భారత్ మండిపోతోంది!
పెరుగుతున్న ఉష్ణోగ్రతతో అల్లాడిపోతున్న దేశం
♦ 1960 నుంచి క్రమంగా తగ్గుతున్న రుతుపవనాలు
♦ వరి, గోధుమ ఉత్పత్తిపైనా తీవ్ర ప్రభావం: స్కైమెట్, అసోచామ్ సర్వే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో తేమ తగ్గిపోతుండటంతో.. పగలు, రాత్రి తేడా లేకుండా వేడి చుక్కలు చూపిస్తోంది. దీంతో లాతూర్ పరిస్థితే దేశవ్యాప్తంగా తలెత్తే సూచనలు కనబడుతున్నట్లు స్కైమెట్ సంస్థ, అసోచామ్ సంయుక్తం సర్వేలో తేలింది. శుక్రవారం వెల్లడైన ఈ సర్వే ప్రకారం.. రెండు వరుస కరువులతో భారత్ అల్లాడిపోతోండగా.. 9 రాష్ట్రాల్లో కరువు తాండవమాడుతోంది. 1960 నుంచి దేశంలో రుతుపవనాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని సర్వే తెలిపింది. ఇటీవలే భారత వాతావరణ శాఖ, స్కైమేట్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన.. ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
ఎల్‌నినోలో మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో శీతలగాలుల ఆధారంగా ఈసారి సాధారణ వానలుంటాయని అంచనా వేసింది. అయితే.. ఈ వర్షాలకు మరో రెండు నెలలు సమయమున్నా, ఆ లోపలే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో దేశంలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఈ సర్వే పేర్కొంది. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నీటి కొరత తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. భారత సాగు రంగానికి తీవ్ర నష్టాలు తప్పవని సర్వే హెచ్చరించింది. హరిత విప్లవంతో సాధించినదంతా వ్యర్థమైపోతుందని పేర్కొం ది. ‘మొన్నటి చెన్నై వరదలు, ఎల్‌నినోతో వచ్చిన రెండు కరువులు, ఏడాదికేడాది రికార్డు ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ వాతావరణ మార్పుల పర్యవసానాలు. వీటిని అంచనా వేసి జాగ్రత్త పడకపోతే తీవ్రమైన దుర్భిక్షం తప్పదు.
ఇది పర్యావరణానికి, మానవాళికి ప్రమాద సంకేతం’ అని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. మారుతున్న పరిస్థితులతో వరి వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ‘రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే 15 నుంచి 17 శాతం పంట తగ్గిపోతుందని సర్వే పేర్కొంది. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. ఇప్పటికే వరి, గోధుమల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతూ వస్తోంది. అంతే కాదు తక్కువ వ్యవధి పంటలు (కూరగాయలు, పళ్లు) కూడా ఈ వాతావరణంతో ప్రభావితమవుతున్నాయ’ని సర్వే పేర్కొంది.