Retail E-Commerce
-
రూ.7.5 లక్షల కోట్లకు రిటైల్ ఈ కామర్స్
న్యూఢిల్లీ: దేశంలో ఈకామర్స్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 2024 నాటికి రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్లకు (రూ.7.5లక్షల కోట్లు) చేరుకుంటుందని ఓ నివేదిక తెలియజేసింది. అంతర్జాతీయ సంస్థ అల్వారెజ్ అండ్ మార్సల్ (ఏఅండ్ఎం), సీఐఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. వినియోగదారుల్లో మారుతున్న కొనుగోళ్ల ధోరణి, ఆన్లైన్లో విక్రేతలు పెరుగుతుండడం తదితర అంశాలు రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా తోడ్పడతాయని ఈ నివేదిక తెలియజేసింది. తాజా గ్రోసరీల విక్రయాలకు డిమాండ్, ఫుడ్ డెలివరీ కంపెనీల సంఖ్య పెరగడం కూడా వచ్చే ఐదేళ్లలో మార్కెట్ విస్తరణకు మేలు చేస్తుందని పేర్కొంది. సరఫరా వ్యవస్థకు సంబంధించి నూతన ఆవిష్కరణలు అన్నవి భారత్ లో ఈ కామర్స్ మార్కెట్ తదుపరి విస్తరణకు కీలకమని సూచించింది. పదేళ్లలో భారీగా విస్తరణ.. గత పదే?ళ్ల కాలంలో భారత రిటైల్ రంగం శరవేగంగా ప్రగతి సాధించినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘2019 చివరికి రిటైల్ రంగం పరిమాణం 915 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇందుల్ రిటైల్ ఈ కామర్స్ మార్కెట్ పరిమాణం 2019 ఆఖరుకు 30 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ 2010లో రిటైల్ రంగంలో ఈ కామర్స్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల కంటే (రూ.7,500 కోట్లు) తక్కువగా ఉండగా, పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల స్థాయికి విస్తరించింది’’ అని ఈ నివేదిక తెలియజేసింది. గత దశాబ్ద కాలంలో ఈ కామర్స్ వృద్ధికి ఇంటర్నెట్ విస్తరణ, స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య పెరగడం తోడ్పడినట్టు పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, గ్రోసరీ, ఫర్నిచర్, ఫార్మసీ, కాస్మెటిక్స్ మార్కెట్ విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించినట్టు తెలిపింది. ‘‘ఈ కామర్స్ రిటైల్ మార్కెట్ (బిజినెస్ టు కస్టమర్/బీటుసీ) 2024 నాటికి 100 బిలియన్ డాలర్లకు పైగా విస్తరించనుంది. 2019నాటికి దేశంలో ఈ కామర్స్ విస్తరణ 3 శాతమే. విస్తరణకు భారీ అవకాశాలున్నాయి’’ అని ఈ నివేదిక అంచనా వేసింది. అమెరికా, చైనా మార్కెట్లలో ఈ కామర్స్ రిటైల్ వ్యాప్తి 2019 నాటికి వరుసగా 15 శాతం, 20 శాతంగా ఉండగా.. భారత్ లో 2024 నాటికి 6 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ‘‘ఈ కామర్స్ విక్రయాల్లో పెద్ద మొత్తం దేశంలోని అగ్రగామి 30 పట్టణాల నుంచే వస్తున్నా.. వచ్చే ఐదేళ్లలో 60 శాతానికి పైగా అమ్మకాలు టైర్–2, 3 పట్టణాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కనుక చిన్న పట్టణాలకు కూడా సరుకులను డెలివరీ చేసే విధంగా ఈ కామర్స్ కంపెనీలు విక్రేతల పరిధిని పెంచుకోవాల్సి ఉంటుంది’’ అని ఏఅండ్ఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ సైగల్ పేర్కొన్నారు. కస్టమర్ల అవసరాలు, మారుతున్న కొనుగోళ్ల ధోరణి, తగిన టెక్నాలజీలు, రవాణా భాగస్వాములపై ఈ కామర్స్ విస్తరణ ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక తెలియజేసింది. ఎఫ్ఎంసీజీ, గ్రోసరీలు, వస్త్రాల విక్రయాలు మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియా, చాట్ ఇంజన్స్, ఏఐ బాట్స్ అన్నవి కీలకమవుతాయని పేర్కొంది. -
ఈ-కామర్స్‌లో రేటింగ్స్ హల్చల్
కస్టమర్ల రివ్యూలే అత్యంత కీలకం రేటింగ్ తగ్గితే విక్రేతలకు చెక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రిటైల్ ఈ-కామర్స్.. భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న నూతనతరం వ్యాపారం. ఈ వ్యాపారంలో కొనేవారెవరో అమ్మేవారికి తెలియదు. అమ్మేవారెవరో కొనేవారికీ తెలీదు. వీరిద్దరినీ కలిపేవే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈ-బే, మింత్రా వగైరా...వగైరా. ఇదంతా సరే. మరి విక్రయదారులు నాణ్యమైన ఉత్పత్తులనే అమ్ముతున్నారా? నాసిరకం అంటగడితే కస్టమర్ నష్టపోవాల్సిందేనా? అలాంటిదేమీ లేదని ఆన్లైన్ కంపెనీలు అంటున్నాయి. రూ.19,000 కోట్ల విలువైన రిటైల్ ఈ-కామర్స్ రంగంలో వినియోగదార్ల వద్ద ఇప్పుడు ‘రేటింగ్’ అనే అస్త్రం ఉంది. కస్టమర్ల ఆగ్రహానికి లోనైతే వ్యాపారుల మనుగడ కష్టమే. ఉత్తమ రేటింగ్ దక్కించుకోని సెల్లర్లను కంపెనీలు కూడా తమ వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాయి. ఇదంతా కస్టమర్ల హక్కులను కాపాడేందుకేనని ఆన్లైన్ కంపెనీలు చెబుతున్నాయి. ఏమిటీ రివ్యూలు... కొనుగోలు అనంతరం వినియోగదారులు ఉత్పత్తి, విక్రేత గురించి సమీక్ష (రివ్యూ) జరపడం ఇప్పుడు పరిపాటి అయింది. కంపెనీలు సైతం రివ్యూలను ప్రోత్సహిస్తున్నాయి. ఉత్పాదన నాణ్యత, దాని పనితీరుతోపాటు విక్రేత గురించి తయారీ సంస్థ, ఈ-కామర్స్ కంపెనీ, సామాజిక వెబ్సైట్లలోనూ కస్టమర్లు కామెంట్లను రాస్తున్నారు. ద పవర్ ఆఫ్ రివ్యూస్ నివేదిక ప్రకారం ఏదైనా ఉత్పత్తిని కొనేందుకు నెట్లో వెతికే ముందు 94 శాతం మంది వినియోగదార్లు రివ్యూలను చూస్తున్నారు. కొనుగోలు నిర్ణయానికి ఈ రివ్యూలు కీలకమని 86 శాతం మంది భావిస్తున్నారు. వ్యతిరేకంగా వచ్చిన రివ్యూలను ప్రత్యేకంగా 82 శాతం మంది చదువుతున్నారట. మొత్తంగా వినియోగదార్లలో 42 శాతం మంది సమీక్షలను రాస్తున్నారు. అంటే విక్రేతల భవిష్యత్ అంతా ఈ కామెంట్లపైనే ఆధారపడి ఉందన్నమాట. పారదర్శకత కోసం.. ఉత్పాదనకు బదులుగా రాయి వచ్చిందని, నాసిరకమైన ప్రొడక్టును డెలివరీ చేశారంటూ విక్రేతలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కస్టమర్ ఫిర్యాదు చేస్తే కొత్త ఉత్పత్తిని పంపే బాధ్యత సెల్లర్లదే. అయితే ఒరిజినల్ ప్రొడక్ట్ పంపినా ఫిర్యాదు చేసే కస్టమర్లూ ఉన్నారు. ఇటువంటి కస్టమర్లను ట్రాక్ చేసి కట్టడి చేసే వ్యవస్థా కంపెనీల వద్ద ఉంది. సెల్లర్ చేసే తప్పిదమైనా బ్రాండ్‌పై కస్టమర్లలో వ్యతిరేక భావన వస్తుంది. ఈ నేపథ్యంలో పారదర్శకత విషయంలో విక్రేతలకు ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలను ఈ-కామర్స్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఇక సెల్లర్లు తమ గిడ్డంగుల్లో అన్ని కార్యకలాపాలను కెమెరాలతో రికార్డు చే స్తున్నారు. కస్టమర్ నుంచి తప్పుడు ఫిర్యాదు అందితే వీడియో రికార్డులను కంపెనీలకు సమర్పిస్తున్నాయి. అధిక రేటింగ్ ఉంటేనే.. ఈ-కామర్స్ పోర్టళ్లలో విక్రేతల ఫీడ్‌బ్యాక్ హిస్టరీ చూస్తే చాలు. వారి పనితీరు ఇట్టే తెలుస్తుంది. మంచి ఫీడ్ బ్యాక్ ఉన్న సెల్లర్నే వినియోగదార్లు ఎంచుకుంటారని అమెజ్ ట్రేడర్స్ ప్రమోటర్ రెహమాన్ చెప్పారు. ఇక సైట్లో చూపిన ఉత్పాదననే కస్టమర్‌కు పంపిస్తున్నారా? కస్టమర్‌తో ఎలా సమాచారాన్ని పంచుకుంటున్నారు? షిప్పింగ్ చార్జీలు ఎంత వసూలు చేస్తున్నారు? ఎంత సమయంలో ఉత్పత్తిని డెలివరీ చేశారు? వంటి అంశాలను ఈ-కామర్స్ కంపెనీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. స్కోర్ తగ్గిందంటే విక్రేతను కట్టడి చేసి ఉత్పత్తుల సంఖ్యను కుదిస్తున్నామని ఈ-బే రిటైల్ ఎక్స్పోర్ట్, లైఫ్‌స్టైల్ క్యాటెగోరీస్ బిజినెస్ హెడ్ నవీన్ మిస్త్రీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఫిర్యాదులు పెరిగితే విక్రేతను తొలగిస్తున్నామన్నారు.