రూ.7.5 లక్షల కోట్లకు రిటైల్‌ ఈ కామర్స్‌ | E-commerce retail market expected to cross 100-billion mark by 2024 | Sakshi
Sakshi News home page

రూ.7.5 లక్షల కోట్లకు రిటైల్‌ ఈ కామర్స్‌

Published Fri, Aug 28 2020 5:04 AM | Last Updated on Fri, Aug 28 2020 5:04 AM

E-commerce retail market expected to cross 100-billion mark by 2024 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఈకామర్స్‌ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 2024 నాటికి రిటైల్‌ ఈ కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం 100 బిలియన్‌ డాలర్లకు (రూ.7.5లక్షల కోట్లు) చేరుకుంటుందని ఓ నివేదిక తెలియజేసింది.  అంతర్జాతీయ సంస్థ అల్వారెజ్‌ అండ్‌ మార్సల్‌ (ఏఅండ్‌ఎం), సీఐఐ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.

వినియోగదారుల్లో మారుతున్న కొనుగోళ్ల ధోరణి, ఆన్‌లైన్‌లో విక్రేతలు పెరుగుతుండడం తదితర అంశాలు రిటైల్‌ ఈ కామర్స్‌ మార్కెట్‌ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని ఈ నివేదిక తెలియజేసింది. తాజా గ్రోసరీల విక్రయాలకు డిమాండ్, ఫుడ్‌ డెలివరీ కంపెనీల సంఖ్య పెరగడం కూడా వచ్చే ఐదేళ్లలో మార్కెట్‌ విస్తరణకు మేలు చేస్తుందని పేర్కొంది. సరఫరా వ్యవస్థకు సంబంధించి నూతన ఆవిష్కరణలు అన్నవి భారత్‌ లో ఈ కామర్స్‌ మార్కెట్‌ తదుపరి విస్తరణకు కీలకమని సూచించింది.  

పదేళ్లలో భారీగా విస్తరణ..
గత పదే?ళ్ల కాలంలో భారత రిటైల్‌ రంగం శరవేగంగా ప్రగతి సాధించినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘2019 చివరికి రిటైల్‌ రంగం పరిమాణం 915 బిలియన్‌ డాలర్లకు విస్తరించింది. ఇందుల్‌ రిటైల్‌ ఈ కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం 2019 ఆఖరుకు 30 బిలియన్‌ డాలర్లుగా ఉంది. కానీ 2010లో రిటైల్‌ రంగంలో ఈ కామర్స్‌ మార్కెట్‌ విలువ 1 బిలియన్‌ డాలర్ల కంటే (రూ.7,500 కోట్లు) తక్కువగా ఉండగా, పదేళ్లలో 30 బిలియన్‌ డాలర్ల స్థాయికి విస్తరించింది’’ అని ఈ నివేదిక తెలియజేసింది.

గత దశాబ్ద కాలంలో ఈ కామర్స్‌ వృద్ధికి ఇంటర్నెట్‌ విస్తరణ, స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల సంఖ్య పెరగడం తోడ్పడినట్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫర్నిచర్, ఫార్మసీ, కాస్మెటిక్స్‌ మార్కెట్‌ విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిపింది. ‘‘ఈ కామర్స్‌ రిటైల్‌ మార్కెట్‌ (బిజినెస్‌ టు కస్టమర్‌/బీటుసీ) 2024 నాటికి 100 బిలియన్‌ డాలర్లకు పైగా విస్తరించనుంది. 2019నాటికి దేశంలో ఈ కామర్స్‌ విస్తరణ 3 శాతమే. విస్తరణకు భారీ అవకాశాలున్నాయి’’ అని ఈ నివేదిక అంచనా వేసింది. అమెరికా, చైనా మార్కెట్లలో ఈ కామర్స్‌ రిటైల్‌ వ్యాప్తి 2019 నాటికి వరుసగా 15 శాతం, 20 శాతంగా ఉండగా.. భారత్‌ లో 2024 నాటికి 6 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది.

‘‘ఈ కామర్స్‌ విక్రయాల్లో పెద్ద మొత్తం దేశంలోని అగ్రగామి 30 పట్టణాల నుంచే వస్తున్నా.. వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పైగా అమ్మకాలు టైర్‌–2, 3 పట్టణాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కనుక చిన్న పట్టణాలకు కూడా సరుకులను డెలివరీ చేసే విధంగా ఈ కామర్స్‌ కంపెనీలు విక్రేతల పరిధిని పెంచుకోవాల్సి ఉంటుంది’’ అని ఏఅండ్‌ఎం ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ సైగల్‌ పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కొనుగోళ్ల ధోరణి, తగిన టెక్నాలజీలు, రవాణా భాగస్వాములపై ఈ కామర్స్‌ విస్తరణ ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఎఫ్‌ఎంసీజీ, గ్రోసరీలు, వస్త్రాల  విక్రయాలు మరింత పెంచుకునేందుకు సోషల్‌ మీడియా, చాట్‌ ఇంజన్స్, ఏఐ బాట్స్‌ అన్నవి కీలకమవుతాయని పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement