యూట్యూబ్‌లో పిల్లల మునక
న్యూఢిల్లీ: 13 ఏళ్లలోపు చిన్నారులను మొబైల్ షేరింగ్ వేదికలకు దూరంగా ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధించడం తెలిసిందే. అయితే భారత్‌లో 7-13 ఏళ్ల వయసు పిల్లల్లో 76 శాతం మంది వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌ను చూస్తున్నారని అసోచామ్ సర్వేలో వెల్లడైంది. దీనిద్వారా సైబర్ బెదిరింపులు, లైంగిక నేరాలకు వాళ్లు బలవుతున్నారని నివేదిక స్పష్టం చేసింది.
యూట్యూబ్‌లో ఖాతా నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో 7-13 ఏళ్ల వయసు చిన్నారులు.. ప్రత్యేకించి టైర్-1, టైర్-2 నగరాల్లో తల్లిదండ్రుల ఆమోదంతోనే సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారని సర్వేలో తేలింది. తమ వయసు ఎక్కువగా అందులో నమోదుచేసి అకౌంట్లు నిర్వహించడం, అందులో వీడియోలు చూడటం, అప్‌లోడ్ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. మొదట్లో తమ పిల్లలు చురుగ్గా ఉన్నారని ముచ్చట పడుతున్న తల్లిదండ్రులు.. ఆ తర్వాత వాటి దుష్ప్రభావాలను తెలుసుకునేసరికే జరగాల్సిన అనర్థాలు జరిగిపోతున్నాయి.