
ఓ కవిత కథ..!
* ఆసుపత్రిలో అనాథగా వదిలేశారు..!
*పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది
బళ్లారి (తోరణగల్లు) : అమ్మనాన్నలు చిన్నప్పుడే పోయారు. తోడబుట్టిన తమ్ముడే దిక్కయ్యాడు. ఇద్దరు కాయకష్టం చేసుకుంటు జీవనం సాగిస్తున్న తరుణంలో ఎనిమిదేళ్ల క్రితం ఓసారి కాలుజారి కిందపడింది. దీంతో తుంటి భాగం బెణికింది. కట్టె సాయంతో నడుస్తుండగా వారం క్రితం మళ్లీ కింద పడింది. దీంతో నడవలేని స్థితికి వచ్చింది. తమ్ముడు ఆసుపత్రిలో చికిత్సకు తీసుకొచ్చి గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. దీంతో ఆ అభాగ్యురాలు ఎమర్జెన్సీ వార్డు దారిలోనే స్ట్రెచర్ పైనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది సైతం పట్టించు కోలేదని వాపోయింది.
వివరాల్లోకెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన కవిత (39)కు బాల్యంలోనే తల్లిదండ్రులు గోపీనాథ్, వత్సలా బాయిలు మృతి చెందారు. తమ్ముడు శ్రీనివాస్, కవిత పెద్దమ్మతో బళ్లారిలో స్థిరపడ్డారు. కొంత కాలానికి కవిత పెద్దమ్మ జబ్బుతో చనిపోయింది. కవిత బట్టల షాపులో సేల్స్‌గర్ల్ గా, తమ్ముడు శ్రీనివాస్ ఓ బంగారు దుకాణంలో పని చేస్తు కాలం వెళ్లదీస్తుండగా ఎనిమిదేళ్ల క్రితం కవిత కాలు జారి కింద పడటంతో తుంటి భాగం దెబ్బతింది. కట్టె సాయంతో నడుస్తుండేది. మళ్లీ వారం రోజుల క్రితం కింద పడటంతో నడవలేని స్థితికి వచ్చింది. దీంతో తమ్ముడు శ్రీనివాస్ గురువారం విమ్స్‌కు వైద్యం కోసం తీసుకొచ్చాడు. వైద్యులు ఎక్స్‌రే పరీక్షలకు సిఫారసు చేశారు. తమ్ముడు శ్రీనివాస్ గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు.
దీంతో బాధితురాలు కవిత గురువారం నుంచి విమ్స్ మైనర్‌ఓటీ వద్దే స్ట్రెచర్‌పై అభాగ్యురాలుగా పడి ఉంది. ఆసుపత్రి సిబ్బంది గాని వైద్యులు కాని తనను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయింది. తన తమ్ముడు తన వైద్యం కోసం డబ్బుల కోసం ఎక్కడ తిరుగుతున్నాడోనని ఆవేదన చెందుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు పాలు, బ్రెడ్డు ఇస్తున్నారే తప్ప ఆ వార్డులో పని చేసే సిబ్బంది గాని అటెండర్లు కాని పట్టించుకోవడం లేదు. తమ్ముడి కోసం ఎదురు చూస్తు రెండురోజులుగా అక్కడే గడుపుతోంది.