జీడీపీ అంచనాలు.. వాస్తవానికి దూరం!
అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల అభిప్రాయం
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7 శాతం పైనే ఉండొచ్చన్న ప్రభుత్వ అంచనాలు అతిశయోక్తిగా ఉన్నాయని.. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టడం లేదని మెజారిటీ కార్పొరేట్లు అభిప్రాయపడుతున్నారు. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన సర్వేలో 76 శాతం మంది ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ‘కొత్త డేటా ప్రకారం 7 శాతంపైగా వృద్ధి రేటు మరీ ఆశాజనకంగా ఉంది.
వాస్తవానికి ఆర్థిక వ్యవస్థలో ఇంత సానుకూల పరిస్థితులేమీ కనబడటం లేదు’ అని కార్పొరేట్ సారథులు వ్యాఖ్యానించారు. బడ్జెట్ తర్వాత జరిపిన ఈ సర్వేలో వివిధ కంపెనీలకు చెందిన 189 మంది సీఈఓలు, సీఎఫ్‌ఓలు పాల్గొన్నారు. బేస్ సంవత్సరాన్ని మార్చడం(2004-05 నుంచి 2001-12కు)తో ఈ ఏడాది(2014-15) జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదుకానుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. 2013-14 వృద్ధి గణాంకాలను సవరించారు. 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచారు. కాగా, పాత బేస్ ఇయర్ ప్రకారం ఈ ఏడాది వృద్ధి రేటు 5.5 శాతంగా గతంలో కేంద్రం అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో వృద్ధి రేటు 8.1-8.5% స్థాయిలో ఉండొచ్చని బడ్జెట్‌లో జైట్లీ ప్రకటించడం విదితమే. సర్వేలో ఇతర ముఖ్యాంశాలివీ..
⇒ కొత్త డేటా ప్రకారం ప్రభుత్వ ఆశావహ అంచనాలు సరైనవేనన్న అభిప్రాయానికి రావాలంటే మరికొన్నాళ్లు వేచిచూడాల్సి ఉంటుందని సర్వేలో పాల్గొన్న 71 శాతం సీఈఓలు పేర్కొన్నారు.
⇒ అమ్మకాలు భారీగా పుంజుకోవడం, ఉత్పాదకత మరింత మెరుగుపడాల్సి ఉందని 68 శాతం సీఎఫ్‌ఓలు అభిప్రాయపడ్డారు.
⇒ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన పలు కీలక ప్రతిపాదనలు, చర్యలు కార్యరూపందాల్చి ఫలితాలు వచ్చేందుకు కొన్ని అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.
⇒ చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ)ల కోసం ముద్రా బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల పెంపు, ఇన్‌ఫ్రా రంగానికి బూస్ట్ ఇచ్చేలా తీసుకున్న చర్యలు, కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించే ప్రతిపాదనలను ఆయన ఉదహరించారు.
⇒ ఈ ఏడాదికి 7 శాతంపైనే వృద్ధి అంచనాలను చూస్తే.. భారత్ ఎన్నడూ మందగమనాన్ని చవిచూడనట్లు లెక్క అని కూడా అసోచామ్ వ్యాఖ్యానించింది.
⇒ గతేడాది ఆర్థిక వ్యవస్థ ఎంత గడ్డుకాలాన్ని ఎదుర్కొందో పరిశ్రమవర్గాలు అందరికీ తెలిసిందే. అయినా, వృద్ధి రేటును 4.7 శాతం నుంచి 6.9 శాతానికి పెంచడాన్ని(కొత్త బేస్ ఇయర్ ప్రకారం) కార్పొరేట్లు గుర్తు చేస్తున్నారు.