సన్నగిల్లిన వ్యాపార విశ్వాసం
న్యూఢిల్లీ: ప్రస్తుత, భవిష్యత్ వ్యాపార పరిస్థితులపై కార్పొరేట్లలో విశ్వాసం గణనీయంగా క్షీణించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటుకన్నా ముందు స్థాయికి తగ్గిపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల్లో ప్రస్తుతం నెలకొన్న సెంటిమెంట్ ఆధారంగా డాయిష్ బార్స్ నిర్వహించే ఎంఎన్‌ఐ ఇండియా బిజినెస్ సెంటిమెంట్ ఇండికేటర్ దీనికి నిదర్శనం. ఏప్రిల్ 63.9గా ఉన్న సూచీ మే లో 2.5 శాతం తగ్గి 62.3కి తగ్గిపోయింది. గతేడాది ఏప్రిల్ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయని ఎంఎన్‌ఐ ఇండికేటర్స్ చీఫ్ ఎకానమిస్ట్ ఫిలిప్ యుగ్లో తెలిపారు.
ఇటు ఉత్పత్తి, అటు ఆర్డర్లు తగ్గడం వల్లే వ్యాపార కార్యకలాపాలు తగ్గాయని ఆయన వివరించారు. మేలో ఉత్పత్తి దాదాపు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా ప్రాజెక్టు క్షేత్ర స్థాయిలో అంతగా ముందుకెళ్లడం లేదని ఈ సర్వే ద్వారా తెలుస్తోందని యుగ్లో పేర్కొన్నారు. సర్వే ప్రకారం కంపెనీలకొచ్చే దేశీ, విదేశీ ఆర్డర్లు తగ్గాయి. కొత్త ఆర్డర్లకు సంబంధించిన సూచీ 57.1కి తగ్గింది. మే 2013 తర్వాత ఇదే కనిష్ట స్థాయి.
ఇక ఎగుమతుల ఆర్డర్లు 2013 జూన్ తర్వాత కనిష్టం 53.6కి తగ్గాయి. డిమాండ్ బలహీనంగా ఉండటం, పోటీ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని సర్వే నివేదిక పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది రెండు సార్లు కీలక పాలసీ రేట్లలో కోత విధించినప్పటికీ ఆ ప్రయోజనాల ప్రభా వం పరిమితంగానే ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జూన్ 2న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నట్లు యుగ్లో తెలిపారు.