![నచ్చిన డిజైన్.. నప్పే సైజు!](/styles/webp/s3/article_images/2017/09/3/71435346574_625x300.jpg.webp?itok=bIrk0DYy)
నచ్చిన డిజైన్.. నప్పే సైజు!
సాక్షి, ప్రొద్దుటూరు : షాపుకెళితే కావాల్సిన సైజు దొరుకుతుంది. ఆన్‌లైన్లో కొన్ని సైజులుంటాయి కానీ అవి నప్పుతాయో... నప్పవో అనే బెంగ ఉంటూనే ఉంటుంది. ఒకవేళ ఆన్‌లైన్లో చూసినా... అక్కడున్న డిజైన్లలో, సైజుల్లో మనకు కావాల్సినవి ఎంచుకోవాలి. మరి బొతిక్ మాదిరిగా ఆన్‌లైన్లో కూడా కావాల్సిన వస్తువుల్ని కావాల్సిన సైజుల్లో అందించే వీలుంటే...! ఇదే ఆలోచన చేశాడు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లెకు చెందిన దాసరి రామాంజనేయ రెడ్డి. ఈ ఆలోచన విజయం సాధించటంతో ఇపుడు దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డాడు. ‘www.seeyou.co.in’ విజయగాథ ఇదీ...
రామాంజనేయ రెడ్డి డిగ్రీ పూర్తి చేశాక మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. అందులో నష్టాలు రావడంతో కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జేమ్స్ పేటలో ఒక అపార్ట్‌మెంట్‌లో దుస్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. అపార్ట్‌మెంట్‌లోని నాలుగు ఫ్లాట్లు తీసుకుని అందులోనే పరిశ్రమను ప్రారంభించాడు. సాధారణంగా ఆన్‌లైన్‌లో ఎవరైనా స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ సైజుల్లో ఉన్న దుస్తులను ఎంపిక చేసుకుంటుంటారు. అయితే seeyou.co.in లో ప్రత్యేకత ఏమిటంటే వినియోగదారుడు తనకు కావలసిన షర్ట్‌లు, ఫ్యాంట్లు, టీ షర్ట్‌లు ఏ సైజులో కావాలో, ఏ విధంగా కావాలో ఆన్‌లైన్ ద్వారా తెలియజేయవచ్చు.
డబ్బులు చెల్లించాక వారం లోపు వినియోగదారుడు కోరిన సైజులో దుస్తులను తయారు చేసి కొరియర్ ద్వారా డెలివరీ చేస్తారు. షర్టులు, ఫ్యాంటులు ఇదే అపార్ట్‌మెంట్‌లో తయారు చేస్తుండగా టీ షర్ట్‌లు మాత్రం తిర్‌పూర్‌లో తయారవుతున్నాయి. రూ.499 నుంచి రూ.1399 వరకు షర్టులు.. కాటన్, జీన్స్ ఫ్యాంట్లు రూ.650-1500 వరకు విక్రయిస్తున్నారు. రూ.50 లక్షల పెట్టుబడితో మూడు నెలల క్రితం వ్యాపారం ప్రారంభించాడు. ‘మై స్టోన్’ బ్రాండ్‌తో ప్రస్తుతం తన ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. డెలివరీ కోసం ఫస్ట్ ఫ్లైట్ కొరియర్‌తో, సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని విస్తరించడానికి స్టెప్ 2 ఇన్ఫోటెక్‌తో ఒప్పందాలు చేసుకున్నాడు. వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో ప్రచారం సాగిస్తూ వినూత్నంగా ముందుకెళుతున్నాడు.
స్థానికులే మోడల్స్...
వ్యాపారమే కాదు. ప్రచారం కూడా వినూత్నంగానే చేస్తున్నాడు రామాంజనేయరెడ్డి. తాను తయారు చేసే షర్టులు, ఫ్యాంట్లు, టీ షర్టుల ప్రమోషన్ కోసం మోడల్స్‌గా స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాడు. వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగా ప్రధానంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లపై, ఇంజినీరింగ్ కాలేజీలపై దృష్టి సారించి... సాఫ్ట్‌వేర్ కంపెనీలను, ఇంజినీరింగ్ కాలేజీలను టార్గెట్ చేస్తూ దీని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మార్కెటింగ్ సిబ్బందిని నియమించాడు.
సాధారణంగా ఆన్‌లైన్ వ్యాపారంలో ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తే మరో కంపెనీ వాటిని విక్రయిస్తుంది. అయితే రామాంజనేయరెడ్డి మాత్రం తానే తిర్‌పూర్, అహ్మదాబాద్, ముంబై లాంటి ప్రాంతాల నుంచి వస్త్రాలను తెప్పించి కుట్టిస్తున్నాడు. దీంతో తాను నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే ఇవ్వగలుగుతున్నట్టు చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 30 మంది వరకూ ఉపాధి పొందుతున్నారు.