మరిన్ని సంస్కరణలు కావాలి..
- రోడ్లు, విద్యుత్, బొగ్గు వంటి కీలక రంగాలపై దృష్టిపెట్టాలి
- మోదీ సర్కారు ఏడాది పాలనపై అసోచామ్ సర్వేలో కార్పొరేట్ల స్పందన
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో కేంద్రం మరిన్ని సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక మండలి అసోచామ్ సర్వేలో కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా వచ్చే రెండు త్రైమాసికాల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ విధమైన సూచనలు చేశారు. ‘రోడ్లు, విద్యుత్, బొగ్గు, సాంప్రదాయ ఇంధనం వంటి ప్రధానమైన రంగాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరగాలి.
వ్యవసాయ రంగంలో కూడా సాగునీరు, గ్రామీణ మౌలికసదుపాయాల అభివృద్ధి, విద్యుత్ సరఫరాల్లో భారీస్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు అవసరం. దీంతోపాటు ఎరువుల రాయితీలకు సంబంధించి రైతులకు మద్దతును కొనసాగించాల్సిందే’ అని సర్వే పేర్కొంది. తొలి ఏడాది పాలనలో వ్యాపారాలకు అనువైన పరిస్థితుల కల్పన, కొన్ని మౌలిక ప్రాజెక్టులను పట్టాలెక్కించడం వంటి పలు చర్యలను చేపట్టారని.. అదేవిధంగా ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మరింత దృష్టిపెడతారని అంచనా వేస్తున్నట్లు అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు. అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన ధన యోజన వంటి పథకాలు పల్లెల్లో మంచి ఫలితాలివ్వనున్నాయని ఆయన పేర్కొన్నారు.
బంగారం డిపాజిట్ స్కీమ్ మంచిదే...
టెలికం, బ్యాంకింగ్, రియల్టీ వంటి కొన్ని రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని.. మరోపక్క, గ్లోబల్ డిమాండ్ మందగించడంతో ఎగుమతులు కూడా నేలచూపులు చూస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కపూర్ ప్రస్తావించారు. అయితే, ప్రతిపాదిత బంగారం డిపాజిట్ పథకం అమల్లోకి వస్తే... దేశంలోకి పుత్తడి దిగుమతులు తగ్గుముఖం పట్టడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటుకు కూడా కళ్లెం పడుతుందన్నారు. అత్యంత కీలక పన్ను సంస్కరణగా పేర్కొంటున్న వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) చట్టరూపం దాల్చుతుందన్న విశ్వాసం కార్పొరేట్లలో నెలకొందని కూడా ఆయన చెప్పారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)పై కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపు వివాదం పరిష్కారం కోసం నిపుణుల కమిటీని నియమించడంపట్ల కపూర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక వృద్ధి రేటు జోరందుకోవాలంటే.. ముందుగా దేశీ డిమాండ్‌ను పెంచడం, ఉద్యోగాల కల్పనతో సెంటిమెంటును మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అసోచామ్ పేర్కొంది. పర్యాటకం, విమానయానం వంటి రంగాలను ప్రోత్సహించడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకోవచ్చని కూడా సూచించింది. నిర్మాణం, రియల్టీ రంగాలు పుంజుకుంటే భారీస్థాయిలో ఉద్యోగాలను సృష్టించవచ్చని కూడా అభిప్రాయపడింది.
తొలి ఏడాది భారీ పెట్టుబడుల్లేవు: సీఐఐ
మోదీ ప్రభుత్వం తొలి ఏడాది పాలనలో భారీ స్థాయి పెట్టుబడులేవీ రాలేదని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. వ్యాపారాలను సానుకూల పిరిస్థితులను కల్పించడంలో ఇంకా చాలా అడ్డంకులను తొలగించాల్సి ఉందని కూడా వ్యాఖ్యానించింది. ‘పెట్టుబడులు క్రమంగా రానున్నాయి. కొన్ని నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ వర్గాలతో చర్చలను బట్టి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం మూడు లేదా నాలుగో త్రైమాసికం నాటికి ప్రభుత్వ చర్యలు ఫలితాలివ్వడం ప్రారంభం కావచ్చనిపిస్తోంది. అని సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ వ్యాఖ్యానించారు.