
అనాధ యువతిని రక్షించిన రైల్వే శాఖ
ఇండియన్ రైల్వే కొన్నాళ్లుగా ప్రయాణీకుల సేవే లక్ష్యంగా పనిచేస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణాలకోసం అన్ని వసతులు కల్పిస్తోంది. వైద్యం నుంచి ఆహారం వరకూ సదుపాయాలను చేకూరుస్తోంది. అంతేకాదు... సామాజిక మాధ్యమాలు, మెయిల్స్ ద్వారా ప్రయాణీకులకు తక్షణ సహాయం అందిస్తోంది. తాజాగా రైల్వే విజిలెన్స్ అధికారులు ... హ్యూమన్ ట్రాఫికర్ల బారిన పడిన ఓ అనాధ యువతిని రక్షించారు. అయితే దేశంలో భారీగా సాగుతున్నమహిళల అక్రమ రవాణాకు ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ ప్రయాణిస్తున్న 19 ఏళ్ళ రాధా లోహర్... అపాయంలో చిక్కుకుంది. అయితే ఆమె పరిస్థితిపై ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇతరులకు మాత్రం అనుమానం కలగలేదు. ఆమె కష్టాల్లో ఉందన్న విషయం ఏమాత్రం గ్రహించలేకపోయారు. ఇక లాభం లేదనుకున్నరాధా... తన వివరాలను ఓ కాగితం పై రాసి తోటి ప్రయాణీకులకు అందించింది. పదోతరగతి చదువుతున్నరాధా లోహర్... తానో అనాధ బాలికనని, తనతో ఉన్న ఇద్దరు పురుషులూ తనను బలవంతంగా ఢిల్లీ తరలిస్తున్నారని పేర్కొంది. తనను ఈ కష్టంనుంచి గట్టెక్కించమని కోరింది. రాధా పరిస్థితిని తెలుసుకున్న తోటి ప్రయాణీకులు వెంటనే ఈ సమాచారాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశారు.
తక్షణమే స్పందించిన ఢిల్లీ అధికారులు సికింద్రాబాద్ లోని అధికారులకు సమాచారం అందించారు. దక్షిణమధ్య రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్... రాధా ప్రయాణిస్తున్న రైలు... రామగుండం స్టేషన్ కు చేరేసరికి ప్రొటెక్షన్ ఫోర్స్ ను బాధితురాలున్న కోచ్ కు పంపించారు. సమాచారాన్ని ధృవీకరించిన అధికారులు ఆమెను దుండగుల బారినుంచి రక్షించి, ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రైల్వే వెబ్ సైట్ లోని ఓ నివేదిక ప్రకారం ప్రశ్చిమ బెంగాల్ లోని అలీపూర్ద్వార్ జంక్షన్ నివాసి అయిన రాధా... ఢిల్లీకి చెందిన కె.టి. ఎంటర్ ప్రైజెస్ లో పని చేస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళితే తిరిగి తమ కంపెనీలో పనికోసం రాదని గ్రహించిన దుండగులు హైదరాబాద్ వస్తున్న రాధాను బలవంతంగా ఢిల్లీ ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రైల్వే అధికారుల చొరవకు తోడు ఓ ట్వీట్ రాధాను రక్షించగల్గింది.