ఆన్‌లైన్‌ అదుర్స్‌! | Assocham survey on Online Business | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ అదుర్స్‌!

Published Mon, Oct 30 2017 2:22 AM | Last Updated on Mon, Oct 30 2017 2:22 AM

Assocham survey on Online Business

తొలి 6 స్థానాలు పొందిన నగరాలివే..
1   ఢిల్లీ
2   ముంబై
3   బెంగళూరు
4   చెన్నై
5   కోల్‌కతా
6    హైదరాబాద్‌


సాక్షి, హైదరాబాద్‌ :
ఆన్‌లైన్‌ వ్యాపారం అదుర్స్‌ అనిపించింది. దసరా.. దీపావళి పండుగలతో ఆన్‌లైన్‌ డీల్స్‌ హోరెత్తించడంతో వెబ్‌సైట్లు పండుగ చేసుకున్నాయి. నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడంలో మెట్రో నగరాల ప్రజలు ముందున్నారు. ఈ విషయంలో గ్రేటర్‌ సిటిజన్లు ఆరో స్థానంలో నిలిచారు. స్మార్ట్‌ జనరేషన్‌గా మారుతోన్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలవడం విశేషం.

ప్రధానంగా 18–35 వయస్సు గ్రూపులో ఉన్న యువతలో సుమారు 90 శాతం ఆన్‌లైన్‌ కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నట్లు అసోచామ్‌ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక స్మార్ట్‌ఫోన్‌ వినియోగంతో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని పేర్కొంది. ఇంటర్నెట్‌ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి సర్వే వివరాలను వెల్లడించారు.

దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా 15 మెట్రో నగరాల్లో ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ డీల్స్‌ సుమారు రూ.30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేశారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరగడానికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం ఓ కారణమని అసోచామ్‌ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగం ఈ కామర్స్‌ ఇండస్ట్రీకి వూతమిచ్చిందని ఈ సర్వే తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, గుర్‌గావ్, నోయిడా, ఛండీగడ్, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్, హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ మెట్రో నగరాల్లో ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయని సర్వే గుర్తించింది.


ఏం కొంటున్నారంటే...
మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్‌ షూస్, ఆభరణాలు, పెర్‌ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల కొనుగోలుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. వీటిల్లోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.

పురుషులే అధికం..
అసోచామ్‌ సర్వే ప్రకారం.. ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యమని తేలింది. వీరి వాటా 65 శాతం ఉండగా.. స్త్రీలు 35 శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పండగ సీజన్‌లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్‌లైన్‌ కొనుగోళ్లు జరిపినట్లు తేలింది.

నిత్యం ఆన్‌లైన్‌లో జరిగే కొనుగోళ్లలో యువతే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. 18–35 ఏళ్ల వయసు గలవారు అత్యధికంగా 90 శాతం మంది కొనుగోళ్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక 36–45 ఏళ్ల మధ్య వయసున్న వారు 8 శాతం, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రెండు శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement