శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం
Published Sun, Feb 19 2017 10:46 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
ప్రేమ మందిరంలో వైభవంగా దాక్షాయణి, ఉమామహేశ్వరావుల వివాహం
ఆదర్శ వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
కన్యాదానం చేసిన అరబిందో మార్కెటింగ్ వైస్ చైర్మన్ ప్రసాద్ దంపతులు
అమలాపురం టౌన్:అక్కడ ఆదర్శం ఆవిష్కృతమైంది. పెద్దాపురానికి చెందిన చెన్నైలో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పేరి ఉమామహేశ్వరరావు అమలాపురం కామాక్షీపీఠం ప్రేమమందిరంలో పెరిగిన దాక్షాయణిని వివాహమాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. కామాక్షీ పీఠం ప్రేమ మందిరంలో అనాథగా పెరిగిన దాక్షాయణిని ఆదివారం తెల్లవారు జామున ఉమామహేశ్వరరావు వివాహమాడారు. పీఠాధిపతి కామేశమహర్షి ఆధ్వర్యంలో కామాక్షీ పీఠం ప్రేమ మందిరంలో ఈ ఆదర్శ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మిండగుదుటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్థి కమిటీ చైర్మన్ మెట్ల రమణబాబు, ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు తదితర ప్రముఖులు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. కామాక్షీ పీఠానికి వచ్చే భక్తులందరూ ఈ వేడుకకు తరలి రావటంతో పీఠం కిక్కిరిసిపోయింది. ప్రేమ మందిరింలోని మిగిలిన పిల్లలందరూ తమ అక్క దాక్షాయణి వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కకు చిరు కానుకలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి తన సొంత ఆడపిల్లకు పెళ్లి చేసినట్టే అన్నీ తానై చక్కబెట్టింది. శనివారం మధ్యాహ్నానికే పెద్దాపురం నుంచి వరుడు ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులు, బంధువులు పీఠానికి చేరుకున్నారు. సాయంత్రం నుంచి పెళ్లి వేడుకులు మొదలయ్యాయి.
మాకు ఆడపిల్ల లేని లోటు తీరింది
నేను హైదరాబాద్ అరబిందో ఫార్మా లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్నాను. మా స్వగ్రామం అమలాపురంలో కామాక్షీ పీఠం ఉన్న కృష్ణారావు వీధే. చిన్నతనం నుంచి పీఠంతో నాకు అనుబంధం ఉంది. మా కుంటుంబంలో అందరి పుట్టిన రోజులు పీఠంలోనే జరుపుకుంటాం. నా భార్య సుజాత, నేను పీఠంలోని ప్రేమ మందిరంలో పెరిగే అనాథ పిల్లలతో అనుబంధం పెంచుకున్నాం. మాకు ఆడపిల్లలు లేరు. అందుకే దాక్షాయణిని తమ కూతురుగా భావించి ఆమె పెళ్లి ఖర్చు అంతా భరించాం. వరుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేశాం. మాకు ఆడపిల్ల లేదన్న లోటు తీరింది.
– పెమ్మరాజు ప్రసాదరావు, సుజాత దంపతులు
సంగీతమే ఇద్దర్నీ కలిపింది
గత సంవత్సరం ఇదే పీఠం ప్రేమ మందిరంలో ఓ అనాథ యువతిని నా స్నేహితుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహానికి నేనూ వచ్చాను. అప్పుడే నాకూ ఓ అనాథ యువతిని పెళ్ల ఆలోచన చేసుకోవాలన్న ఆలోచన కలిగింది. అప్పుడే దాక్షాయణిని చూశాను. ఆమె నాకు నచ్చటానికి ప్రధాన కారణం ఆమె ఓ గాయకురాలు, సంగీతం వచ్చు. నాకు సంగీతమన్నా... గానమన్నా ఇష్టం. ఇవే ఆమెను ఇష్టపడటానికి అసలు కారణాలయ్యాయి. అవే నన్ను ఆమె మెడలో మూడు ముళ్లు వేసేలా... ఏడు అడుగులు నడిచేలా చేశాయి.
– పేరి ఉమా మహేశ్వరరావు, వరుడు, సాప్ట్ వేర్ ఉద్యోగి, చెన్నై
Advertisement
Advertisement