ముంబై: దేశీయ ఈ-రిటైల్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారీగా వాటాను చేజిక్కించుకోబోతుంది. దీనికి సంబంధించి చర్చలు తుది దశకు వచ్చినట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో సగానికి పైగా వాటాలను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్ ఎన్నోరోజులుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే, దేశీయ ఈ-రిటైల్ రంగంలో వాల్‌మార్ట్, అమెజాన్‌తో ప్రత్యక్షంగా పోటీకి దిగనుంది.
తొలుత 20-26 శాతం వాటాను మాత్రమే కొనుగోలు చేయాలని భావించిన వాల్‌మార్ట్.. తదుపరి జరిగిన పరిణామాలతో ఫ్లిప్‌కార్ట్‌లో చక్రం తిప్పేందుకు అవసరమైన 51 శాతం వాటాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కు చెందిన పెట్టుబడి సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌కు అత్యధిక వాటా ఉంది. అయితే సాఫ్ట్‌బ్యాంకు నుంచి ఈ వాటాలను వాల్‌మార్ట్ కొనుగోలు చేసి, ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా నిలవనుంది.
మిగతా వాటాలను ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయనుంది.వాల్‌మార్ట్ కొనుగోలు చేయబోతున్న వాటాల విలువ రూ.77 వేల కోట్లుగా ఉంటుందని అంచనా. దీనికి సంబంధించి సాఫ్ట్‌బ్యాంకు, టైగర్ గ్లోబల్‌లతో వాల్‌మార్ట్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు కలిపి ఫ్లిప్‌కార్ట్‌లో 20 శాతం వాటాలున్నాయి. అయితే ఏ కంపెనీ అధికారులు కూడా ఈ చర్చలను అధికారికంగా ధృవీకరించలేదు.
ఎంతో కాలంగా దేశీయ మార్కెట్‌లో వాల్‌మార్ట్ తన సత్తా చాటాలని చూస్తోంది. కానీ ఇన్ని రోజులు రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతిపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతో అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ 14.2 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ పెట్టుబడులతో ఫ్లిప్‌కార్ట్ విలువ రెండింతలు కానుంది. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ప్రస్తుతం వాల్‌మార్ట్ పెట్టనున్న పెట్టుబడులతో, అమెజాన్‌కు ఫ్లిప్‌కార్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది. వాల్‌మార్ట్ భారత్‌లో ప్రస్తుతం 21 స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment