేట్‌ను తగిలించి కస్టమర్‌కు విక్రయిస్తారు.  

 వీళ్ల ప్రత్యేక మెకానిజం కారణంగా కార్‌ డోర్‌ను ఓపెన్‌ చేసినప్పుడు అలారం కూడా మోగదు. కారు డోర్‌ను ఓపెన్‌ చేసి నకిలీ తాళం చెవితో స్టార్ట్‌ చేసి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తారు. అక్కడికి వెళ్లాక కారు ఇంజిన్, చాసిస్‌ నంబర్లను మార్చేస్తారు. ఒక్కో కారుకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల లాభం చూసుకొని విక్రయిస్తుంటారు. 

► ఈ గ్యాంగ్‌ ఐదేళ్లుగా వేర్వేరు రాష్ట్రాల్లో చోరీలు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 50కి పైగా కార్లను చోరీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.  

► ఇద్దరు నిందితులు ఇమ్రాన్‌ఖాన్‌ పఠాన్, సంతోష్‌ జగన్నాథ పవార్‌లను కస్టడీకి తీసుకొని లోతుగా విచారణ చేస్తే అసలు ఎన్ని కార్లు దొంగిలించారు? ఎవరెవరికి విక్రయించారో బయటపడుతుందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి తెలిపారు.  

చదవండి: నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement