ASSOCHAM survey
-
ఆ రాష్ట్రాల్లో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమం వల్ల పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో ప్రతి రోజు 3,000-3,500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని తెలిసింది. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థపై రైతుల ఆందోళన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని వాణిజ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అన్నదాతల ఆందోళనల వల్ల సరఫరా దెబ్బతినడంతో ఇప్పటికే రోజుకు దాదాపు 3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది. ఇకనైనా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రైతులను అభ్యర్థించింది. ఈ మేరకు అసోచామ్ ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: కేరళలో ఏం జరుగుతుందో ఆలోచించారా?) ‘‘తాజాగా జరుగుతున్న ఆందోళనలు పంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు 18లక్షల కోట్లు రూపాయలుగా ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్‌ప్రాసెసింగ్, జౌళి, ఆటోమొబైల్‌పైనే ఈ రాష్ట్రాల ఆదాయం ఆధారపడి ఉంది. అయితే రైతుల ఆందోళన, రహదారుల నిర్బంధంతో ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటో విభాగాలు, సైకిళ్లు, క్రీడా ఉత్పత్తులు, టెక్స్టైల్ ముడిసరుకుల పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాయి. ఫలితంగా రోజుకు 3000-3,500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది’’ అని అసోచామ్ తన ప్రకటనలో పేర్కొంది. -
18 ఏళ్లలోపే మద్యం రుచి చూస్తున్నారు
గుంటూరు(ఎస్వీఎన్ కాలనీ) : తాగితే తప్పేముంది అనుకుంటున్నారేమో పట్టణ వాతావరణంలోని 18ఏళ్లలోపు యువత పెగ్గులు లాగించేస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నీరుగారుస్తున్నారు. స్నేహితులతో కలిసి మొదట సరదాగా మద్యం రుచి చూస్తున్న యువత రానురాను డోస్ పెంచేసి దానికి బానిసలుగా మారుతున్నారు. బంగారు భవిష్యత్తును చేతులారా చిదిమేసుకుంటున్నారు. అసోచామ్, పీటర్బర్గ్ విశ్వవిద్యాలయం వంటి సామాజిక అధ్యయన సంస్థలు తేటతెల్లం చేస్తున్న దిగ్భ్రాంతికర విషయాలు పరిశీలిస్తే ఉజ్వల భవితవ్యం ఉన్న యువభారతం పెడదోవ పడుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ బిడ్డల వ్యవహారశైలిపై ఓ కన్నేసి ఉండాల్సిందేనని మనస్తత్త్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నేరాలకు మూలమిదే.. సిగరెట్లు వద్దంటూనే, మందే ముద్దు అని యువత రెచ్చిపోతోంది. పెరుగుతున్న అశాంతి, నేరాలు, ఘోరాలకు ప్రధాన కారణం తాగిన మైకమేనని మనస్తత్వ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు చాటి చెబుతున్నా పట్టించుకుంటున్నవారే కరువవుతున్నారు. అమ్మాయిలు కూడా బాటిల్ మూతలు తెరుస్తున్నారు. దీనికి ఒత్తిడి, పాకెట్‌మనీలో విచ్చలవిడితనం, మితిమీరిన స్వేచ్ఛ, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణాలుగా స్పష్టమవుతోంది. అసోచామ్ సోషల్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఏఎస్డీఎఫ్) అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడైంది. ప్యారిస్‌కు చెందిన అర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) నివేదికను పరిశీలిస్తే భారత్‌లో 10 ఏళ్ల కాలంలో ఆల్కహాల్ వినియోగం 55 శాతం పెరిగిందని స్పష్టం చేస్తోంది. మరీ ముఖ్యంగా యువత, మహిళల్లో కూడా ఆల్కహాల్వినియోగం పెరిగిందని ఆ సంస్థ చెబుతూనే చిన్నారులు ఈ అలవాటు బారిన పడటం ఆందోళనకరమంటూ హెచ్చరించింది. ఈ అంశాల ఆధారంగా ఆసోచామ్, పీటర్బర్గ్ యూనివర్సిటీ సంయుక్తంగా టీనేజ్ డ్రింకింగ్‌పై దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అధ్యయనంలో 16 నుంచి 29 ఏళ్ల వయసున్న యువతపై ఆన్లైన్ క్లినికల్ ట్రైల్ చేపట్టింది. ఇందులో మూడో వంతు టీనేజర్లు తాము కాలేజీలో ప్రవేశించక మునుపే ఆల్కహాల్ టేస్ట్ చేస్తున్నారని తేల్చారు. 40 శాతం టీనేజర్లు తమకు 15–17 సంవత్సరాల వయసున్నప్పుడే మందు తాగామని చెప్పారు. 20–29 ఏళ్లు కలిగిన 69 శాతం మంది యువతీ, యువకులు తాము నూతన సంవత్సర, వీకెండ్ వేడుకల్లో మద్యం తాగామని ఒప్పుకుంటున్నారు. అయితే అమ్మాయిలకన్నా అబ్బాయిలే ఎక్కువగా తాగుతున్నారని గుర్తించారు. అధిక శాతం మంది యువతులు తమ పాకెట్ మనీలో గరిష్ట శాతం మూవీ టికెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కేఫ్ సెంటర్స్‌లోనే ఖర్చు చేస్తున్నామన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణే కీలకం తల్లిదండ్రులు ఆల్కహాల్‌ను పిల్లల ముందు సేవించడం, పిల్లలతో ఆనుబంధం సరిగాలేకపోవడం, విద్యా సమస్యలు, ఆల్కహాల్ తీసుకున్నా ఏమీకాదనే భావన, వ్యాపార ప్రకటనలు, చట్టాలు సరిగా అమలు చేయకపోవడం, బార్లలో ఆఫర్లు వంటివి యువత మద్యానికి ఆకర్షితులవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. విచ్చలవిడి పాకెట్‌మనీ ఎక్కువశాతం యువత వీకెండ్ వేడుకలు వచ్చాయంటే రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ఆల్కహాల్ మీదనే ఖర్చు చేస్తున్నారని, అధికశాతం ఆల్కహాల్ వినియోగిస్తున్న చిన్నారులు, టీనేజర్లు సంఘంలో ఉన్నత కుటుంబాలకు చెందిన వారేనని గుర్తించారు. యువతులు ఫ్రూటీఫ్లేవర్డ్ ఆల్కహాల్ ను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. ఇదీ ముప్పు ఆల్కహాల్ అధికంగా వినియోగించడం వల్ల స్వీయ ప్రమాదాలు కొనితెచ్చుకోవడం, హైరిస్క్, విచిత్ర మనస్తత్వ ధోరణి, సెక్సువల్ ప్రవర్తన, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ వ్యాధులు, అల్సర్లు, అసహనానికి లోనుకావడం(ఆల్కహాల్ డిపెడెన్సీ సిండ్రో మ్), హైపర్ టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. డీ ఎడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లాలి మద్యం మత్తులోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 25 ఏళ్లలోపే ఎక్కువ మంది మద్యానికి బానిసలవుతున్నారు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మద్యం అలవాటును నివారించేందుకు డీ ఎడిక్షన్ కంట్రోల్ కేంద్రాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వారికి తగిన విధంగా కౌన్సెలింగ్, చికిత్స అందించగలిగితే చాలా వరకు మార్పు వస్తుంది. – డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, హెచ్‌వోడీ మానసిక వైద్య విభాగం ఆరోగ్య సమస్యలకు మూలం తెలిసీతెలియని ప్రాయంలో ఒత్తిడిని అధిగమించాలనే ఉద్దేశంతో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మద్యం అనేక ఆరోగ్య సమస్యలకు మూలమని గమనించాలి. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో ఎక్కువగా మద్యం వ్యసనపరులే ఉంటున్నారు. మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు 20 ఏళ్లప్రాయంలోనే తలుపు తట్టడానికీ మద్యమే కారణం. – డాక్టర్ వైవీఎస్ ప్రభాకర్, ఫిజీషియన్ -
ఆన్లైన్ అదుర్స్!
తొలి 6 స్థానాలు పొందిన నగరాలివే.. 1 ఢిల్లీ 2 ముంబై 3 బెంగళూరు 4 చెన్నై 5 కోల్‌కతా 6 హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ వ్యాపారం అదుర్స్ అనిపించింది. దసరా.. దీపావళి పండుగలతో ఆన్లైన్ డీల్స్ హోరెత్తించడంతో వెబ్సైట్లు పండుగ చేసుకున్నాయి. నచ్చిన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయడంలో మెట్రో నగరాల ప్రజలు ముందున్నారు. ఈ విషయంలో గ్రేటర్ సిటిజన్లు ఆరో స్థానంలో నిలిచారు. స్మార్ట్ జనరేషన్గా మారుతోన్న కుర్రకారు ఈ విషయంలో అగ్రభాగాన నిలవడం విశేషం. ప్రధానంగా 18–35 వయస్సు గ్రూపులో ఉన్న యువతలో సుమారు 90 శాతం ఆన్లైన్ కొనుగోళ్లకే మక్కువ చూపుతున్నట్లు అసోచామ్ తాజా సర్వేలో వెల్లడైంది. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఆన్లైన్లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని పేర్కొంది. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి సర్వే వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా 15 మెట్రో నగరాల్లో ఆన్లైన్ ఈ కామర్స్ డీల్స్ సుమారు రూ.30 వేల కోట్ల మేర జరిగినట్లు అంచనా వేశారు. ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడానికి హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ఓ కారణమని అసోచామ్ పేర్కొంది. దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం ఈ కామర్స్ ఇండస్ట్రీకి వూతమిచ్చిందని ఈ సర్వే తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె, గుర్గావ్, నోయిడా, ఛండీగడ్, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్, హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఈ మెట్రో నగరాల్లో ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయని సర్వే గుర్తించింది. ఏం కొంటున్నారంటే... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, బ్రాండెడ్ షూస్, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల కొనుగోలుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారని సర్వేలో తేలింది. వీటిల్లోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. పురుషులే అధికం.. అసోచామ్ సర్వే ప్రకారం.. ఆన్లైన్ కొనుగోళ్లలో పురుషులదే ఆధిపత్యమని తేలింది. వీరి వాటా 65 శాతం ఉండగా.. స్త్రీలు 35 శాతం మంది ఆన్లైన్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పండగ సీజన్లో 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్లైన్ కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. నిత్యం ఆన్లైన్లో జరిగే కొనుగోళ్లలో యువతే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. 18–35 ఏళ్ల వయసు గలవారు అత్యధికంగా 90 శాతం మంది కొనుగోళ్లలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇక 36–45 ఏళ్ల మధ్య వయసున్న వారు 8 శాతం, 45–60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు రెండు శాతం మాత్రమే ఆన్లైన్లో కొనుగోళ్లు జరుపుతున్నారు. -
తగ్గుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య
అసోచామ్ సర్వే న్యూఢిల్లీ: దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పదేళ్ల కాలంలో 10 శాతం మేర పడిపోవడంతో తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అసోచామ్ ప్రభుత్వానికి సూచించింది. 2000-2005 మధ్య దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 34 శాతం నుంచి 37 శాతానికి పెరగగా... 2005 నుంచి 2014కు వచ్చేసరికి 27 శాతానికి పడిపోయినట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొనడాన్ని అసోచామ్ ‘భారత్‌లో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో ప్రధానంగా ప్రస్తావించింది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం ఉద్యోగావకాశాల కల్పన, వ్యాపార అవకాశాల సృష్టి ద్వారా మహిళల సాధికారతకు చర్యలు చేపట్టాలని కోరింది. మహిళా ఉద్యోగుల సంఖ్య పరంగా బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే అట్టడుగున ఉండడాన్ని ప్రముఖంగా పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్లో మహిళా ఉద్యోగులు 59 శాతం, రష్యాలో 57 శాతం, దక్షిణాఫ్రికాలో 45% ఉండగా, భారత్‌లో 27శాతంగా ఉంది. ఉన్నత విద్యావకాశాల్ని పొందలేకపోవడం, ఉద్యోగావకాశాలు లేకపోవడం, పని ప్రదేశంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల మహిళలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారని అసోచామ్ వెల్లడించింది. వివాహం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంది. -
భారత్ మండిపోతోంది!
పెరుగుతున్న ఉష్ణోగ్రతతో అల్లాడిపోతున్న దేశం ♦ 1960 నుంచి క్రమంగా తగ్గుతున్న రుతుపవనాలు ♦ వరి, గోధుమ ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం: స్కైమెట్, అసోచామ్ సర్వే న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో తేమ తగ్గిపోతుండటంతో.. పగలు, రాత్రి తేడా లేకుండా వేడి చుక్కలు చూపిస్తోంది. దీంతో లాతూర్ పరిస్థితే దేశవ్యాప్తంగా తలెత్తే సూచనలు కనబడుతున్నట్లు స్కైమెట్ సంస్థ, అసోచామ్ సంయుక్తం సర్వేలో తేలింది. శుక్రవారం వెల్లడైన ఈ సర్వే ప్రకారం.. రెండు వరుస కరువులతో భారత్ అల్లాడిపోతోండగా.. 9 రాష్ట్రాల్లో కరువు తాండవమాడుతోంది. 1960 నుంచి దేశంలో రుతుపవనాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని సర్వే తెలిపింది. ఇటీవలే భారత వాతావరణ శాఖ, స్కైమేట్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన.. ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఎల్‌నినోలో మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో శీతలగాలుల ఆధారంగా ఈసారి సాధారణ వానలుంటాయని అంచనా వేసింది. అయితే.. ఈ వర్షాలకు మరో రెండు నెలలు సమయమున్నా, ఆ లోపలే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో దేశంలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఈ సర్వే పేర్కొంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి కొరత తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. భారత సాగు రంగానికి తీవ్ర నష్టాలు తప్పవని సర్వే హెచ్చరించింది. హరిత విప్లవంతో సాధించినదంతా వ్యర్థమైపోతుందని పేర్కొం ది. ‘మొన్నటి చెన్నై వరదలు, ఎల్‌నినోతో వచ్చిన రెండు కరువులు, ఏడాదికేడాది రికార్డు ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ వాతావరణ మార్పుల పర్యవసానాలు. వీటిని అంచనా వేసి జాగ్రత్త పడకపోతే తీవ్రమైన దుర్భిక్షం తప్పదు. ఇది పర్యావరణానికి, మానవాళికి ప్రమాద సంకేతం’ అని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. మారుతున్న పరిస్థితులతో వరి వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ‘రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే 15 నుంచి 17 శాతం పంట తగ్గిపోతుందని సర్వే పేర్కొంది. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. ఇప్పటికే వరి, గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అంతే కాదు తక్కువ వ్యవధి పంటలు (కూరగాయలు, పళ్లు) కూడా ఈ వాతావరణంతో ప్రభావితమవుతున్నాయ’ని సర్వే పేర్కొంది. -
యూట్యూబ్‌లో పిల్లల మునక
న్యూఢిల్లీ: 13 ఏళ్లలోపు చిన్నారులను మొబైల్ షేరింగ్ వేదికలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధించడం తెలిసిందే. అయితే భారత్‌లో 7-13 ఏళ్ల వయసు పిల్లల్లో 76 శాతం మంది వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్‌ను చూస్తున్నారని అసోచామ్ సర్వేలో వెల్లడైంది. దీనిద్వారా సైబర్ బెదిరింపులు, లైంగిక నేరాలకు వాళ్లు బలవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. యూట్యూబ్‌లో ఖాతా నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో 7-13 ఏళ్ల వయసు చిన్నారులు.. ప్రత్యేకించి టైర్-1, టైర్-2 నగరాల్లో తల్లిదండ్రుల ఆమోదంతోనే సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారని సర్వేలో తేలింది. తమ వయసు ఎక్కువగా అందులో నమోదుచేసి అకౌంట్లు నిర్వహించడం, అందులో వీడియోలు చూడటం, అప్లోడ్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. మొదట్లో తమ పిల్లలు చురుగ్గా ఉన్నారని ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత వాటి దుష్ప్రభావాలను తెలుసుకునేసరికే జరగాల్సిన అనర్థాలు జరిగిపోతున్నాయి. -
మరిన్ని సంస్కరణలు కావాలి..
- రోడ్లు, విద్యుత్, బొగ్గు వంటి కీలక రంగాలపై దృష్టిపెట్టాలి - మోదీ సర్కారు ఏడాది పాలనపై అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల స్పందన న్యూఢిల్లీ: కీలక రంగాల్లో కేంద్రం మరిన్ని సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ సర్వేలో కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ విధమైన సూచనలు చేశారు. ‘రోడ్లు, విద్యుత్, బొగ్గు, సాంప్రదాయ ఇంధనం వంటి ప్రధానమైన రంగాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగాలి. వ్యవసాయ రంగంలో కూడా సాగునీరు, గ్రామీణ మౌలికసదుపాయాల అభివృద్ధి, విద్యుత్ సరఫరాల్లో భారీస్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. దీంతోపాటు ఎరువుల రాయితీలకు సంబంధించి రైతులకు మద్దతును కొనసాగించాల్సిందే’ అని సర్వే పేర్కొంది. తొలి ఏడాది పాలనలో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల కల్పన, కొన్ని మౌలిక ప్రాజెక్టులను పట్టాలెక్కించడం వంటి పలు చర్యలను చేపట్టారని.. అదేవిధంగా ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మరింత దృష్టిపెడతారని అంచనా వేస్తున్నట్లు అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన ధన యోజన వంటి పథకాలు పల్లెల్లో మంచి ఫలితాలివ్వనున్నాయని ఆయన పేర్కొన్నారు. బంగారం డిపాజిట్ స్కీమ్ మంచిదే... టెలికం, బ్యాంకింగ్, రియల్టీ వంటి కొన్ని రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని.. మరోపక్క, గ్లోబల్ డిమాండ్ మందగించడంతో ఎగుమతులు కూడా నేలచూపులు చూస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కపూర్ ప్రస్తావించారు. అయితే, ప్రతిపాదిత బంగారం డిపాజిట్ పథకం అమల్లోకి వస్తే... దేశంలోకి పుత్తడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటుకు కూడా కళ్లెం పడుతుందన్నారు. అత్యంత కీలక పన్ను సంస్కరణగా పేర్కొంటున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) చట్టరూపం దాల్చుతుందన్న విశ్వాసం కార్పొరేట్లలో నెలకొందని కూడా ఆయన చెప్పారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)పై కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు వివాదం పరిష్కారం కోసం నిపుణుల కమిటీని నియమించడంపట్ల కపూర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి రేటు జోరందుకోవాలంటే.. ముందుగా దేశీ డిమాండ్‌ను పెంచడం, ఉద్యోగాల కల్పనతో సెంటిమెంటును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అసోచామ్ పేర్కొంది. పర్యాటకం, విమానయానం వంటి రంగాలను ప్రోత్సహించడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకోవచ్చని కూడా సూచించింది. నిర్మాణం, రియల్టీ రంగాలు పుంజుకుంటే భారీస్థాయిలో ఉద్యోగాలను సృష్టించవచ్చని కూడా అభిప్రాయపడింది. తొలి ఏడాది భారీ పెట్టుబడుల్లేవు: సీఐఐ మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పాలనలో భారీ స్థాయి పెట్టుబడులేవీ రాలేదని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. వ్యాపారాలను సానుకూల పిరిస్థితులను కల్పించడంలో ఇంకా చాలా అడ్డంకులను తొలగించాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించింది. ‘పెట్టుబడులు క్రమంగా రానున్నాయి. కొన్ని నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ వర్గాలతో చర్చలను బట్టి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి ప్రభుత్వ చర్యలు ఫలితాలివ్వడం ప్రారంభం కావచ్చనిపిస్తోంది. అని సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ వ్యాఖ్యానించారు. -
పిల్లలకోసం కెరీర్ త్యాగం...
మహిళల తొలి ప్రాధాన్యం పిల్లల సంరక్షణే; తర్వాతే ఉద్యోగం చిన్నారుల ఎదుగుదలలోనే జీవితాన్ని ఆస్వాదిస్తున్న మహిళలు అసోచామ్ సర్వేలో వెల్లడి... మహిళలకు మాతృత్వపు మాధుర్యాన్ని మించిన ఆనందం, ఆస్తి మరొకటి ఉండదు. ప్రతి స్త్రీ తల్లి కావాలని పరి తపిస్తుంది. పిల్లల ఎదుగుదలకు, సంరక్షణ కోసం ఎంతగానో శ్రమిస్తుంది. పిల్లలనే తన ప్రపంచంగా మార్చుకుంటుంది. అమ్మతనంలోని కమ్మని క్షణాలను తొలిసారి ఆస్వాదించిన మహిళ లు పిల్లల భవిష్యత్తు కోసం వారి కెరీర్‌ను సైతం వదులుకుంటున్నారు. పిల్లల కోసం ఉద్యోగాలకు రాజీనామా చేసి వారి సంరక్షణ, పెంపకాన్నే ఒక ఉద్యోగంలా స్వీకరిస్తున్నారు. ఈ విషయం అసోచామ్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అసోచామ్‌కు సంబంధించిన సోషల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, ఢిల్లీ వంటి 10 ప్రధాన నగరాలలో నివసిస్తున్న 25-30 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు 400 మంది మహిళలపై సర్వే నిర్వహించింది. మార్చి-ఏప్రిల్ మధ్య కాలంలో అసోచామ్ ఈ సర్వే నిర్వహించింది. ఉద్యోగాలు త్యాగం... పట్టణ ప్రాంతాలలోని బాగా చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న మహిళలు ఎక్కువగా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఉద్యోగాలకు స్వస్తిపలుకుతున్నారనే అంశం సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న మొత్తం మహిళలలో (తొలిసారి మాతృత్వపు మాధుర్యం ఎరిగిన వారు) దాదాపు 1/4 వంతు మంది పిల్లల పెంపకం కోసం వారి ఉద్యోగాలను వదిలేశారు. అలాగే కొందరు మహిళలు వారి పిల్లలకు స్కూల్‌కు వెళ్లే వయసు వచ్చిన తర్వాత తిరిగి కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో వారు గతంలో చేసిన ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేయడానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీనికి కారణం సహోద్యోగులు వారిపట్ల వివక్ష చూపిస్తారనే భయం. సున్నిత అంశం... పిల్లల ఎదుగుదలలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి కొందరు మహిళలు ఇంటి వద్ద నుంచే ఉద్యోగ బాధ్యతలను నిర్వహించడానికి సుముఖత చూపుతున్నారు. తమ పిల్లలు ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి ఎంతటి త్యాగానికైనా మాతృమూర్తులు సిద్ధమంటున్నారు. కుటుంబ పరిస్థితులు, ఒత్తిడి, భావోద్వేగాలు, సామాజిక బాధ్యతలు వంటి అంశాల వల్ల ప్రస్తుతం మహిళలకు పిల్లల పెంపకం ఒక సున్నితమైన అంశంగా పరిణమించిందని అసోచామ్ జనరల్ సెక్రటరీ రావత్ అభిప్రాయపడ్డారు. -
జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం!
అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల అభిప్రాయం న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం పైనే ఉండొచ్చన్న ప్రభుత్వ అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని.. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టడం లేదని మెజారిటీ కార్పొరేట్లు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ‘కొత్త డేటా ప్రకారం 7 శాతంపైగా వృద్ధి రేటు మరీ ఆశాజనకంగా ఉంది. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో ఇంత సానుకూల పరిస్థితులేమీ కనబడటం లేదు’ అని కార్పొరేట్ సారథులు వ్యాఖ్యానించారు. బడ్జెట్ తర్వాత జరిపిన ఈ సర్వేలో వివిధ కంపెనీలకు చెందిన 189 మంది సీఈఓలు, సీఎఫ్ఓలు పాల్గొన్నారు. బేస్ సంవత్సరాన్ని మార్చడం(2004-05 నుంచి 2001-12కు)తో ఈ ఏడాది(2014-15) జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదుకానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2013-14 వృద్ధి గణాంకాలను సవరించారు. 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు. కాగా, పాత బేస్ ఇయర్ ప్రకారం ఈ ఏడాది వృద్ధి రేటు 5.5 శాతంగా గతంలో కేంద్రం అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో వృద్ధి రేటు 8.1-8.5% స్థాయిలో ఉండొచ్చని బడ్జెట్లో జైట్లీ ప్రకటించడం విదితమే. సర్వేలో ఇతర ముఖ్యాంశాలివీ.. ⇒ కొత్త డేటా ప్రకారం ప్రభుత్వ ఆశావహ అంచనాలు సరైనవేనన్న అభిప్రాయానికి రావాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 71 శాతం సీఈఓలు పేర్కొన్నారు. ⇒ అమ్మకాలు భారీగా పుంజుకోవడం, ఉత్పాదకత మరింత మెరుగుపడాల్సి ఉందని 68 శాతం సీఎఫ్ఓలు అభిప్రాయపడ్డారు. ⇒ బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన పలు కీలక ప్రతిపాదనలు, చర్యలు కార్యరూపందాల్చి ఫలితాలు వచ్చేందుకు కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ⇒ చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ)ల కోసం ముద్రా బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల పెంపు, ఇన్ఫ్రా రంగానికి బూస్ట్ ఇచ్చేలా తీసుకున్న చర్యలు, కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రతిపాదనలను ఆయన ఉదహరించారు. ⇒ ఈ ఏడాదికి 7 శాతంపైనే వృద్ధి అంచనాలను చూస్తే.. భారత్ ఎన్నడూ మందగమనాన్ని చవిచూడనట్లు లెక్క అని కూడా అసోచామ్ వ్యాఖ్యానించింది. ⇒ గతేడాది ఆర్థిక వ్యవస్థ ఎంత గడ్డుకాలాన్ని ఎదుర్కొందో పరిశ్రమవర్గాలు అందరికీ తెలిసిందే. అయినా, వృద్ధి రేటును 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచడాన్ని(కొత్త బేస్ ఇయర్ ప్రకారం) కార్పొరేట్లు గుర్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌కు ఎన్నారై పెట్టుబడులు నో!
సాక్షి, హైదరాబాద్: అనుకున్న వెంటనే పెట్టుబడులు పెట్టగలిగేది.. దీర్ఘకాలికంగా లాభాలు ఆర్జించేది స్థిరాస్తి రంగమే. కానీ, ఈ విషయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాసింత దూరంలోనే ఉందంటోంది అసోచామ్ సర్వే. ఏడాది కాలంగా డాలర్ విలువ పెరగటం, ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలూ కల్పిస్తున్నా.. హైదరాబాద్‌కు ఎన్నారై పెట్టుబడులు రావట్లేదని అసోచామ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఎన్నారై పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్‌కు స్థానమే దక్కలేదు. సర్వేలోని పలు అంశాలివే.. స్థిరాస్తి రంగంలో ఎన్నారై పెట్టుబడులు ఏ స్థాయిలో ఉంటున్నాయనే అంశంపై ఢిల్లీ, చండీఘడ్, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, డెహ్రాడూన్, చెన్నై నగరాల్లో దాదాపు 850 స్థిరాస్తి సంస్థలతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది హై ఎండ్ ప్రాపర్టీలు, వాణిజ్య సముదాయాల్లోనే ఎన్నారై పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతేడాది బెంగళూరులోని మొత్తం స్థిరాస్తి పెట్టుబడుల్లో 18 శాతంగా ఉన్న ఎన్నారై పెట్టుబడులు ఈ ఏడాది 35 శాతానికి పెరిగాయని సర్వే చెబుతోంది. ఇందుకు కారణం.. బెంగళూరులో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్లే. 2,200 ఐటీ కంపెనీలు, 664 ఎంఎన్‌సీలు, 183 బయోటెక్నాలజీ కంపెనీలు, 248 బీపీఓలు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ (32 శాతం), పుణే (30.5 శాతం), చెన్నై (28 శాతం), గోవా (23 శాతం) నిలిచాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో మాత్రం గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 21 శాతం ఎన్నారై ఎక్వయిరీలు పెరిగాయే కానీ, పెట్టుబడులు మాత్రం ఆ స్థాయిలో రాలేదని సర్వే చెబుతోంది. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, నిబంధనలను సరళీకృతం చేయటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కారణంగా దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి యూఎస్, యూఏఈ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి సంస్థలూ ప్రాపర్టీ షోలు నిర్వహించటం, విదేశాల్లో కార్యాలయాలను ప్రారంభించటం, ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తుండటం వంటివి మరింతగా కలిసొస్తుందని అసోచామ్ సర్వే సారాంశం. -
రేపే రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఈ నెల 5న (మంగళవారం)చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో స్వల్పంగా వడ్డీరేట్ల ఊరట ఉండొచ్చని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇరాక్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో భారీగా రేట్ల తగ్గింపునకు ఆస్కారం లేదని అసోచామ్ సర్వేలో కార్పొరేట్లు అభిప్రాయపడ్డారు. సర్వేలో సుమారు 73 శాతం మంది సీఈఓలు, సీఎఫ్‌లు ఇతరత్రా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇదేవిధంగా అంచనా వేశారు. వర్షపాతం కొరత నేపథ్యంలో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకే అవకాశం ఉందని... పాలసీ సమీక్షలో ఆర్బీఐ చేతులుకట్టేసేందుకు ఇదే ప్రధాన కారకంగా నిలవొచ్చని సర్వేలో అభిప్రాయపడ్డారు. కాగా, ఇరాక్, సిరియా, ఉక్రెయిన్ ఘర్షణల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై చూపే ప్రభావాన్ని ఆర్బీఐ పాలసీలో ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవచ్చని 181 మంది కార్పొరేట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా వదిలేసిన సంగతి తెలిసిందే. మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధికి చేయూతనివ్వాలంటే వడ్డీరేట్లను తగ్గించాలంటూ కార్పొరేట్లు పదేపదే చేసిన డిమాండ్లను పక్కనబెట్టి.. ద్రవ్యోల్బణం కట్టడికే రాజన్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్ఎల్ఆర్)ను అరశాతం తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి రూ.40 వేల కోట్ల నిధులు వచ్చేల చేయడం కొంత సానుకూలాంశం. ప్రస్తుతం రెపో రేటు 8%, రివర్స్ రెపో 7%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4% వద్ద ఉన్నాయి. బ్యాంకర్ల మాట...: రేపు చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని భావిస్తున్నట్లు ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.