కస్టమర్ల రివ్యూలే అత్యంత కీలకం రేటింగ్ తగ్గితే విక్రేతలకు చెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రిటైల్ ఈ-కామర్స్.. భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్న నూతనతరం వ్యాపారం. ఈ వ్యాపారంలో కొనేవారెవరో అమ్మేవారికి తెలియదు. అమ్మేవారెవరో కొనేవారికీ తెలీదు. వీరిద్దరినీ కలిపేవే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, ఈ-బే, మింత్రా వగైరా...వగైరా. ఇదంతా సరే. మరి విక్రయదారులు నాణ్యమైన ఉత్పత్తులనే అమ్ముతున్నారా? నాసిరకం అంటగడితే కస్టమర్ నష్టపోవాల్సిందేనా? అలాంటిదేమీ లేదని ఆన్‌లైన్ కంపెనీలు అంటున్నాయి.
రూ.19,000 కోట్ల విలువైన రిటైల్ ఈ-కామర్స్ రంగంలో వినియోగదార్ల వద్ద ఇప్పుడు ‘రేటింగ్’ అనే అస్త్రం ఉంది. కస్టమర్ల ఆగ్రహానికి లోనైతే వ్యాపారుల మనుగడ కష్టమే. ఉత్తమ రేటింగ్ దక్కించుకోని సెల్లర్లను కంపెనీలు కూడా తమ వెబ్‌సైట్ నుంచి తొలగిస్తున్నాయి. ఇదంతా కస్టమర్ల హక్కులను కాపాడేందుకేనని ఆన్‌లైన్ కంపెనీలు చెబుతున్నాయి.
ఏమిటీ రివ్యూలు...
కొనుగోలు అనంతరం వినియోగదారులు ఉత్పత్తి, విక్రేత గురించి సమీక్ష (రివ్యూ) జరపడం ఇప్పుడు పరిపాటి అయింది. కంపెనీలు సైతం రివ్యూలను ప్రోత్సహిస్తున్నాయి. ఉత్పాదన నాణ్యత, దాని పనితీరుతోపాటు విక్రేత గురించి తయారీ సంస్థ, ఈ-కామర్స్ కంపెనీ, సామాజిక వెబ్‌సైట్లలోనూ కస్టమర్లు కామెంట్లను రాస్తున్నారు. ద పవర్ ఆఫ్ రివ్యూస్ నివేదిక ప్రకారం ఏదైనా ఉత్పత్తిని కొనేందుకు నెట్‌లో వెతికే ముందు 94 శాతం మంది వినియోగదార్లు రివ్యూలను చూస్తున్నారు. కొనుగోలు నిర్ణయానికి ఈ రివ్యూలు కీలకమని 86 శాతం మంది భావిస్తున్నారు. వ్యతిరేకంగా వచ్చిన రివ్యూలను ప్రత్యేకంగా 82 శాతం మంది చదువుతున్నారట. మొత్తంగా వినియోగదార్లలో 42 శాతం మంది సమీక్షలను రాస్తున్నారు. అంటే విక్రేతల భవిష్యత్ అంతా ఈ కామెంట్లపైనే ఆధారపడి ఉందన్నమాట.
పారదర్శకత కోసం..
ఉత్పాదనకు బదులుగా రాయి వచ్చిందని, నాసిరకమైన ప్రొడక్టును డెలివరీ చేశారంటూ విక్రేతలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కస్టమర్ ఫిర్యాదు చేస్తే కొత్త ఉత్పత్తిని పంపే బాధ్యత సెల్లర్లదే. అయితే ఒరిజినల్ ప్రొడక్ట్ పంపినా ఫిర్యాదు చేసే కస్టమర్లూ ఉన్నారు. ఇటువంటి కస్టమర్లను ట్రాక్ చేసి కట్టడి చేసే వ్యవస్థా కంపెనీల వద్ద ఉంది. సెల్లర్ చేసే తప్పిదమైనా బ్రాండ్‌పై కస్టమర్లలో వ్యతిరేక భావన వస్తుంది. ఈ నేపథ్యంలో పారదర్శకత విషయంలో విక్రేతలకు ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలను ఈ-కామర్స్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఇక సెల్లర్లు తమ గిడ్డంగుల్లో అన్ని కార్యకలాపాలను కెమెరాలతో రికార్డు చే స్తున్నారు. కస్టమర్ నుంచి తప్పుడు ఫిర్యాదు అందితే వీడియో రికార్డులను కంపెనీలకు సమర్పిస్తున్నాయి.
అధిక రేటింగ్ ఉంటేనే..
ఈ-కామర్స్ పోర్టళ్లలో విక్రేతల ఫీడ్‌బ్యాక్ హిస్టరీ చూస్తే చాలు. వారి పనితీరు ఇట్టే తెలుస్తుంది. మంచి ఫీడ్ బ్యాక్ ఉన్న సెల్లర్‌నే వినియోగదార్లు ఎంచుకుంటారని అమెజ్ ట్రేడర్స్ ప్రమోటర్ రెహమాన్ చెప్పారు. ఇక సైట్లో చూపిన ఉత్పాదననే కస్టమర్‌కు పంపిస్తున్నారా? కస్టమర్‌తో ఎలా సమాచారాన్ని పంచుకుంటున్నారు? షిప్పింగ్ చార్జీలు ఎంత వసూలు చేస్తున్నారు? ఎంత సమయంలో ఉత్పత్తిని డెలివరీ చేశారు? వంటి అంశాలను ఈ-కామర్స్ కంపెనీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. స్కోర్ తగ్గిందంటే విక్రేతను కట్టడి చేసి ఉత్పత్తుల సంఖ్యను కుదిస్తున్నామని ఈ-బే రిటైల్ ఎక్స్‌పోర్ట్, లైఫ్‌స్టైల్ క్యాటెగోరీస్ బిజినెస్ హెడ్ నవీన్ మిస్త్రీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఫిర్యాదులు పెరిగితే విక్రేతను తొలగిస్తున్నామన్నారు.
ఈ-కామర్స్‌లో రేటింగ్స్ హల్‌చల్
Published Fri, Jun 5 2015 2:21 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
Advertisement
Advertisement