
వ్యాపారం తుస్‌స్‌స్.........
- కానరాని దీపావళి కొనుగోళ్లు
- పెరిగిన బాణసంచా ధరలు
- తగ్గిన విక్రయాలు
- వెలవెలబోతున్న దుకాణాలు
- వ్యాపారుల గుండెల్లో పేలుతున్న టపాసులు
కాకరొత్తుల వెలుగులు.. భూచక్రాల సందడి.. రాకెట్లు, తారా జువ్వల హరివిల్లులు... 5000వాలా శబ్దాలు.. ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతుల సందడి గ్రేటర్‌లో కనిపించడం లేదు.. దీపావళి పండుగొచ్చేసినా దీపకాంతులు కనిపించడం లేదు.. టపాసులు పేలడంలేదు.. కొనుగోలుదారుల్లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి.. బాణసంచా తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గిపోవడం.. భారీగా ధరలు పెరగడం.. ఆన్‌లైన్ వ్యాపారం వంటివి అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గతేడాది నగరంలో రూ.50 కోట్ల వ్యాపారం జరుగగా ఈ దఫా అందులో 50 శాతం కూడా విక్రయాలు జరిగే పరిస్థితి కనిపించడంలేదు.
సాక్షి, సిటీబ్యూరో: దీపావళికి పది రోజుల ముందునుంచే నగరంలో బాణసంచా కొనుగోళ్ల సందడి కనిపించేది. దిగుమతులు, ఎగుమతులు, క్రయవిక్రయాలతో మార్కెట్లన్నీ కళకళలాడేవి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. సనత్‌నగర్, సికింద్రాబాద్‌లోని దోబీఘాట్, జింకానాగ్రౌండ్స్, మలక్‌పేట్, ఉస్మాన్‌గంజ్ ప్రాంతాల్లో బాణసంచా హోల్‌సేల్ వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటుచేశారు. నగరంలోని సుమారు 55మంది హోల్‌సేల్ ట్రేడర్స్ శివకాశి నుంచి నేరుగా సరుకు దిగుమతి చేసుకొని రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు.
వీరివద్ద సరుకు కొనుగోలు చేసిన రిటైలర్లు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 1200 దుకాణాలు నెలకొల్పారు. నిజానికి పండుగకు కనీసం 15రోజుల ముందు నుంచే చిల్లర వ్యాపారుల కొనుగోళ్లతో మార్కెట్ అంతా హడావుడిగా కనిపించేది. పండుగ వచ్చేసినా బాణసంచా కొనుగోళ్లు నామ మాత్రంగా ఉండటం వ్యాపారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పిల్లలను సంతోషపెట్టడానికి చిచ్చుబుడ్లు, కాకరొత్తులు, మతాబులు వంటివాటిని కొనేందుకు వచ్చిన వారు సైతం ఎమ్మార్పీ రేటు చూడగానే కళ్లుబైర్లు కమ్ముతుండటంతో వెనుదిరిగి పోతున్నారు.
కొందరు వ్యాపారులు గత ఏడాది మిగిలిపోయిన సరుకును బయటకు తీయగా, మరికొందరు తాజాగా సరుకు తె ప్పించి విక్రయానికి పెట్టారు. రిటైల్ కొనుగోళ్లు మాత్రం తుస్సుమంటుండటం హోల్‌సేల్ ట్రేడర్స్ గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రియల్ బూమ్ తగ్గిపోయింది. ఆర్థిక లావాదే వీలు తగ్గిపోవడం కూడా ఒక కారణమంటున్నారు. వారం రోజులుగా బాణసంచా తయారీ కేంద్రాల్లో జరుగుతున్న ప్రమాదాలు, హుదూద్ విపత్తు కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
భారీగా పెరిగిన ధరలు :
గత ఏడాదితో పోలిస్తే బాణసంచా ధరలు 50 శాతం మేర పెరిగాయి. తమిళనాడులోని శివకాశిలో ఇటీవల 2 నెలలుగా వర్షాలు కురియడంతో 30శాతం మేర ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం. ఈ సారి శివకాశిలోనే 30శాతం మేర ధరలు పెరగ్గా... అదే సరుకు ఇక్కడికొచ్చాక మరో 20శాతం లాభం వేసుకొని వ్యాపారులు మొత్తంగా 50శాతం మేర ధరలు పెంచేశారు.
కొత్త రకాలు
ఈసారి కొత్తరకాలను మార్కెట్లో పరిచయం చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి ప్రత్యేక ఉత్పత్తులుగా 20 రకాల రాకెట్లు, చిచ్చుబుడ్లు, ఇతర పేలుడు పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రధానంగా బోజంబా, పికాక్ డ్యాన్స్, బుల్లెట్ ట్రైన్, గ్రేప్ గార్డెన్, సిల్వర్‌జట్ ప్యాకెట్, కలర్ చేంజ్ బటర్‌ఫ్లై, ప్లవర్ గార్డెన్, జాక్‌పాట్, చెన్నై బ్యూటీ, కేరళ బ్యూటీ, ముంబయ్ బ్యూటీ, బుల్లెట్ రెయిన్, సింగింగ్ బర్డ్స్, హో... లా ల్లా, గ్రీన్‌పార్క్, పనోరమా, స్నాజీ జిమ్నా, నయగరా ఫాల్స్, కిక్ షాట్స్, హాట్ గర్ల్, హాట్ మిర్చి, సిటీ నైట్, రంగధార, 2000 బగ్స్, 100 షాట్స్ ఇలా వివిధ పేర్లతో రకరకాల పేలుడు పదార్థాలు అందుబాటులో ఉన్నాయి.