ఆన్‌లైన్ రిటైలింగ్‌లోకి ఎఫ్‌డీఐలను అనుమతించాలి
ఫ్లిఫ్‌కార్ట్ సాకుతో అతి నియంత్రణలు మంచిది కాదు: అసోచామ్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రిటైల్ వ్యాపారాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించాలని పారిశ్రామిక మండలి అసోచామ్ కోరింది. తాజా ఫ్లిప్‌కార్ట్ ఉదంతాన్ని మొత్తం ఈ-కామర్స్ పరిశ్రమ అంతటికీ ఆపాదించకూడదని.. దీన్ని సాకుగా చూపి ప్రభుత్వం అతిగా నియంత్రణలు విధించడం మంచిదికాదని అభిప్రాయపడింది. ఆన్‌లైన్ బిజినెస్ ప్రస్థానం ఇంకా ఆరంభస్థాయిలోనే ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘బిగ్ బిలియన్ డే’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయడం తెలిసిందే. అయితే, వెబ్‌సైట్ మొరాయించడం.. తగినన్ని ఉత్పత్తులను సేల్‌లో ఉంచకపోవడం ఇతరత్రా ఇక్కట్లతో కస్టమర్లు ఆ సంస్థపై దుమ్మెత్తిపోశారు. దీనికితోడు అడ్డగోలు డిస్కౌంట్లతో తమ సాంప్రదాయ వ్యాపారాలను ఈ-కామర్స్ కంపెనీలు దెబ్బతీస్తున్నాయంటూ ట్రేడర్లు ఫిర్యాదులు చేయడంతో.. ఫ్లిప్‌కార్ట్ ఉదంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చింది. కాగా, ప్రస్తుత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం ఈ-కామర్స్ కంపెనీలు నేరుగా రిటైల్ కస్టమర్లకు ఉత్పత్తులను విక్రయించడానికి అనుమతి లేదు. బిజినెస్ టు బిజినెస్(బీటుబీ) ఈ-కామర్స్‌లో మాత్రం 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. రిటైల్ వ్యాపారంలో అనుమతి లేదు.
ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు ఆఫర్ సేల్‌లో తమ వైఫల్యం, కస్టమర్లకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు చెప్పడం, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చిన నేపథ్యంలో దీన్ని ఇంతటితో ఆపేయాలని అసోచామ్ అంటోంది. దేశంలో భారీగా ఉన్న మధ్యతరగతి వినియోగదారుల ఆకాం క్షలు తీర్చడంతోపాటు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించడంలో ఈ-కామర్స్ కీలకంగా నిలుస్తుందని పేర్కొంది. అతి నియంత్రణల కారణంగా పరిశ్రమ శైశవ దశలోనే అంతమైపోయే ప్రమాదం ఉందని చాంబర్ అభిప్రాయపడింది.
ఈ రంగంలోకి అడుగుపెట్టే ఔత్సాహిక యువ ప్రమోటర్లను దెబ్బతీస్తుందని పేర్కొంది. కాగా, ఆ దేశంలో అసంఘటిత రంగంలో రిటైల్ వ్యాపార మార్కెట్ 550-600 బిలియన్ డాలర్లు ఉండగా.. సంస్థాగత రిటైలర్లు 25-30 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను అందిపుచ్చుకున్నట్లు అసోచామ్ పేర్కొంది. ఇక ఈ-కామర్స్ మార్కెట్ విలువ ప్రస్తుతం 3-4 బిలియన్ డాలర్లు మాత్రమేనని తెలిపింది. వచ్చే మూడేళ్లలో ఇది 15-18 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా వేసింది.