న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ నెల 5న (మంగళవారం)చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో స్వల్పంగా వడ్డీరేట్ల ఊరట ఉండొచ్చని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇరాక్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో భారీగా రేట్ల తగ్గింపునకు ఆస్కారం లేదని అసోచామ్ సర్వేలో కార్పొరేట్లు అభిప్రాయపడ్డారు.
సర్వేలో సుమారు 73 శాతం మంది సీఈఓలు, సీఎఫ్‌లు ఇతరత్రా కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇదేవిధంగా అంచనా వేశారు. వర్షపాతం కొరత నేపథ్యంలో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకే అవకాశం ఉందని... పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ చేతులుకట్టేసేందుకు ఇదే ప్రధాన కారకంగా నిలవొచ్చని సర్వేలో అభిప్రాయపడ్డారు. కాగా, ఇరాక్, సిరియా, ఉక్రెయిన్ ఘర్షణల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై చూపే ప్రభావాన్ని ఆర్‌బీఐ పాలసీలో ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవచ్చని 181 మంది కార్పొరేట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
గత సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వరుసగా రెండోసారి కీలక పాలసీ రేట్లను యథాతథంగా వదిలేసిన సంగతి తెలిసిందే. మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధికి చేయూతనివ్వాలంటే వడ్డీరేట్లను తగ్గించాలంటూ కార్పొరేట్లు పదేపదే చేసిన డిమాండ్‌లను పక్కనబెట్టి.. ద్రవ్యోల్బణం కట్టడికే రాజన్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ను అరశాతం తగ్గించడం ద్వారా వ్యవస్థలోకి రూ.40 వేల కోట్ల నిధులు వచ్చేల చేయడం కొంత సానుకూలాంశం. ప్రస్తుతం రెపో రేటు 8%, రివర్స్ రెపో 7%, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4% వద్ద ఉన్నాయి.
బ్యాంకర్ల మాట...: రేపు చేపట్టనున్న పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రేపే రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష...
Published Mon, Aug 4 2014 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM
Advertisement
Advertisement